రాజులు మొదటి గ్రంథం 4:1-34

  • సొలొమోను పరిపాలన (1-19)

  • సొలొమోను పాలనలో సమృద్ధి (20-28)

    • ద్రాక్షచెట్టు కింద, అంజూర చెట్టు కింద సురక్షితంగా నివసించడం (25)

  • సొలొమోను తెలివి, సామెతలు (29-34)

4  రాజైన సొలొమోను ఇశ్రాయేలు అంతటి మీద పరిపాలన చేశాడు.+  అతని ముఖ్య అధికారులు* వీళ్లు: సాదోకు+ కుమారుడైన అజర్యా యాజకుడు;  షీషా కుమారులైన ఎలీహోరెపు, అహీయా కార్యదర్శులు;+ అహీలూదు కుమారుడైన యెహోషాపాతు వివరాలు నమోదు చేసే వ్యక్తి;  యెహోయాదా కుమారుడైన బెనాయా+ సైన్యాధిపతి; సాదోకు, అబ్యాతారు+ యాజకులు;  నాతాను+ కుమారుడైన అజర్యా ఉప పాలకుల మీద అధికారి; నాతాను కుమారుడైన జాబూదు యాజకుడు, అలాగే రాజుకు స్నేహితుడు;+  అహీషారు రాజభవనాన్ని పర్యవేక్షించేవాడు; అబ్దా కుమారుడైన అదోనీరాము+ వెట్టిచాకిరి చేసేవాళ్ల+ మీద అధికారి.  సొలొమోను ఇశ్రాయేలు అంతటిలో 12 మంది ఉప పాలకుల్ని నియమించాడు; వాళ్లు రాజుకు, అతని ఇంటివాళ్లకు ఆహారం సమకూర్చేవాళ్లు. సంవత్సరంలోని ఒక్కో నెలలో ఒక్కొక్కరు ఆహారం సమకూర్చాలి.+  ఆ ఉప పాలకులు వీళ్లు: ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో హూరు కుమారుడు;  మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్బెధానానులో దెకెరు కుమారుడు; 10  అరుబ్బోతులో హెసెదు కుమారుడు (ఇతనికి శోకో మీద, హెపెరు ప్రాంతమంతటి మీద అధికారం ఉంది); 11  దోరు కొండలన్నిట్లో అబీనాదాబు కుమారుడు (అతని భార్య సొలొమోను కూతురైన టాపాతు); 12  తానాకులో, మెగిద్దోలో,+ మొత్తం బేత్షెయానులో,+ బేత్షెయాను నుండి ఆబేల్‌-మెహోలా వరకు, యొక్మెయాము+ ప్రాంతం వరకు అహీలూదు కుమారుడైన బయనా. ఈ బేత్షెయాను యెజ్రెయేలు దిగువన సారెతాను పక్కన ఉంది. 13  రామోత్గిలాదులో+ గెబెరు కుమారుడు (ఇతనికి మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాల*+ మీద అధికారం ఉంది, అవి గిలాదులో+ ఉన్నాయి; ఇతనికి బాషానులోని+ అర్గోబు ప్రాంతం+ మీద, అంటే ప్రాకారాలు, రాగి అడ్డగడియలు గల 60 పెద్ద నగరాలపై కూడా అధికారం ఉంది); 14  మహనయీములో+ ఇద్దో కుమారుడైన అహీనాదాబు; 15  నఫ్తాలిలో అహిమయస్సు (ఇతను సొలొమోను మరో కూతురైన బాశెమతును పెళ్లి చేసుకున్నాడు); 16  ఆషేరులో, బెయాలోతులో హూషై కుమారుడైన బయనా; 17  ఇశ్శాఖారులో పరూయహు కుమారుడైన యెహోషాపాతు; 18  బెన్యామీనులో+ ఏలా కుమారుడైన షిమీ;+ 19  గిలాదు+ ప్రాంతంలో, అంటే అమోరీయుల రాజైన సీహోను+ ప్రాంతంలో, బాషాను రాజైన ఓగు+ ప్రాంతంలో ఊరి కుమారుడైన గెబెరు. అంతేకాదు, దేశంలోని ఈ మిగతా ఉప పాలకులందరి మీద ఒక ఉప పాలకుడు అధికారిగా ఉండేవాడు. 20  యూదా, ఇశ్రాయేలు వాళ్లు సముద్రతీరాన ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు;+ వాళ్లు తింటూ, తాగుతూ, సంతోషిస్తూ ఉన్నారు.+ 21  సొలొమోను, నది*+ దగ్గర నుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఐగుప్తు సరిహద్దు వరకు ఉన్న రాజ్యాలన్నిటి మీద పరిపాలన చేశాడు. ఆ రాజ్యాలు అతనికి కప్పం కడుతూ, సొలొమోను బ్రతికున్నంత కాలం అతనికి సేవ చేశాయి.+ 22  సొలొమోను రాజభవనంలో ప్రతీరోజు భోజనానికి 30 కొర్‌ కొలతల* మెత్తని పిండి, 60 కొర్‌ కొలతల మామూలు పిండి, 23  10 కొవ్విన ఎద్దులు, పచ్చికబయళ్లలో మేసే 20 ఎద్దులు, 100 గొర్రెలు, కొన్ని దుప్పులు, కొండజింకలు, మగ జింకలు, కొవ్విన పక్షులు అవసరమయ్యేవి. 24  అతనికి తిప్సహు నుండి గాజా+ వరకు నదికి ఇటువైపున్న* ప్రతీదాని మీద,+ అలాగే నదికి ఇటువైపున్న రాజులందరి మీద కూడా అధికారం ఉండేది; అతని ప్రాంతాలన్నిట్లో, చుట్టూరా శాంతి ఉండేది.+ 25  సొలొమోను రోజులన్నిట్లో దాను నుండి బెయేర్షెబా వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతీ ఒక్కరు వాళ్లవాళ్ల ద్రాక్షచెట్టు కింద, అంజూర చెట్టు కింద సురక్షితంగా నివసించారు. 26  సొలొమోను రథాల్ని లాగే గుర్రాల కోసం 4,000* గుర్రపు శాలలు, అలాగే 12,000 గుర్రాలు ఉండేవి.*+ 27  ఈ ఉప పాలకులు సొలొమోను రాజు కోసం, అలాగే అతని బల్ల దగ్గర భోజనం చేసే ప్రతీ ఒక్కరి కోసం ఆహారం సమకూర్చేవాళ్లు. ప్రతీ ఒక్కరు తమకు నియమించిన నెలలో సమకూర్చేవాళ్లు, ఏమీ తక్కువ కాకుండా చూసుకునేవాళ్లు.+ 28  అంతేకాదు ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో, అక్కడ గుర్రాల కోసం, రథాల్ని లాగే గుర్రాల కోసం వాళ్లు తమతమ వాటా ప్రకారం బార్లీ, గడ్డి కూడా తెచ్చేవాళ్లు. 29  దేవుడు సొలొమోనుకు ఎంతో ఎక్కువగా తెలివిని, వివేచనను, సముద్రతీరాన ఉన్న ఇసుక అంత విస్తారమైన అవగాహన గల హృదయాన్ని ఇచ్చాడు.+ 30  సొలొమోను తెలివి తూర్పు దేశస్థులందరి తెలివిని, ఐగుప్తు ప్రజల తెలివి+ అంతటినీ మించిపోయింది. 31  అతను వేరే మనుషుల కన్నా తెలివిగలవాడు; ఎజ్రాహీయుడైన ఏతాను+ కన్నా, మహోలు కుమారులైన హేమాను,+ కల్కోలు,+ దర్దల కన్నా తెలివిగలవాడు; అతని ఖ్యాతి చుట్టుపక్కల దేశాలన్నిట్లో వ్యాపించింది.+ 32  అతను 3,000 సామెతలు చెప్పాడు,*+ 1,005 పాటలు+ కట్టాడు. 33  సొలొమోను, లెబానోనులో పెరిగే దేవదారు చెట్టు నుండి గోడ మీద పెరిగే హిస్సోపు+ వరకు రకరకాల చెట్ల గురించి; అలాగే జంతువుల గురించి,+ పక్షుల* గురించి,+ పాకే ప్రాణుల* గురించి,+ చేపల గురించి మాట్లాడాడు. 34  సొలొమోను తెలివిగల మాటల్ని వినడానికి అన్నిదేశాల ప్రజలు, అతని తెలివి గురించి విన్న రాజులందరూ అతని దగ్గరికి వచ్చేవాళ్లు.+

అధస్సూచీలు

లేదా “అధిపతులు.”
లేదా “డేరాలున్న గ్రామాల.”
అంటే, యూఫ్రటీసు.
అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న.
కొన్ని రాతప్రతుల్లో ఇక్కడ, అలాగే 2 దినవృత్తాంతాలు 9:25లో ఈ సంఖ్య కనిపిస్తుంది. వేరే రాతప్రతుల్లో 40,000 అని ఉంది.
లేదా “గుర్రపురౌతులు ఉండేవాళ్లు.”
లేదా “కూర్చాడు.”
లేదా “ఎగిరే ప్రాణుల.”
వీటిలో సరీసృపాలు, కీటకాలు కూడా ఉండివుండవచ్చు.