సమూయేలు మొదటి గ్రంథం 18:1-30
18 దావీదు సౌలుతో మాట్లాడడం పూర్తికాగానే యోనాతాను, దావీదులు దగ్గరి స్నేహితులయ్యారు. యోనాతాను దావీదును ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు.+
2 ఆ రోజు నుండి సౌలు దావీదును తన దగ్గరే ఉంచుకున్నాడు, అతన్ని తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లనివ్వలేదు.+
3 యోనాతాను దావీదును ప్రాణంగా ప్రేమించాడు+ కాబట్టి వాళ్లిద్దరూ ఒప్పందం చేసుకున్నారు.+
4 యోనాతాను తాను వేసుకున్న చేతుల్లేని నిలువుటంగీని తీసి దావీదుకు ఇచ్చాడు. అలాగే తన యుద్ధ వస్త్రాన్ని, తన కత్తిని, తన విల్లును, తన దట్టీని కూడా ఇచ్చాడు.
5 ఆ తర్వాత దావీదు యుద్ధాలకు వెళ్లడం మొదలుపెట్టాడు, అతను సౌలు పంపించిన చోటల్లా విజయం సాధించాడు.*+ దాంతో సౌలు దావీదును యోధుల మీద నియమించాడు.+ ఇది ప్రజలందరికీ, సౌలు సేవకులకు నచ్చింది.
6 దావీదు, మరితరులు ఫిలిష్తీయుల్ని చంపి వెనక్కి వచ్చేటప్పుడు, సౌలు రాజుకు స్వాగతం చెప్పడానికి ఇశ్రాయేలు నగరాలన్నిట్లో నుండి స్త్రీలు కంజీరలతో,*+ మూడు తంతుల వాద్యాలతో సంతోషంగా పాటలు పాడుతూ+ నాట్యం చేస్తూ ఎదురు వచ్చేవాళ్లు.
7 అలా సంబరాలు జరుపుకుంటున్న స్త్రీలు ఇలా పాడేవాళ్లు:
“సౌలు వెయ్యిమంది శత్రువుల్ని చంపాడు,దావీదు పదివేలమంది శత్రువుల్ని చంపాడు.”+
8 అప్పుడు సౌలుకు ఎంతో కోపం వచ్చింది,+ ఆ పాట అతనికి నచ్చలేదు. అతను ఇలా అనుకున్నాడు: “దావీదు పదివేలమంది శత్రువుల్ని చంపాడని, కానీ నేనేమో వెయ్యిమంది శత్రువుల్ని చంపానని వాళ్లు పొగిడారు. ఇక మిగిలింది అతనికి రాజరికం ఇవ్వడమే!”+
9 ఆ రోజు నుండి సౌలు దావీదును ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు.
10 తర్వాతి రోజు, దేవుడు సౌలుకు ప్రతికూల ఆలోచనలు* రానిచ్చాడు.+ దాంతో అతను ఇంట్లో వింతగా* ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు దావీదు మిగతా సందర్భాల్లోలాగే వీణ* వాయిస్తున్నాడు.+ సౌలు చేతిలో ఒక ఈటె ఉంది,+
11 అతను, ‘నేను దావీదును గోడకు బిగిస్తాను!’ అనుకుంటూ రెండుసార్లు దావీదు మీదికి ఈటె విసిరాడు.+ కానీ దావీదు అతని నుండి తప్పించుకున్నాడు.
12 అప్పుడు సౌలు దావీదుకు భయపడ్డాడు. ఎందుకంటే యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు,+ కానీ ఆయన సౌలును విడిచిపెట్టాడు.
13 కాబట్టి సౌలు దావీదును తన దగ్గర నుండి పంపించేసి అతన్ని సహస్రాధిపతిగా* నియమించాడు. దావీదు ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించేవాడు. +
14 దావీదు తాను చేసిన పనులన్నిట్లో విజయం సాధిస్తూ వచ్చాడు,* యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.+
15 దావీదు ఎంతో విజయం సాధిస్తుండడం చూసి సౌలు అతనికి భయపడ్డాడు.
16 కానీ ఇశ్రాయేలీయులందరూ, యూదావాళ్లందరూ దావీదును ఇష్టపడ్డారు. ఎందుకంటే అతను యుద్ధాల్లో వాళ్లకు నాయకత్వం వహించేవాడు.
17 తర్వాత సౌలు దావీదుతో, “ఇదిగో నా పెద్ద కూతురు మేరబు.+ ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను.+ అయితే, నువ్వు నా కోసం ధైర్యం చూపిస్తూ, యెహోవా యుద్ధాల్లో పోరాడాలి”+ అన్నాడు. ఎందుకంటే సౌలు ఇలా అనుకున్నాడు: ‘నా చెయ్యి అతని మీద పడకూడదు. అతను ఫిలిష్తీయుల చేతిలో చావాలి.’+
18 అప్పుడు దావీదు సౌలుతో, “రాజుకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి, ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఎంతటిది?” అన్నాడు.+
19 అయితే, సౌలు కూతురైన మేరబును దావీదుకు ఇచ్చే సమయం వచ్చేసరికి, ఆమె అప్పటికే మెహోలతీయుడైన అద్రీయేలుకు+ భార్యగా ఇవ్వబడింది.
20 అయితే సౌలు కూతురైన మీకాలు+ దావీదును ప్రేమించింది, ఆ విషయం తెలిసినప్పుడు సౌలు సంతోషించాడు.
21 సౌలు ఇలా అనుకున్నాడు: “దావీదుకు ఉచ్చుగా మారేలా ఆమెను దావీదుకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు అతను ఫిలిష్తీయుల చేతిలో చనిపోతాడు.”+ సౌలు దావీదుతో రెండోసారి, “నువ్వు ఈ రోజు నా అల్లుడివి అవుతావు” అన్నాడు.
22 అంతేకాదు, సౌలు తన సేవకులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి అతనితో, ‘చూడు! రాజుకు నువ్వు నచ్చావు, అతని సేవకులందరికీ నువ్వంటే ఇష్టం. కాబట్టి ఇప్పుడు రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకో’ అని చెప్పండి.”
23 సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, అతను ఇలా అన్నాడు: “రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? నేనేమో పేదవాణ్ణి, అంతగా పేరులేనివాణ్ణి.”+
24 తర్వాత సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటల్ని సౌలుకు తెలియజేశారు.
25 అప్పుడు సౌలు ఇలా అన్నాడు: “ ‘రాజు తన శత్రువుల మీద పగతీర్చుకునేందుకు ఫిలిష్తీయుల 100 ముందోళ్లు*+ తప్ప ఇంకేమీ కట్నంగా+ అడగడం లేదు’ అని మీరు దావీదుతో అనాలి.” ఎందుకంటే, ఫిలిష్తీయుల చేతిలో దావీదు చనిపోవాలని సౌలు పన్నాగం పన్నుతున్నాడు.
26 సౌలు సేవకులు అతని మాటల్ని దావీదుకు తెలియజేశారు; రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి దావీదు ఇష్టపడ్డాడు.+ అయితే గడువు కన్నా ముందే,
27 దావీదు తన మనుషులతో వెళ్లి, 200 మంది ఫిలిష్తీయుల్ని చంపి, రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వాళ్లందరి ముందోళ్లను రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి, సౌలు తన కూతురు మీకాలును దావీదుకు ఇచ్చి పెళ్లి చేశాడు.+
28 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని,+ తన కూతురు మీకాలు అతన్ని ప్రేమించిందని+ సౌలుకు అర్థమైంది.
29 దాంతో సౌలు దావీదుకు ఇంకా భయపడ్డాడు, సౌలు బ్రతికినంత కాలం దావీదుకు శత్రువుగా ఉన్నాడు.+
30 ఫిలిష్తీయుల అధిపతులు యుద్ధానికి వచ్చేవాళ్లు. అయితే వాళ్లు యుద్ధానికి వచ్చినప్పుడల్లా సౌలు సేవకులందరి కన్నా దావీదు ఎక్కువగా విజయం సాధించేవాడు;*+ దానివల్ల అతనికి ఎంతో పేరు వచ్చింది.+
అధస్సూచీలు
^ లేదా “తెలివిగా నడుచుకున్నాడు.”
^ అంటే, గిలకల తప్పెట.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “ప్రవక్తలా.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అంటే, 1,000 మంది మీద అధిపతి.
^ లేదా “తెలివిగా నడుచుకుంటూ వచ్చాడు.”
^ అంటే, పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మం.
^ లేదా “ఎక్కువ తెలివిగా నడుచుకునేవాడు.”