రాజులు మొదటి గ్రంథం 15:1-34

  • అబీయాము, యూదా రాజు (1-8)

  • ఆసా, యూదా రాజు (9-24)

  • నాదాబు, ఇశ్రాయేలు రాజు (25-32)

  • బయెషా, ఇశ్రాయేలు రాజు (33, 34)

15  నెబాతు కుమారుడైన యరొబాము రాజు+ పరిపాలనలోని 18వ సంవత్సరంలో అబీయాము యూదా మీద రాజయ్యాడు.+  అతను యెరూషలేములో మూడు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా,+ ఆమె అబీషాలోము మనవరాలు.  అబీయాము కూడా తన తండ్రి చేసిన పాపాల్నే చేశాడు; అతని పూర్వీకుడైన దావీదు హృదయంలా అతని హృదయం తన దేవుడైన యెహోవా పట్ల సంపూర్ణంగా* లేదు.  అయితే, దావీదు కోసం+ అతని దేవుడైన యెహోవా, అబీయాము తర్వాత అతని కుమారుణ్ణి రాజుగా నియమించి, యెరూషలేమును కాపాడాడు. అలా ఆయన యెరూషలేములో అతనికి ఒక దీపాన్ని ఇచ్చాడు.+  ఎందుకంటే, దావీదు యెహోవా దృష్టిలో సరైనది చేశాడు; హిత్తీయుడైన ఊరియా విషయంలో+ తప్ప దావీదు తన జీవితాంతం దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించాడు.  రెహబాము బ్రతికున్నంత కాలం అతనికి, యరొబాముకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.  అబీయాము మిగతా చరిత్ర, అంటే అతను చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.+ అబీయాముకు, యరొబాముకు మధ్య కూడా యుద్ధం జరిగింది.+  తర్వాత అబీయాము చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు ఆసా+ రాజయ్యాడు.  ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని 20వ సంవత్సరంలో ఆసా యూదాను పరిపాలించడం మొదలుపెట్టాడు. 10  అతను యెరూషలేములో 41 సంవత్సరాలు పరిపాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఆమె అబీషాలోము మనవరాలు. 11  ఆసా తన పూర్వీకుడైన దావీదులా యెహోవా దృష్టిలో సరైనది చేశాడు.+ 12  అతను ఆలయ వేశ్యల్ని* దేశం నుండి వెళ్లగొట్టాడు,+ తన పూర్వీకులు చేయించిన అసహ్యమైన విగ్రహాలన్నిటినీ*+ తీసేశాడు. 13  అంతేకాదు, ఆసా తన అవ్వ మయకాను+ రాజమాత స్థానంలో నుండి తీసేశాడు. ఎందుకంటే ఆమె పూజా కర్రను* పూజించడానికి ఒక అసహ్యమైన విగ్రహాన్ని చేయించుకుంది. ఆసా ఆ అసహ్యమైన విగ్రహాన్ని నరికి,+ దాన్ని కిద్రోను లోయలో కాల్చేశాడు.+ 14  అయితే ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు.+ అయినా ఆసా జీవించిన కాలమంతా* అతని హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా* ఉంది. 15  తాను, తన తండ్రి ప్రతిష్ఠించిన* వెండిబంగారాల్ని, వేర్వేరు వస్తువుల్ని+ ఆసా యెహోవా మందిరంలోకి తీసుకొచ్చాడు. 16  ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు+ మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది. 17  కాబట్టి ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా మీదికి వచ్చి, రామాను+ కట్టించడం* మొదలుపెట్టాడు. యూదా రాజైన ఆసా దగ్గర నుండి ఎవ్వరూ రాకుండా, అతని దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా* చేయడానికి బయెషా అలా చేశాడు.+ 18  అప్పుడు ఆసా యెహోవా మందిరంలోని ఖజనాల్లో, రాజభవనంలోని ఖజనాల్లో మిగిలివున్న వెండిబంగారమంతా తీసి వాటిని తన సేవకులకు అప్పగించాడు. ఆసా వాటిని దమస్కులో ఉంటున్న సిరియా రాజైన బెన్హదదుకు పంపించాడు;+ అతను టబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనవడు. ఆసా అతనికి ఈ సందేశం పంపాడు: 19  “నాకూ నీకూ మధ్య, నా తండ్రికీ నీ తండ్రికీ మధ్య సంధి* ఉంది. నేను వెండిబంగారాల్ని కానుకగా పంపిస్తున్నాను. నువ్వు వచ్చి, ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్లిపోయేలా, అతనితో నువ్వు చేసుకున్న సంధిని* రద్దు చేసుకో.” 20  బెన్హదదు ఆసా రాజు మాటకు ఒప్పుకుని, తన సైన్యాధిపతుల్ని ఇశ్రాయేలు నగరాల మీదికి పంపించాడు. వాళ్లు ఈయోనును,+ దానును,+ ఆబేల్‌-బేత్‌-మయకాను, కిన్నెరెతు అంతటిని, నఫ్తాలి ప్రాంతమంతటినీ నాశనం చేశారు. 21  బయెషా అది విన్న వెంటనే రామాను కట్టించడం* ఆపేశాడు; అతను తిర్సాలో+ నివసిస్తూ ఉన్నాడు. 22  అప్పుడు రాజైన ఆసా ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా యూదా వాళ్లందర్నీ పిలిపించాడు, వాళ్లు రామాను కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, మ్రానుల్ని మోసుకెళ్లారు. రాజైన ఆసా వాటితో బెన్యామీనులోని గెబాను,+ మిస్పాను+ కట్టించాడు.* 23  ఆసా మిగతా చరిత్రంతటి గురించి, అంటే అతని బలమంతటి గురించి, అతను చేసిన పనులన్నిటి గురించి, అతను కట్టించిన* నగరాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. అయితే ఆసా ముసలివాడైనప్పుడు అతని పాదాల్లో ఒక జబ్బు వచ్చింది.+ 24  తర్వాత ఆసా చనిపోయాడు,* ఆసాను అతని పూర్వీకులతో పాటు అతని పూర్వీకుడైన దావీదు నగరంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు+ రాజయ్యాడు. 25  యూదా రాజైన ఆసా పరిపాలనలోని రెండో సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు+ ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 26  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూనే వచ్చాడు; తన తండ్రి ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాల్నే+ అతనూ చేస్తూ తన తండ్రి మార్గంలో నడిచాడు.+ 27  ఇశ్శాఖారు కుటుంబానికి చెందిన అహీయా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర పన్నాడు. బయెషా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనులో+ నాదాబును చంపాడు. ఆ సమయంలో నాదాబు, ఇశ్రాయేలు ప్రజలందరూ గిబ్బెతోనును ముట్టడిస్తున్నారు. 28  యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడో సంవత్సరంలో బయెషా నాదాబును చంపి అతని స్థానంలో రాజయ్యాడు. 29  అతను రాజైన వెంటనే యరొబాము ఇంటివాళ్లందర్నీ చంపేశాడు. యరొబాముకు చెందినవాళ్లలో ప్రాణాలతో ఉన్న వాళ్లెవర్నీ అతను విడిచిపెట్టలేదు; షిలోనీయుడైన అహీయా అనే తన సేవకుని ద్వారా యెహోవా చెప్పినట్టు+ అతను వాళ్లను నిర్మూలించాడు. 30  యరొబాము చేసిన పాపాలవల్ల, అతను ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాలవల్ల, అతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు తీవ్రంగా కోపం తెప్పించడం వల్ల అలా జరిగింది. 31  నాదాబు మిగతా చరిత్ర, అంటే అతను చేసినవన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 32  ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది.+ 33  యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడో సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలు అంతటి మీద రాజయ్యాడు. అతను 24 సంవత్సరాలు పరిపాలించాడు.+ 34  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూనే వచ్చాడు;+ యరొబాము ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాల్నే అతనూ చేస్తూ యరొబాము మార్గంలో నడిచాడు.+

అధస్సూచీలు

లేదా “పూర్తిగా అంకితమై.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “మగవేశ్యల్ని.”
పదకోశం చూడండి.
అక్ష., “రోజులన్నిట్లో.”
లేదా “పూర్తిగా అంకితమై.”
లేదా “పవిత్రపర్చిన.”
లేదా “ఆసా ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా, ఎవ్వరూ అందులోకి వెళ్లకుండా.”
లేదా “పటిష్ఠం చేయడం; తిరిగి కట్టించడం.”
లేదా “ఒప్పందం.”
లేదా “ఒప్పందాన్ని.”
లేదా “పటిష్ఠం చేయడం; తిరిగి కట్టించడం.”
లేదా “పటిష్ఠం చేశాడు; తిరిగి కట్టించాడు.”
లేదా “పటిష్ఠం చేసిన; తిరిగి కట్టించిన.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”