రాజులు మొదటి గ్రంథం 3:1-28

  • సొలొమోను ఫరో కూతుర్ని పెళ్లి చేసుకోవడం (1-3)

  • యెహోవా సొలొమోనుకు కలలో కనిపించడం (4-15)

    • సొలొమోను తెలివి కోసం అడగడం (7-9)

  • ఇద్దరు తల్లుల మధ్య సొలొమోను న్యాయం తీర్చడం (16-28)

3  సొలొమోను ఐగుప్తు* రాజైన ఫరోతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అతను ఫరో కూతుర్ని పెళ్లి చేసుకుని+ ఆమెను దావీదు నగరానికి+ తీసుకొచ్చాడు. అతను తన రాజభవనాన్ని,+ యెహోవా మందిరాన్ని,+ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని+ కట్టించడం పూర్తి చేసేంతవరకు ఆమెను అక్కడే ఉంచాడు.  కానీ ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూనే ఉన్నారు,+ ఎందుకంటే యెహోవా పేరు కోసం అప్పటికి ఇంకా ఒక మందిరం కట్టబడలేదు.+  సొలొమోను తన తండ్రైన దావీదు శాసనాల ప్రకారం నడుచుకుంటూ యెహోవాను ప్రేమిస్తూ ఉన్నాడు; అయితే అతను కూడా ఉన్నత స్థలాల మీద బలులు, దహనబలులు అర్పిస్తూ ఉన్నాడు.+  రాజు బలులు అర్పించడానికి గిబియోనుకు వెళ్లాడు, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన* ఉన్నత స్థలం.+ సొలొమోను ఆ బలిపీఠం మీద 1,000 దహనబలులు అర్పించాడు.+  గిబియోనులో యెహోవా సొలొమోనుకు రాత్రిపూట కలలో కనిపించి, “నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో” అని అడిగాడు.+  అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదు నీ ముందు నమ్మకంగా, నీతిగా, నిజాయితీగల హృదయంతో నడుచుకున్నాడు కాబట్టి నువ్వు అతని మీద ఎంతో విశ్వసనీయ ప్రేమ చూపించావు. అతని సింహాసనం మీద కూర్చోవడానికి అతనికి ఒక కుమారుణ్ణి ఇచ్చి+ నేటివరకు నువ్వు అతని మీద ఈ గొప్ప విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ వచ్చావు.  నా దేవా యెహోవా, నేను చిన్నవాణ్ణి, అనుభవం లేనివాణ్ణి,+ అయినా నీ సేవకుడినైన నన్ను నా తండ్రి దావీదు స్థానంలో రాజును చేశావు.  నీ సేవకుడు నువ్వు ఎంచుకున్న ప్రజల్ని+ పరిపాలిస్తున్నాడు, వాళ్లు లెక్కపెట్టలేనంత విస్తారమైన ప్రజలు.  కాబట్టి నీ ప్రజలకు న్యాయం తీర్చేలా, మంచిచెడుల మధ్య తేడాను గుర్తించేలా+ నీ సేవకునికి లోబడే హృదయం దయచేయి;+ ఇంత విస్తారంగా ఉన్న* నీ ప్రజలకు ఎవరు న్యాయం తీర్చగలరు?” 10  సొలొమోను అలా కోరుకోవడం యెహోవాకు నచ్చింది.+ 11  దేవుడు అతనితో ఇలా అన్నాడు: “నువ్వు నీ కోసం దీర్ఘాయుష్షును గానీ, సిరిసంపదల్ని గానీ, నీ శత్రువుల ప్రాణాల్ని గానీ అడగకుండా, న్యాయపరమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి* కావాల్సిన అవగాహన కోసం అడిగావు కాబట్టి,+ 12  నువ్వు అడిగింది నేను ఇస్తాను.+ నేను నీకు తెలివి, అవగాహన గల హృదయాన్ని ఇస్తాను;+ నీకు ముందు నీ లాంటివాళ్లు ఎవ్వరూ లేనట్టే, నీ తర్వాత కూడా నీ లాంటివాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 13  అంతేకాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు ఇస్తాను,+ నీకు సిరిసంపదలు, ఘనత రెండూ ఇస్తాను;+ కాబట్టి నీ జీవితకాలంలో నీ లాంటి రాజు ఇంకెవ్వరూ ఉండరు.+ 14  నీ తండ్రి దావీదులా నువ్వు నా నియమాల్ని, ఆజ్ఞల్ని పాటిస్తూ నా మార్గాల్లో నడిస్తే+ నీకు దీర్ఘాయుష్షును కూడా ఇస్తాను.”+ 15  సొలొమోను నిద్ర లేచినప్పుడు, అది కల అని అతనికి అర్థమైంది. అప్పుడు అతను యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒప్పంద* మందసం ఎదుట నిలబడి దహనబలుల్ని, సమాధాన బలుల్ని+ అర్పించి, తన సేవకులందరికీ విందు ఏర్పాటు చేశాడు. 16  ఒకరోజు ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరికి వచ్చి, అతని ముందు నిలబడ్డారు. 17  మొదటి స్త్రీ ఇలా చెప్పింది: “నా ప్రభూ, నేనూ ఈ స్త్రీ ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక బిడ్డను కన్నాను. 18  నేను బిడ్డను కన్న మూడో రోజున ఈమె కూడా బిడ్డను కన్నది. మాతోపాటు ఇంట్లో ఇంకెవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం. 19  రాత్రిపూట ఈమె తన బిడ్డ మీద పడుకోవడంతో ఆ బిడ్డ చనిపోయాడు. 20  నీ దాసురాలినైన నేను నిద్రపోతుండగా, ఆమె మధ్యరాత్రి లేచి నా పక్కలో ఉన్న నా కుమారుణ్ణి తీసుకొని తన కౌగిట్లో పెట్టుకుంది, చనిపోయిన తన కుమారుణ్ణి నా కౌగిట్లో ఉంచింది. 21  నేను నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఉదయం లేచి చూసేసరికి, బిడ్డ చనిపోయి ఉన్నాడు. అప్పుడు నేను ఆ బిడ్డను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, వాడు నా బిడ్డ కాదని నాకు అర్థమైంది.” 22  అయితే రెండో స్త్రీ, “కాదు, బ్రతికున్నవాడే నా బిడ్డ, చనిపోయినవాడు నీ బిడ్డ!” అంది. మొదటి స్త్రీ, “లేదు, చనిపోయినవాడే నీ బిడ్డ, బ్రతికున్నవాడు నా బిడ్డ” అని అంటూ ఉంది. అలా వాళ్లు రాజు ముందు వాదించుకున్నారు. 23  చివరికి రాజు ఇలా అన్నాడు: “ఈమె, ‘బ్రతికున్నవాడు నా బిడ్డ, చనిపోయినవాడు నీ బిడ్డ!’ అంటోంది; కానీ ఆమె, ‘లేదు, చనిపోయినవాడు నీ బిడ్డ, బ్రతికున్నవాడు నా బిడ్డ!’ అంటోంది.” 24  ఆ తర్వాత రాజు, “ఒక కత్తిని తీసుకురండి” అన్నాడు. వాళ్లు రాజు దగ్గరికి ఒక కత్తి తీసుకొచ్చారు. 25  అప్పుడు రాజు, “బ్రతికున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికి, ఈమెకో సగం ఆమెకో సగం ఇవ్వండి” అని చెప్పాడు. 26  ఆ మాట వినగానే, బ్రతికున్న బిడ్డ తల్లికి తన బిడ్డ మీద మమకారం పొంగుకొచ్చి, రాజును ఇలా బ్రతిమాలింది: “నా ప్రభూ! దయచేసి బ్రతికున్న బిడ్డను ఆమెకే ఇచ్చేయండి! ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను చంపొద్దు!” అయితే రెండో స్త్రీ, “బిడ్డ నాకుగానీ నీకుగానీ దక్కకూడదు! మీరు ఆ బిడ్డను రెండు ముక్కలు చేయండి!” అని అంటూ ఉంది. 27  అప్పుడు రాజు ఇలా చెప్పాడు: “బ్రతికున్న బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి! ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి చంపకండి, ఆమే ఆ బిడ్డ తల్లి.” 28  రాజు చెప్పిన ఆ తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరూ విన్నారు; న్యాయం తీర్చడానికి దేవుడు అతనికి తెలివి ఇవ్వడం+ చూసి వాళ్లు రాజుకు భయపడ్డారు.+

అధస్సూచీలు

లేదా “ఈజిప్టు.”
అక్ష., “గొప్ప.”
లేదా “మొండివాళ్లైన” అయ్యుంటుంది. అక్ష., “భారమైన.”
అక్ష., “వ్యాజ్యాలు వినడానికి.”
లేదా “నిబంధన.”