రెండో కొరింథీయులు 5:1-21

  • దేవుడు ఇచ్చే భవనాన్ని ధరించడం (1-10)

  • మళ్లీ శాంతియుత సంబంధాన్ని కలగజేసే పరిచర్య (11-21)

    • కొత్త సృష్టి (17)

    • క్రీస్తుకు రాయబారులు (20)

5  మన భూసంబంధ ఇల్లు* అయిన ఈ డేరా నాశనమైతే,+ దేవుడు మనకు పరలోకంలో శాశ్వతమైన భవనాన్ని ఇస్తాడని మనకు తెలుసు, అది చేతులతో కట్టిన భవనం కాదు.+  ఈ ఇంట్లో ఉన్న మనం మూల్గుతున్నాం; దేవుడు పరలోకంలో మనకు ఇచ్చే దాన్ని* ధరించాలని బలంగా కోరుకుంటున్నాం.+  దాన్ని ధరించినప్పుడు మనం దిగంబరంగా కనిపించం.  నిజానికి ఈ ఇంట్లో ఉన్న మనం ఎంతో ఆందోళనతో మూల్గుతున్నాం. దీన్ని తీసేయాలని కాదుగానీ, నాశనమైపోయేది జీవం చేత మింగేయబడేలా,+ పరలోకంలో ఉన్న దాన్ని ధరించాలని కోరుకుంటున్నాం.+  దీనికోసం దేవుడే మనల్ని సిద్ధం చేశాడు,+ రాబోయే ఆశీర్వాదానికి గుర్తుగా* మనకు పవిత్రశక్తిని ఇచ్చాడు.+  కాబట్టి మనం ఎప్పుడూ మంచి ధైర్యంతో ఉన్నాం. మనం ఇల్లు లాంటి ఈ శరీరంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉంటామని మనకు తెలుసు.+  ఎందుకంటే, మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం.  అయితే మనం మంచి ధైర్యంతో ఉన్నాం, ఈ శరీరంలో నివసించడం కన్నా దీనికి దూరంగా ప్రభువు దగ్గర నివసించడమే మనకు ఇష్టం.+  కాబట్టి మనం ఆయన దగ్గర నివసించినా, ఆయనకు దూరంగా నివసించినా, ఆయనకు నచ్చేలా ఉండాలన్నదే మన లక్ష్యం. 10  ఎందుకంటే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి.* మనలో ప్రతీ ఒక్కరం ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన పనులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతాం, అవి మంచి పనులైనా సరే, చెడ్డ* పనులైనా సరే.+ 11  ప్రభువుకు భయపడడమంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి మేము ఇతరుల్ని ఒప్పించేలా బోధిస్తూ ఉన్నాం; దేవునికి మాత్రం మేమేంటో బాగా తెలుసు. అయితే, మేమేంటో మీ మనస్సాక్షికి కూడా బాగా తెలుసని ఆశిస్తున్నాను. 12  మమ్మల్ని మేము మళ్లీ మీకు సిఫారసు చేసుకోవట్లేదు కానీ, మా విషయంలో గొప్పలు చెప్పుకునేలా మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఇదంతా చెప్తున్నాం. దానివల్ల మీరు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి కాకుండా పైరూపాన్ని బట్టి గొప్పలు చెప్పుకునేవాళ్లకు జవాబివ్వగలుగుతారు.+ 13  మేము పిచ్చివాళ్లలా ప్రవర్తించివుంటే,+ అది దేవుని కోసమే; మేము స్థిమితంగా ఉంటే, అది మీ కోసమే. 14  ఎందుకంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది. మేము ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం: ఒక్క మనిషి అందరి కోసం చనిపోయాడు; అందరూ అప్పటికే చనిపోయారు కాబట్టి ఆయన అందరి కోసం చనిపోవాల్సి వచ్చింది;+ 15  బ్రతికున్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా,+ తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని ఆయన అందరి కోసం చనిపోయాడు. 16  ఇప్పటినుండి మేము ఎవర్నీ మనుషుల దృష్టితో చూడం.+ ఒకవేళ గతంలో మేము క్రీస్తును మనుషుల దృష్టితో చూసినా, ఇప్పటినుండి మాత్రం అస్సలు అలా చూడం.+ 17  కాబట్టి ఎవరైనా క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారంటే, అతను కొత్త సృష్టి;+ పాతవి గతించిపోయాయి; ఇదిగో! కొత్తవి ఉనికిలోకి వచ్చాయి. 18  అయితే, అన్నీ దేవుని నుండే వచ్చాయి. మేము క్రీస్తు ద్వారా తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేసింది ఆయనే;+ శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్యను మాకు ఇచ్చింది కూడా ఆయనే;+ 19  ఆ పరిచర్య ఏమిటంటే, దేవుడు ప్రజలు చేసిన తప్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా,+ క్రీస్తు ద్వారా లోకం తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేస్తూ వచ్చాడు.+ ఈ శాంతి సందేశాన్ని ప్రకటించే బాధ్యతను ఆయన మాకు అప్పగించాడు.+ 20  కాబట్టి క్రీస్తుకు బదులు మేము రాయబారులుగా పనిచేస్తున్నాం.+ అది ఒకవిధంగా దేవుడు మా ద్వారా విన్నపం చేస్తున్నట్టు ఉంది. క్రీస్తుకు బదులు రాయబారులుగా+ పనిచేస్తున్న మేము, “దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోండి” అని వేడుకుంటున్నాం. 21  ఏ పాపం చేయని క్రీస్తును+ దేవుడు మన కోసం పాపపరిహారార్థ బలిగా* చేశాడు, ఆయన ద్వారా మనం తన దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని అలా చేశాడు.+

అధస్సూచీలు

“ఇల్లు,” “భవనం” అనే పదాలు భౌతిక లేదా పరలోక సంబంధ శరీరాన్ని సూచిస్తున్నాయి.
లేదా “మన పరలోక నివాసాన్ని.”
లేదా “బయానాగా (అడ్వాన్సుగా); పూచీగా (టోకెన్‌గా).”
లేదా “మనం ఎలాంటి వ్యక్తులమో క్రీస్తు న్యాయపీఠం ముందు వెల్లడౌతుంది.”
లేదా “నీచమైన.”
అక్ష., “పాపంగా.”