రాజులు మొదటి గ్రంథం 1:1-53

  • దావీదు, అబీషగు (1-4)

  • అదోనీయా రాజు అవ్వాలనుకోవడం (5-10)

  • నాతాను, బత్షెబ చర్య తీసుకోవడం (11-27)

  • సొలొమోనును అభిషేకించమని దావీదు ఆదేశించడం (28-40)

  • అదోనీయా బలిపీఠం దగ్గరికి పారిపోవడం (41-53)

1  దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు,+ ఎన్ని దుప్పట్లు కప్పినా అతనికి వెచ్చదనం కలగడం లేదు.  కాబట్టి దావీదు సేవకులు అతనితో, “మా ప్రభువైన రాజా, నీ కోసం కన్యయైన ఒక అమ్మాయిని వెదకనివ్వు; ఆమె రాజుకు సేవచేస్తూ రాజు బాగోగులు చూసుకుంటుంది. మా ప్రభువైన రాజుకు వెచ్చదనం కలిగేలా ఆమె రాజు కౌగిట్లో పడుకుంటుంది” అన్నారు.  వాళ్లు ఒక అందమైన అమ్మాయి కోసం ఇశ్రాయేలు ప్రాంతమంతటా వెదికి, షూనేమీయురాలైన+ అబీషగును+ చూసి ఆమెను రాజు దగ్గరికి తీసుకొచ్చారు.  ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది; ఆమె రాజు బాగోగులు చూసుకుంటూ అతనికి సేవచేస్తూ ఉండేది; కానీ రాజు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు.  ఈలోగా, హగ్గీతు కుమారుడైన అదోనీయా,+ “నేను రాజునవుతాను!” అంటూ తనను తాను హెచ్చించుకున్నాడు. అతను ఒక రథాన్ని చేయించుకుని, తన ముందు పరుగెత్తడానికి గుర్రపురౌతుల్ని, 50 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు.+  అయితే అతని తండ్రి అతన్ని, “నువ్వు ఇలా ఎందుకు చేశావు?” అంటూ ఎప్పుడూ నిలదీయలేదు.* అదోనీయా కూడా చాలా అందంగా ఉంటాడు, అతను అబ్షాలోము తర్వాత పుట్టినవాడు.  అదోనీయా సెరూయా కుమారుడైన యోవాబుతో, యాజకుడైన అబ్యాతారుతో+ మాట్లాడాడు; వాళ్లు అతనికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.+  అయితే యాజకుడైన సాదోకు,+ యెహోయాదా కుమారుడైన బెనాయా,+ నాతాను+ ప్రవక్త, షిమీ,+ రేయీ, దావీదు బలమైన యోధులు+ అదోనీయాకు మద్దతివ్వలేదు.  ఒకరోజు అదోనీయా, ఏన్రోగేలు దగ్గర్లోని జోహెలేతు రాయి దగ్గర గొర్రెల్ని, పశువుల్ని, కొవ్విన జంతువుల్ని బలి అర్పించాడు;+ అతను రాకుమారులైన తన సహోదరులందర్నీ, రాజు సేవకులైన యూదా మనుషులందర్నీ దానికి ఆహ్వానించాడు. 10  కానీ అతను నాతాను ప్రవక్తను, బెనాయాను, బలమైన యోధుల్ని, తన సహోదరుడు సొలొమోనును ఆహ్వానించలేదు. 11  అప్పుడు నాతాను,+ సొలొమోను తల్లియైన+ బత్షెబ+ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “హగ్గీతు కుమారుడైన అదోనీయా+ రాజయ్యాడని, మన ప్రభువైన దావీదుకు దాని గురించి ఏమీ తెలీదని నువ్వు వినలేదా? 12  కాబట్టి దయచేసి నా సలహా విను; అప్పుడే నువ్వు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని రక్షించుకుంటావు.+ 13  నువ్వు దావీదు రాజు దగ్గరికి వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, “నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు, అతనే నా సింహాసనం మీద కూర్చుంటాడు”+ అని నువ్వే నీ సేవకురాలితో ప్రమాణం చేశావు కదా? మరి అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు. 14  నువ్వు రాజుతో మాట్లాడుతుండగా నేను నీ వెనక వచ్చి, నువ్వు చెప్పేది నిజమని రాజుతో అంటాను.” 15  కాబట్టి బత్షెబ రాజు దగ్గరికి, అతని లోపలి గదిలోకి వెళ్లింది. రాజు బాగా ముసలివాడయ్యాడు, షూనేమీయురాలైన అబీషగు+ రాజుకు సేవచేస్తూ ఉంది. 16  బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది; అప్పుడు రాజు, “నీకేం కావాలి?” అని అడిగాడు. 17  ఆమె ఇలా అంది: “నా ప్రభూ, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు, అతనే నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని నువ్వే నీ దేవుడైన యెహోవా పేరున నీ సేవకురాలితో ప్రమాణం చేశావు.+ 18  కానీ ఇప్పుడేమో అదోనీయా రాజయ్యాడు, నా ప్రభువైన రాజుకు దాని గురించి ఏమీ తెలీదు.+ 19  అదోనీయా పెద్ద సంఖ్యలో ఎద్దుల్ని, కొవ్విన జంతువుల్ని, గొర్రెల్ని బలి అర్పించి రాకుమారులందర్నీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతైన యోవాబును ఆహ్వానించాడు.+ కానీ నీ సేవకుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించలేదు.+ 20  నా ప్రభువైన రాజా, నీ తర్వాత నా ప్రభువైన రాజు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో నువ్వు చెప్తావని ఇశ్రాయేలీయులందరి కళ్లు నీవైపే చూస్తున్నాయి. 21  లేకపోతే నా ప్రభువైన రాజా, నువ్వు చనిపోగానే,* నన్నూ నా కుమారుడైన సొలొమోనునూ ద్రోహులుగా ఎంచుతారు.” 22  ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతుండగా నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు.+ 23  “ఇదిగో, నాతాను ప్రవక్త వచ్చాడు!” అని రాజుకు తెలియజేశారు. అతను రాజు ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. 24  నాతాను ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, ‘నా తర్వాత అదోనీయా రాజవుతాడు, అతనే నా సింహాసనం మీద కూర్చుంటాడు’+ అని నువ్వు చెప్పావా? 25  ఎందుకంటే, అతను ఈ రోజు పెద్ద సంఖ్యలో ఎద్దుల్ని, కొవ్విన జంతువుల్ని, గొర్రెల్ని బలి అర్పించడానికి వెళ్లాడు.+ అతను రాకుమారులందర్నీ, సైన్యాధిపతుల్ని, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు.+ వాళ్లు అక్కడ అతనితో కలిసి తింటూ తాగుతూ, ‘అదోనీయా రాజు దీర్ఘకాలం జీవించాలి!’ అని అంటూ ఉన్నారు. 26  అయితే అతను నీ సేవకుడినైన నన్ను గానీ, యాజకుడైన సాదోకును గానీ, యెహోయాదా కుమారుడైన బెనాయాను+ గానీ, నీ సేవకుడైన సొలొమోనును గానీ పిలవలేదు. 27  నా ప్రభువైన రాజా, నువ్వే ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చావా? నా ప్రభువైన రాజా, నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో నువ్వు నీ సేవకుడినైన నాకు చెప్పలేదు.” 28  అప్పుడు దావీదు రాజు, “బత్షెబను పిలవండి” అన్నాడు. ఆమె లోపలికి వచ్చి రాజు ఎదుట నిలబడింది. 29  రాజు ఆమెతో ఇలా ఒట్టేశాడు: “కష్టాలన్నిట్లో నుండి నన్ను రక్షించిన*+ యెహోవా జీవం తోడు, 30  ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు, అతనే నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు’ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున నేను నీతో ప్రమాణం చేసినట్టే ఈ రోజు జరిగిస్తాను.” 31  అప్పుడు బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, “నా ప్రభువైన దావీదు రాజు సదాకాలం జీవించాలి!” అంది. 32  వెంటనే దావీదు రాజు, “యాజకుడైన సాదోకును, నాతాను ప్రవక్తను, యెహోయాదా+ కుమారుడైన బెనాయాను+ పిలిపించండి” అన్నాడు. దాంతో వాళ్లు రాజు ముందుకు వచ్చారు. 33  రాజు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ ప్రభువు సేవకుల్ని మీతోపాటు తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి+ గీహోనుకు+ తీసుకెళ్లండి. 34  యాజకుడైన సాదోకు, నాతాను ప్రవక్త అక్కడ సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు.+ అప్పుడు మీరు బూర* ఊదుతూ, ‘సొలొమోను రాజు దీర్ఘకాలం జీవించాలి!’ అని కేకలు వేయండి.+ 35  అతను తిరిగొస్తున్నప్పుడు మీరు అతని వెంట రావాలి. అతను వచ్చి నా సింహాసనం మీద కూర్చుని, నా స్థానంలో రాజవుతాడు; నేను అతన్ని ఇశ్రాయేలు మీద, యూదా మీద నాయకునిగా నియమిస్తాను.” 36  వెంటనే యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో ఇలా అన్నాడు: “ఆమేన్‌! నా ప్రభువైన రాజు దేవుడైన యెహోవా ఆ విధంగానే చేయాలి. 37  యెహోవా నా ప్రభువైన రాజుకు తోడుగా ఉన్నట్టే సొలొమోనుకు కూడా తోడుగా ఉండాలి,+ ఆయన సొలొమోను సింహాసనాన్ని నా ప్రభువైన దావీదు రాజు సింహాసనం కన్నా గొప్పదిగా చేయాలి.”+ 38  అప్పుడు యాజకుడైన సాదోకు, నాతాను ప్రవక్త, యెహోయాదా కుమారుడైన బెనాయా,+ కెరేతీయులు, పెలేతీయులు+ వెళ్లి దావీదు రాజు కంచర గాడిద మీద సొలొమోనును ఎక్కించి+ అతన్ని గీహోనుకు+ తీసుకొచ్చారు. 39  తర్వాత యాజకుడైన సాదోకు, డేరాలో+ నుండి నూనె ఉన్న కొమ్మును*+ తీసుకొచ్చి సొలొమోనును అభిషేకించాడు;+ వాళ్లు బూర* ఊదడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రజలందరూ, “సొలొమోను రాజు దీర్ఘకాలం జీవించాలి!” అని కేకలు వేయడం మొదలుపెట్టారు. 40  ఆ తర్వాత ప్రజలందరూ పిల్లనగ్రోవులు* ఊదుతూ, ఎంతో సంతోషిస్తూ అతని వెనక వచ్చారు, ఆ శబ్దానికి భూమి కంపించింది.+ 41  అదోనీయా, అతను ఆహ్వానించిన వాళ్లందరూ విందు ముగించేటప్పుడు, వాళ్లకు ఆ శబ్దం వినిపించింది.+ బూర శబ్దం వినగానే యోవాబు, “నగరం ఎందుకింత గోలగోలగా ఉంది?” అన్నాడు. 42  అతను మాట్లాడుతుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను+ వచ్చాడు. అప్పుడు అదోనీయా, “రా, నువ్వు మంచివాడివి* కాబట్టి మంచివార్తే తెచ్చుంటావు” అన్నాడు. 43  కానీ యోనాతాను అదోనీయాతో ఇలా అన్నాడు: “లేదు! మన ప్రభువైన దావీదు రాజు సొలొమోనును రాజును చేశాడు. 44  రాజు సొలొమోనుతో పాటు యాజకుడైన సాదోకును, నాతాను ప్రవక్తను, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయుల్ని, పెలేతీయుల్ని పంపించాడు; వాళ్లు అతన్ని రాజు కంచర గాడిద మీద ఎక్కించారు.+ 45  యాజకుడైన సాదోకు, నాతాను ప్రవక్త గీహోనులో సొలొమోనును రాజుగా అభిషేకించారు. తర్వాత వాళ్లు అక్కడి నుండి సంతోషిస్తూ వచ్చారు, అందుకే నగరం గోలగోలగా ఉంది. మీకు వినిపించిన శబ్దం అదే. 46  అంతేకాదు, సొలొమోను రాజసింహాసనం మీద కూర్చున్నాడు. 47  అలాగే, రాజు సేవకులు మన ప్రభువైన దావీదు రాజుకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చి, ‘నీ దేవుడు, సొలొమోను పేరును నీ పేరు కన్నా ఎక్కువ ఘనమైనదిగా చేయాలి, ఆయన సొలొమోను సింహాసనాన్ని నీ సింహాసనం కన్నా గొప్పదిగా చేయాలి!’ అన్నారు. అప్పుడు రాజు తన మంచం మీద దేవునికి వంగి నమస్కారం చేశాడు. 48  రాజు ఇంకా ఇలా అన్నాడు: ‘ఈ రోజు నా సింహాసనం మీద కూర్చోవడానికి ఒకతన్ని ఇచ్చి, దాన్ని నా కళ్లారా చూడనిచ్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలగాలి!’ ” 49  ఆ మాటలు వినగానే అదోనీయా ఆహ్వానించిన వాళ్లందరూ చాలా భయపడి, ప్రతీ ఒక్కరు లేచి తమ దారిన వెళ్లిపోయారు. 50  అదోనీయా కూడా సొలొమోనుకు భయపడి, లేచి వెళ్లి బలిపీఠం కొమ్ముల్ని పట్టుకున్నాడు.+ 51  అప్పుడు, “అదోనీయా సొలొమోను రాజుకు భయపడుతున్నాడు; అతను బలిపీఠం కొమ్ముల్ని పట్టుకుని, ‘సొలొమోను రాజు తన సేవకుడినైన నన్ను కత్తితో చంపడని ముందు నాకు ఒట్టేయాలి’ అంటున్నాడు” అని సొలొమోనుకు వార్త అందింది. 52  అందుకు సొలొమోను, “అతను గనుక నమ్మకస్థుడైతే, అతని తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలమీద పడదు; కానీ అతనిలో ఏదైనా చెడు కనిపిస్తే+ అతను చనిపోవాల్సిందే” అన్నాడు. 53  కాబట్టి, అదోనీయాను బలిపీఠం దగ్గర నుండి తీసుకురమ్మని సొలొమోను రాజు మనుషుల్ని పంపించాడు. అతను వచ్చి సొలొమోను రాజుకు వంగి నమస్కారం చేశాడు. తర్వాత సొలొమోను అతనితో, “నీ ఇంటికి వెళ్లు” అన్నాడు.

అధస్సూచీలు

లేదా “బాధపెట్టలేదు; గద్దించలేదు.”
అక్ష., “పూర్వీకులతో నిద్రించగానే.”
లేదా “విడిపించిన.”
అక్ష., “కొమ్ము.”
పదకోశం చూడండి.
అక్ష., “కొమ్ము.”
అంటే, ఫ్లూటు.
లేదా “యోగ్యుడివి.”