రెండో కొరింథీయులు 8:1-24

  • యూదయలోని క్రైస్తవుల కోసం విరాళాల సేకరణ (1-15)

  • తీతును కొరింథుకు పంపడం (16-24)

8  సహోదరులారా, మాసిదోనియలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని అపారదయ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం.+  ఒక పెద్ద పరీక్ష వల్ల వాళ్లకు కష్టాలు ఎదురైనా, వాళ్లు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో ఉదారత చూపించారు; చాలా పేదరికంలో ఉన్నా అలా చేశారు.  వాళ్లు ఇవ్వగలిగింది ఇచ్చారు,+ నిజానికి ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చారని+ నేను సాక్ష్యమిస్తున్నాను.  వాళ్లంతట వాళ్లే ముందుకొచ్చి, విరాళమిచ్చే గొప్ప అవకాశం, ఇతరులతోపాటు పవిత్రులకు సహాయం* చేసే గొప్ప అవకాశం తమకూ ఇవ్వమని మమ్మల్ని ఎంతో బ్రతిమాలారు.+  మేము అనుకున్న దానికన్నా వాళ్లు ఎక్కువే చేశారు. వాళ్లు ముందుగా దేవుని ఇష్టప్రకారం ప్రభువు సేవకు తమను తాము అంకితం చేసుకున్నారు, అలాగే మాకు కూడా సేవచేశారు.  అందుకే, మీ దగ్గర విరాళాలు సేకరించే పనిని మొదలుపెట్టిన తీతునే దాన్ని పూర్తిచేయమని ప్రోత్సహించాం.+  మీరు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నారు; మీ విశ్వాసం బలంగా ఉంది, మీకు మాట్లాడే సామర్థ్యం ఉంది, మీ జ్ఞానం పెరుగుతోంది, మీరు చేసే ప్రతీది ఎంతో కష్టపడి చేస్తున్నారు, మేము మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు నిజంగా ఇతరుల్ని ప్రేమిస్తున్నారు. అదేవిధంగా, విరాళాలిచ్చే విషయంలో మీరు కూడా మీ సమృద్ధిని చూపించండి.+  మిమ్మల్ని ఆజ్ఞాపించాలని కాదుగానీ ఇతరులు చూపిస్తున్న పట్టుదల గురించి మీకు తెలియాలని, మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలని ఇలా చెప్తున్నాను.  మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ గురించి మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా, తన పేదరికం ద్వారా మీరు ధనవంతులు అవ్వాలని మీకోసం పేదవాడయ్యాడు.+ 10  ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే,+ ఈ పని చేయడంవల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఒక సంవత్సరం క్రితం మీరు దీన్ని చేయాలని కోరుకున్నారు, కోరుకోవడమే కాదు ప్రారంభించారు కూడా. 11  అందుకే, మీరు ఎంత ఉత్సాహంగా ఈ సేకరించే పని మొదలుపెట్టారో అంతే ఉత్సాహంగా మీకున్న దానితో ఈ పనిని పూర్తిచేయండి. 12  ఎందుకంటే, ఇవ్వాలనే మనసు ఒక వ్యక్తికి ఉంటే, అతను ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు,+ అతను ఇవ్వలేని దాన్ని ఆయన ఆశించడు. 13  ఇతరుల భారం తగ్గించి, మీ భారం పెంచాలనేది నా ఉద్దేశం కాదు; 14  బదులుగా ఇప్పుడు మీకున్న సమృద్ధి వాళ్ల అవసరాన్ని తీర్చాలని, అలాగే వాళ్ల సమృద్ధి మీ అవసరాన్ని తీర్చాలని, అలా మీ భారాల్ని సమానం చేయాలనేది నా ఉద్దేశం. 15  లేఖనాల్లో కూడా ఇలా ఉంది: “ఎక్కువ సమకూర్చుకున్న వ్యక్తి దగ్గర మరీ ఎక్కువ లేదు, తక్కువ సమకూర్చుకున్న వ్యక్తి దగ్గర మరీ తక్కువ లేదు.”+ 16  మీ మీద మాకు ఎంత శ్రద్ధ ఉందో తీతుకు కూడా అంతే శ్రద్ధ ఉంది,+ అందుకు దేవునికి కృతజ్ఞతలు. 17  ఎందుకంటే మేము ఇచ్చిన ప్రోత్సాహానికి అతను స్పందించాడు. అయితే, ఈ పని చేయాలనే కోరిక అతనిలో కూడా ఉంది కాబట్టి తనంతట తానే మీ దగ్గరికి వస్తున్నాడు. 18  మేము అతనితో పాటు ఇంకో సహోదరుణ్ణి పంపిస్తున్నాం. మంచివార్త ప్రకటించే విషయంలో సంఘాలన్నిట్లో అతనికి మంచిపేరు ఉంది. 19  అంతేకాదు, మాతో కలిసి ప్రయాణిస్తూ ఈ విరాళాల్ని పంచిపెట్టడానికి సంఘాలు అతన్ని నియమించాయి. ఈ పని ప్రభువుకు మహిమను తీసుకొస్తుంది, మేము ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిరూపిస్తుంది. 20  ఈ విధంగా మేము, ఉదారంగా మీరు ఇస్తున్న విరాళాల్ని పంచిపెట్టే బాధ్యత విషయంలో+ మమ్మల్ని ఎవ్వరూ తప్పుబట్టకుండా చూసుకుంటున్నాం. 21  ఎందుకంటే మేము ‘ప్రతీ పనిని యెహోవా* ముందే కాదు, మనుషుల ముందు కూడా నిజాయితీగా చేస్తున్నాం.’+ 22  మేము వాళ్లతో పాటు మరో సహోదరుణ్ణి కూడా పంపిస్తున్నాం. చాలా విషయాల్లో మేము అతన్ని ఎన్నోసార్లు పరీక్షించి చూశాం, ఇచ్చిన పనిని అతను కష్టపడి చేస్తాడని తెలుసుకున్నాం. అతనికి మీ మీద ఎంతో నమ్మకముంది కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టపడి పనిచేస్తాడు. 23  అయితే, ఎవరైనా తీతు గురించి ప్రశ్నిస్తే, అతను నా సహచరుడనీ మీకు సహాయం చేసే విషయంలో నా తోటి పనివాడనీ చెప్పండి. ఎవరైనా ఈ సహోదరుల గురించి ప్రశ్నిస్తే, వాళ్లు సంఘాలకు అపొస్తలులనీ వాళ్లు క్రీస్తును మహిమపరుస్తున్నారనీ చెప్పండి. 24  కాబట్టి ఈ సహోదరుల మీద మీకున్న ప్రేమను రుజువు చేసుకోండి,+ మేము మీ గురించి ఎందుకు గొప్పగా చెప్పామో సంఘాలకు చూపించండి.

అధస్సూచీలు

అక్ష., “పరిచారం.”
అనుబంధం A5 చూడండి.