సమూయేలు మొదటి గ్రంథం 16:1-23

  • సమూయేలు దావీదును తర్వాతి రాజుగా అభిషేకించడం (1-13)

    • “యెహోవా హృదయాన్ని చూస్తాడు” (7)

  • దేవుని పవిత్రశక్తి సౌలు నుండి తీసేయబడడం (14-17)

  • దావీదు సౌలు కోసం వీణ వాయించేవాడు (18-23)

16  చివరికి యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “నువ్వు ఎంతకాలం సౌలు కోసం దుఃఖిస్తావు?+ ఇశ్రాయేలు మీద రాజుగా పరిపాలించకుండా నేను అతన్ని తిరస్కరించాను కదా.+ నీ కొమ్ములో* నూనె నింపుకొని+ వెళ్లు. నిన్ను బేత్లెహేముకు చెందిన యెష్షయి+ దగ్గరికి పంపిస్తాను. ఎందుకంటే నా కోసం అతని కుమారుల్లో ఒకతన్ని నేను రాజుగా ఎంచుకున్నాను.”+  కానీ సమూయేలు, “నేనెలా వెళ్లగలను? ఈ విషయం సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు”+ అన్నాడు. దానికి యెహోవా ఇలా అన్నాడు: “నీ వెంట ఒక పెయ్యను తీసుకెళ్లి, ‘నేను యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను’ అని చెప్పు.  బలికి యెష్షయిని ఆహ్వానించు; నువ్వు ఏమి చేయాలో అప్పుడు నీకు తెలియజేస్తాను. నేను నీకు చెప్పే వ్యక్తిని నా కోసం అభిషేకించాలి.”+  సమూయేలు యెహోవా చెప్పినట్టే చేశాడు. అతను బేత్లెహేముకు+ వచ్చినప్పుడు, ఆ నగర పెద్దలు అతన్ని కలుసుకునేందుకు భయపడి, వణికిపోతూ, “నువ్వు శాంతిగానే వస్తున్నావా?” అని అడిగారు.  దానికి అతను, “శాంతిగానే వస్తున్నాను. నేను యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకుని నాతోపాటు బలి దగ్గరికి రండి” అని చెప్పాడు. తర్వాత అతను యెష్షయిని, అతని కుమారుల్ని పవిత్రపర్చాడు. ఆ తర్వాత వాళ్లను బలి దగ్గరికి పిలిపించాడు.  వాళ్లు వస్తుండగా సమూయేలు ఏలీయాబును+ చూసి, “యెహోవా అభిషేకించిన వ్యక్తి ఖచ్చితంగా ఇతనే” అనుకున్నాడు.  కానీ యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “అతని రూపాన్ని గానీ, ఎత్తును గానీ పట్టించుకోకు.+ నేను అతన్ని తిరస్కరించాను. మనుషులు చూసినట్టు దేవుడు చూడడు. మామూలు మనిషి, కంటికి కనిపించేదాన్నే చూస్తాడు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు.”+  తర్వాత యెష్షయి అబీనాదాబును+ పిలిచి, సమూయేలు ముందుకు తీసుకొచ్చాడు; కానీ సమూయేలు, “యెహోవా ఇతన్ని కూడా ఎంచుకోలేదు” అన్నాడు.  యెష్షయి ఆ తర్వాత షమ్మాను+ తీసుకొచ్చాడు; కానీ సమూయేలు, “యెహోవా ఇతన్ని కూడా ఎంచుకోలేదు” అన్నాడు. 10  అలా యెష్షయి తన ఏడుగురు కుమారుల్ని సమూయేలు ముందుకు తీసుకొచ్చాడు; కానీ సమూయేలు యెష్షయితో, “వీళ్లలో ఎవ్వర్నీ యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు. 11  చివరికి సమూయేలు యెష్షయిని, “నీ కుమారులు ఇంతమందేనా?” అని అడిగాడు. దానికి అతను, “చివరివాడు+ ఇక్కడ లేడు; అతను గొర్రెల్ని మేపుతున్నాడు”+ అని చెప్పాడు. అప్పుడు సమూయేలు యెష్షయితో, “అతన్ని పిలిపించు, అతను ఇక్కడికి వచ్చేంతవరకు మనం భోజనానికి కూర్చోం” అన్నాడు. 12  దాంతో యెష్షయి ఒక వ్యక్తిని పంపించి అతన్ని రప్పించాడు. అతను చక్కని కళ్లతో, ఎర్రగా, అందంగా ఉన్నాడు.+ అప్పుడు యెహోవా, “నేను ఎంచుకున్నది ఇతన్నే. నువ్వు లేచి, ఇతన్ని అభిషేకించు!”+ అని చెప్పాడు. 13  కాబట్టి సమూయేలు నూనె ఉన్న కొమ్మును+ తీసుకొని అతని అన్నల ముందు అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా పవిత్రశక్తి దావీదును శక్తిమంతుణ్ణి చేయడం మొదలుపెట్టింది.+ తర్వాత సమూయేలు లేచి తన దారిన రామాకు+ వెళ్లాడు. 14  అప్పుడు యెహోవా సౌలు నుండి తన పవిత్రశక్తిని తీసేశాడు.+ దాంతో ప్రతికూల ఆలోచనలు* అతన్ని భయపెట్టేలా యెహోవా అనుమతించాడు.+ 15  సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇదిగో, ప్రతికూల ఆలోచనలు నిన్ను భయపెట్టేలా దేవుడు అనుమతిస్తున్నాడు. 16  కాబట్టి ప్రభూ, చక్కగా వీణ* వాయించే+ ఒక వ్యక్తిని వెదకమని నీ ఎదుట ఉన్న నీ సేవకులకు దయచేసి ఆజ్ఞాపించు. దేవుడు నీకు ప్రతికూల ఆలోచనలు రానిచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి దాన్ని వాయిస్తాడు, అప్పుడు నీకు ఊరట అనిపిస్తుంది.” 17  దాంతో సౌలు తన సేవకులతో, “దయచేసి చక్కగా వీణ వాయించే ఒక వ్యక్తిని వెదికి, నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 18  అప్పుడు సేవకుల్లో ఒకతను ఇలా చెప్పాడు: “ఇదిగో! బేత్లెహేమువాసి అయిన యెష్షయి కుమారుల్లో ఒకతను చక్కగా వాయించడం నేను చూశాను. అతను ధైర్యవంతుడు, బలమైన యోధుడు.+ అతను బాగా మాట్లాడగలడు, అందగాడు,+ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.”+ 19  అప్పుడు సౌలు సందేశకుల ద్వారా యెష్షయికి, “మంద దగ్గరున్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరికి పంపించు”+ అని కబురు పంపించాడు. 20  దాంతో యెష్షయి రొట్టెల్ని, ఒక తోలుసంచిలో ద్రాక్షారసాన్ని, ఒక మేకపిల్లను గాడిద మీద పెట్టి తన కుమారుడైన దావీదుతోపాటు వాటిని సౌలు దగ్గరికి పంపించాడు. 21  అలా దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతనికి సేవ చేయడం మొదలుపెట్టాడు.+ సౌలు దావీదును ఎంతో ప్రేమించసాగాడు. అతను సౌలు ఆయుధాల్ని మోసేవాడయ్యాడు. 22  తర్వాత సౌలు యెష్షయికి ఈ సందేశం పంపాడు: “దయచేసి దావీదును నా సేవలో ఉండనివ్వు, అతను నా దృష్టిలో దయ పొందాడు.” 23  దేవుడు సౌలుకు ప్రతికూల ఆలోచనలు రానిచ్చినప్పుడల్లా దావీదు వీణ తీసుకొని వాయించేవాడు. అప్పుడు సౌలుకు ఉపశమనం, ఊరట కలిగేవి; ప్రతికూల ఆలోచనలు పోయేవి.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.