రాజులు మొదటి గ్రంథం 5:1-18

  • హీరాము రాజు నిర్మాణ సామాగ్రి ఇవ్వడం (1-12)

  • సొలొమోను వెట్టిచాకిరి చేయించినవాళ్లు (13-18)

5  సొలొమోను తన తండ్రి స్థానంలో రాజుగా అభిషేకించబడ్డాడని విని తూరు+ రాజైన హీరాము అతని దగ్గరికి సేవకుల్ని పంపించాడు; హీరాము దావీదుకు ఎప్పుడూ మంచి స్నేహితుడు.*+  అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు:+  “యెహోవా నా తండ్రైన దావీదు శత్రువుల్ని అతని పాదాల కింద ఉంచేంత వరకు అతను చాలామంది శత్రువులతో యుద్ధం చేయాల్సివచ్చింది. అందుకే అతను తన దేవుడైన యెహోవా పేరు కోసం ఒక మందిరాన్ని కట్టించలేకపోయాడని నీకు బాగా తెలుసు.+  కానీ ఇప్పుడు నా దేవుడైన యెహోవా అన్నివైపుల నుండి నాకు విశ్రాంతి ఇచ్చాడు.+ నాకు శత్రువులు ఎవ్వరూ లేరు, ఎలాంటి ఆపదలూ లేవు.+  అందుకే, ‘నీ సింహాసనం మీద నీ స్థానంలో నేను ఉంచబోయే నీ కుమారుడే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు’+ అని యెహోవా నా తండ్రైన దావీదుకు వాగ్దానం చేసినట్టు, నేను నా దేవుడైన యెహోవా పేరు కోసం ఒక మందిరం కట్టించాలనుకుంటున్నాను.  కాబట్టి నా కోసం లెబానోనులోని దేవదారు చెట్లను+ నరకమని నీ ప్రజలకు ఆజ్ఞాపించు. నా సేవకులు నీ సేవకులతో కలిసి పనిచేస్తారు, నువ్వు నిర్ణయించే జీతాన్ని నేను నీ సేవకులకు ఇస్తాను; సీదోనీయుల్లా చెట్లు నరికేవాళ్లు మాలో ఎవ్వరూ లేరని నీకు బాగా తెలుసు.”+  సొలొమోను మాటల్ని విన్నప్పుడు హీరాము ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు: “ఈ గొప్ప* జనాన్ని పరిపాలించడానికి దావీదుకు ఒక తెలివిగల కుమారుణ్ణి ఇచ్చిన యెహోవా ఈ రోజు స్తుతించబడాలి!”+  అప్పుడు హీరాము సొలొమోనుకు ఇలా సందేశం పంపించాడు: “నువ్వు పంపిన సందేశాన్ని విన్నాను. నువ్వు అడిగినట్టే దేవదారు, సరళవృక్ష* మ్రానుల్ని+ నీకు పంపిస్తాను.  నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరికి తీసుకొస్తారు, నేను వాటిని కలిపి కట్టించి, సముద్రం మీదుగా నువ్వు నాకు చెప్పే చోటికి పంపిస్తాను. అక్కడ నేను వాటిని విడదీయిస్తాను, మీరు వాటిని మోసుకొని వెళ్లవచ్చు. దానికి ప్రతిఫలంగా నేను నా ఇంటివాళ్ల కోసం అడిగే భోజన పదార్థాల్ని నువ్వు ఏర్పాటుచేయి.”+ 10  కాబట్టి హీరాము సొలొమోను అడిగినన్ని దేవదారు, సరళవృక్ష మ్రానుల్ని పంపించాడు. 11  సొలొమోను హీరాము ఇంటివాళ్ల కోసం ఆహారంగా 20,000 కొర్‌ కొలతల* గోధుమల్ని, 20 కొర్‌ కొలతల అతి శ్రేష్ఠమైన ఒలీవ నూనెను హీరాముకు ఇచ్చాడు. సొలొమోను అలా ప్రతీ సంవత్సరం హీరాముకు ఇచ్చాడు.+ 12  యెహోవా తాను వాగ్దానం చేసినట్టే సొలొమోనుకు తెలివిని ఇచ్చాడు.+ సొలొమోనుకు, హీరాముకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి, వాళ్లిద్దరూ సంధి* చేసుకున్నారు. 13  సొలొమోను రాజు ఇశ్రాయేలు అంతటి నుండి 30,000 మంది మనుషుల్ని వెట్టిచాకిరి చేయడానికి పిలిపించాడు.+ 14  అతను వంతుల వారీగా ప్రతీనెల 10,000 మందిని లెబానోనుకు పంపించేవాడు. వాళ్లు ఒక నెల లెబానోనులో పనిచేసేవాళ్లు, రెండు నెలలు ఇంటి దగ్గర ఉండేవాళ్లు; ఆ వెట్టిచాకిరి చేసేవాళ్ల మీద అదోనీరాము+ అధికారిగా ఉన్నాడు. 15  సొలొమోను దగ్గర 70,000 మంది మామూలు పనివాళ్లు,* 80,000 మంది పర్వతాల్లో రాళ్లు కొట్టేవాళ్లు+ ఉన్నారు.+ 16  అంతేకాదు, పనివాళ్లను పర్యవేక్షించడానికి 3,300 మంది ఉప పాలకులు+ సొలొమోను దగ్గర ఉన్నారు. 17  రాజాజ్ఞ ప్రకారం, చెక్కిన రాళ్లతో+ మందిరానికి పునాది+ వేయడానికి వాళ్లు పెద్దపెద్ద రాళ్లను, ఖరీదైన రాళ్లను+ తవ్వి తీశారు. 18  అలా సొలొమోనుకు, హీరాముకు చెందిన నిర్మాణ పనివాళ్లు, గెబలీయులు+ రాళ్లను చెక్కారు; మందిర నిర్మాణం కోసం మ్రానుల్ని, రాళ్లను సిద్ధం చేశారు.

అధస్సూచీలు

లేదా “దావీదును ఎప్పుడూ ప్రేమించాడు.”
లేదా “విస్తారమైన.”
అంటే, జూనిపర్‌ చెట్టు.
అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ఒప్పందం.”
లేదా “బరువులు మోసేవాళ్లు.”