రాజులు మొదటి గ్రంథం 13:1-34

  • బేతేలులోని బలిపీఠానికి వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

    • బలిపీఠం బద్దలవ్వడం (5)

  • దేవుని సేవకుడి అవిధేయత (11-34)

13  యెహోవా ఆజ్ఞ ప్రకారం దేవుని సేవకుడు+ ఒకతను యూదా నుండి బేతేలుకు వచ్చాడు. ఆ సమయంలో యరొబాము బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయడానికి, బలిపీఠం+ పక్కన నిలబడివున్నాడు.  అప్పుడు ఆ ప్రవక్త యెహోవా ఆజ్ఞాపించినట్టు బలిపీఠంతో గట్టిగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా ఏం చెప్తున్నాడంటే: ‘ఇదిగో! దావీదు వంశంలో యోషీయా+ అనే కుమారుడు పుడతాడు! నీ మీద బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేసే ఉన్నత స్థలాల యాజకుల్ని అతను నీ మీద బలి అర్పిస్తాడు, అతను మనుషుల ఎముకల్ని నీ మీద కాలుస్తాడు.’ ”+  దేవుని సేవకుడైన ఆ వ్యక్తి ఆ రోజు ఒక సూచన* ఇచ్చాడు; అతను ఇలా అన్నాడు: “యెహోవా చెప్పిన సూచన* ఇదే: ఇదిగో! బలిపీఠం బద్దలౌతుంది, దానిమీద ఉన్న బూడిద* ఒలికిపోతుంది.”  సత్యదేవుని సేవకుడు బేతేలులోని బలిపీఠంతో గట్టిగా మాట్లాడిన మాటల్ని విన్న వెంటనే యరొబాము బలిపీఠం మీద నుండి చెయ్యి చాపి, “అతన్ని పట్టుకోండి”+ అన్నాడు. వెంటనే యరొబాము చెయ్యి ఎండిపోయింది,* అతను దాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు.+  అప్పుడు, సత్యదేవుని సేవకునికి యెహోవా చెప్పిన సూచన* ప్రకారం బలిపీఠం బద్దలైంది, బలిపీఠం మీద నుండి బూడిద ఒలికిపోయింది.  అప్పుడు రాజు సత్యదేవుని సేవకునితో, “దయచేసి నీ దేవుడైన యెహోవా అనుగ్రహం కోసం వేడుకో, నా చెయ్యి బాగయ్యేలా నా కోసం ప్రార్థించు”+ అన్నాడు. దాంతో సత్యదేవుని సేవకుడు యెహోవా అనుగ్రహం కోసం వేడుకున్నాడు, అప్పుడు రాజు చెయ్యి బాగైంది.  తర్వాత రాజు సత్యదేవుని సేవకునితో, “నాతోపాటు ఇంటికి వచ్చి కాస్త భోజనం చేయి. నేను నీకు ఒక కానుక ఇస్తాను” అన్నాడు.  కానీ సత్యదేవుని సేవకుడు రాజుతో ఇలా అన్నాడు: “నీ రాజభవనంలో సగం ఇచ్చినా సరే, నేను నీతో రాను; ఈ స్థలంలో రొట్టె తినను, నీళ్లు తాగను.  ఎందుకంటే, ‘నువ్వు ఆహారం తినకూడదు, నీళ్లు తాగకూడదు; నువ్వు వచ్చిన దారిలో తిరిగెళ్లకూడదు’ అని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.” 10  కాబట్టి అతను వేరే దారిలో వెళ్లిపోయాడు, అతను బేతేలుకు వచ్చిన దారిలో తిరిగెళ్లలేదు. 11  బేతేలులో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తున్నాడు; అతని కుమారులు ఇంటికి వచ్చి ఆ రోజు బేతేలులో సత్యదేవుని సేవకుడు చేసినవన్నీ, అతను రాజుతో చెప్పిన మాటల్నీ తమ తండ్రికి తెలియజేశారు. వాళ్లు ఆ విషయాన్ని చెప్పినప్పుడు 12  వాళ్ల తండ్రి, “అతను ఏ దారిలో వెళ్లాడు?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు అతనికి, యూదాకు చెందిన సత్యదేవుని సేవకుడు వెళ్లిన దారిని చూపించారు. 13  అప్పుడు అతను తన కుమారులతో, “నా కోసం గాడిద మీద జీను వేయండి” అని చెప్పాడు. వాళ్లు గాడిదమీద జీను వేశారు, అతను దాని మీదికి ఎక్కి బయల్దేరాడు. 14  ఆ వృద్ధ ప్రవక్త సత్యదేవుని సేవకుడు వెళ్లిన దారిలో వెళ్లి, అతను ఒక పెద్ద చెట్టు కింద కూర్చొనివుండడం చూసి, “యూదా నుండి వచ్చిన సత్యదేవుని సేవకుడివి+ నువ్వేనా?” అని అడిగాడు. అతను, “నేనే” అన్నాడు. 15  అప్పుడు ఆ వృద్ధ ప్రవక్త, “నాతోపాటు ఇంటికి వచ్చి భోజనం చేయి” అని అడిగాడు. 16  కానీ అతను ఇలా చెప్పాడు: “నేను నీతోపాటు వెనక్కిరాలేను, నీ ఆహ్వానాన్ని స్వీకరించలేను; నీతోపాటు ఈ స్థలంలో భోజనం చేయలేను, నీళ్లు తాగలేను. 17  ఎందుకంటే, ‘నువ్వు అక్కడ ఆహారం తినకూడదు, నీళ్లు తాగకూడదు; నువ్వు వచ్చిన దారిలో తిరిగెళ్లకూడదు’ అని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.” 18  అందుకు ఆ వృద్ధ ప్రవక్త ఇలా అన్నాడు: “నేనూ నీలాగే ఒక ప్రవక్తను. ఒక దేవదూత యెహోవా మాటను నాకు చెప్తూ, ‘అతను భోజనం చేసి, నీళ్లు తాగేలా అతన్ని వెనక్కి నీ ఇంటికి తీసుకెళ్లు’ అని నాతో అన్నాడు.” (ఆ వృద్ధ ప్రవక్త అతనికి అబద్ధం చెప్పాడు.) 19  దాంతో అతను ఆ వృద్ధ ప్రవక్త ఇంట్లో భోజనం చేయడానికి, నీళ్లు తాగడానికి అతనితోపాటు వెనక్కి వెళ్లాడు. 20  వాళ్లు బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు, అతన్ని వెనక్కి తీసుకొచ్చిన వృద్ధ ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్యం వచ్చింది; 21  అతను యూదా నుండి వచ్చిన సత్యదేవుని సేవకునితో గట్టిగా ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్తున్నాడంటే: ‘నువ్వు యెహోవా ఆదేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా, 22  ఏ స్థలం గురించైతే “నువ్వు భోజనం చేయకూడదు, నీళ్లు తాగకూడదు” అని నీకు చెప్పబడిందో ఆ స్థలంలో భోజనం చేయడానికి, నీళ్లు తాగడానికి నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి నీ మృతదేహం నీ పూర్వీకుల సమాధిలోకి వెళ్లదు.’ ”+ 23  సత్యదేవుని సేవకుడు భోజనం చేసి, నీళ్లు తాగాక వృద్ధ ప్రవక్త తాను వెనక్కి తీసుకొచ్చిన ప్రవక్త కోసం గాడిద మీద జీను వేశాడు. 24  అప్పుడు అతను తన దారిన వెళ్లిపోయాడు, అయితే దారిలో ఒక సింహం ఎదురొచ్చి అతన్ని చంపింది.+ అతని మృతదేహం దారిలో పడివుంది; దాని పక్కన గాడిద నిలబడివుంది. సింహం కూడా మృతదేహం పక్కనే నిలబడివుంది. 25  మృతదేహం దారిలో పడివుండడం, దాని పక్కనే సింహం నిలబడివుండడం ఆ దారిలో వెళ్లే మనుషులు చూశారు. వాళ్లు వచ్చి ఆ వృద్ధ ప్రవక్త ఉంటున్న నగరంలో ఆ విషయం గురించి చెప్పారు. 26  అతన్ని దారిలో నుండి వెనక్కి తీసుకొచ్చిన వృద్ధ ప్రవక్త దాని గురించి విన్న వెంటనే ఇలా అన్నాడు: “అతను యెహోవా ఆదేశానికి లోబడని+ సత్యదేవుని సేవకుడు. అందుకే యెహోవా అతనికి చెప్పినట్టే,+ అతన్ని చీల్చి చంపడానికి యెహోవా అతన్ని సింహానికి అప్పగించాడు.” 27  ఆ వృద్ధ ప్రవక్త తన కుమారులకు, “నా కోసం గాడిద మీద జీను వేయండి” అని చెప్పాడు, వాళ్లు గాడిద మీద జీను వేశారు. 28  అతను, దారిలో మృతదేహం పడివుండడం, దాని పక్కన గాడిద, సింహం నిలబడివుండడం చూశాడు. సింహం మృతదేహాన్ని తినలేదు, గాడిదను చీల్చేయలేదు. 29  అతను సత్యదేవుని సేవకుని మృతదేహాన్ని ఎత్తి, గాడిద మీద పెట్టాడు. తర్వాత, దుఃఖించడం కోసం, ఆ మృతదేహాన్ని పాతిపెట్టడం కోసం దాన్ని తన నగరానికి తీసుకొచ్చాడు. 30  అతను ఆ మృతదేహాన్ని తన సొంత సమాధిలో ఉంచాడు; అప్పుడు వాళ్లు, “అయ్యో! నా సహోదరుడా” అని అతని గురించి ఏడుస్తూ ఉన్నారు. 31  అతన్ని పాతిపెట్టాక, వృద్ధ ప్రవక్త తన కుమారులకు ఇలా చెప్పాడు: “నేను చనిపోయినప్పుడు, సత్యదేవుని సేవకుణ్ణి పాతిపెట్టిన స్థలంలోనే మీరు నన్ను పాతిపెట్టాలి. అతని ఎముకల పక్కనే నా ఎముకల్ని ఉంచండి.+ 32  బేతేలులోని బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ నగరాల్లోని ఉన్నత స్థలాల మీద ఉన్న పూజా మందిరాలన్నిటికీ+ వ్యతిరేకంగా అతను ప్రకటించిన యెహోవా మాట తప్పకుండా నిజమౌతుంది.”+ 33  ఇది జరిగాక కూడా యరొబాము తన చెడు మార్గాన్ని విడిచిపెట్టలేదు; అతను సామాన్య ప్రజల్ని ఉన్నత స్థలాలకు యాజకులుగా నియమిస్తూనే ఉన్నాడు.+ యాజకుడు అవ్వాలని కోరుకున్న ప్రతీ ఒక్కర్ని అతను యాజకులుగా నియమించేవాడు.* “ఇతన్ని ఉన్నత స్థలాలకు యాజకునిగా ఉండనిద్దాం” అని యరొబాము అంటుండేవాడు.+ 34  యరొబాము ఇంటివాళ్లు చేసిన పాపం+ వల్ల వాళ్లు నాశనమయ్యారు, భూమ్మీద నుండి పూర్తిగా నిర్మూలమయ్యారు.+

అధస్సూచీలు

లేదా “గుర్తు.”
లేదా “గుర్తు.”
లేదా “కొవ్వు బూడిద,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిద.
లేదా “చచ్చుబడింది.”
లేదా “గుర్తు.”
లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపేవాడు.”