రెండో తిమోతి 2:1-26
2 కాబట్టి నా కుమారుడా,+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల పొందిన అపారదయ ద్వారా నువ్వు శక్తి పొందుతూ ఉండు.
2 నువ్వు నా దగ్గర విన్న విషయాల్ని, అంటే ఎంతోమంది సాక్షులు ధృవీకరించిన విషయాల్ని+ నమ్మకమైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు.
3 క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా,+ కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు.+
4 సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వ్యాపారాల్లో* పాల్గొనడు.* ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు.
5 ఆటల పోటీల్లో కూడా, నియమాల ప్రకారం ఆడితేనే తప్ప ఎవ్వరూ బహుమతిని* గెల్చుకోలేరు.+
6 కష్టపడి పనిచేసే రైతు పంటను మొదట తినాలి.
7 నేను చెప్తున్న విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండు; ప్రభువు నీకు అన్ని విషయాల్లో అవగాహనను* అనుగ్రహిస్తాడు.
8 దావీదు సంతానమైన*+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని+ గుర్తుంచుకో; దాని గురించిన మంచివార్తనే నేను ప్రకటిస్తున్నాను.+
9 ఆ మంచివార్త కోసమే నేను బాధలు అనుభవిస్తున్నాను, నేరస్తుడిగా చెరసాలలో ఉన్నాను.+ అయితే, దేవుని వాక్యం బంధించబడి లేదు.+
10 అందుకే, దేవుడు ఎంచుకున్నవాళ్ల కోసం నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను.+ వాళ్లు కూడా క్రీస్తుయేసు ద్వారా కలిగే రక్షణను, శాశ్వతమైన మహిమను పొందాలన్నదే నా ఉద్దేశం.
11 ఈ మాట నమ్మదగినది: మనం ఆయనతో కలిసి చనిపోయి ఉంటే, ఆయనతో కలిసి బ్రతుకుతాం కూడా;+
12 మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం;+ మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు;+
13 మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన మాత్రం నమ్మకంగానే ఉంటాడు; ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
14 ఈ విషయాలు వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు, పదాల గురించి పోట్లాడుకోవద్దని ఉపదేశిస్తూ* ఉండు. ఎందుకంటే దానివల్ల వినేవాళ్లకు హాని జరగడం* తప్ప ఒరిగేదేమీ ఉండదు.
15 దేవుని ఆమోదం పొందిన సేవకుడిగా, ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపయోగించేవాడిగా+ నిన్ను నువ్వు దేవునికి కనబర్చుకోవడానికి శాయశక్తులా కృషిచేయి.
16 పవిత్రమైనదాన్ని అగౌరవపర్చే పనికిరాని మాటల్ని తిరస్కరించు.+ ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు.
17 వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. హుమెనైయు, ఫిలేతు అలాంటివాళ్లే.+
18 వాళ్లు, పునరుత్థానం ఇప్పటికే జరిగిపోయిందని చెప్తూ+ సత్యం నుండి తొలగిపోయారు, అలాగే కొందరి విశ్వాసాన్ని పాడుచేస్తున్నారు.
19 అయినా దేవుని గట్టి పునాది ఇంకా నిలిచే ఉంది, దానిమీద ఈ ముద్ర ఉంది: “తనవాళ్లు ఎవరో యెహోవాకు* తెలుసు,”+ “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే+ ప్రతీ ఒక్కరు అవినీతిని వదిలేయాలి.”
20 ఒక గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలే కాకుండా చెక్క పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. కొన్నిటిని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు, కొన్నిటిని మామూలు పనులకు ఉపయోగిస్తారు.
21 ఎవరైనా ఈ రెండో రకం పాత్రలకు దూరంగా ఉంటే, అతను ముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా* ఉంటాడు; అతను శుద్ధీకరించబడి, తన యజమానికి పనికొచ్చే పాత్రగా ఉంటాడు, ప్రతీ మంచిపనికి సిద్ధంగా ఉంటాడు.
22 అందుకే నువ్వు యౌవన కోరికల నుండి పారిపో; పవిత్రమైన హృదయంతో ప్రభువు పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి గట్టిగా కృషిచేయి.
23 అంతేకాదు, గొడవల్ని రేపే మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించు.+
24 ఎందుకంటే, ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా* వ్యవహరించాలి,+ అతనికి బోధించే సామర్థ్యం ఉండాలి, అతనికి ఎవరైనా హాని చేస్తే నిగ్రహం చూపించాలి,+
25 వ్యతిరేకించేవాళ్లకు సౌమ్యంగా ఉపదేశించాలి.+ బహుశా, దేవుడు వాళ్లలో పశ్చాత్తాపాన్ని* కలిగించి, వాళ్లు సత్యం గురించిన సరైన జ్ఞానం పొందేలా చేయవచ్చు.+
26 దానివల్ల వాళ్లు, అపవాది తన ఇష్టం నెరవేర్చేలా తమను సజీవంగా పట్టుకున్నాడని+ గుర్తించి, కళ్లు తెరిచి, అతని ఉచ్చులో నుండి తప్పించుకోవచ్చు.
అధస్సూచీలు
^ లేదా “రోజువారీ కార్యకలాపాల్లో” అయ్యుంటుంది.
^ అక్ష., “చిక్కుకోడు.”
^ అక్ష., “కిరీటాన్ని.”
^ లేదా “వివేచనను.”
^ అక్ష., “విత్తనం నుండి వచ్చిన.”
^ అక్ష., “పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ.”
^ లేదా “వాళ్లను నాశనం చేయడం; వాళ్లను తలక్రిందులు చేయడం.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “పాత్రగా.”
^ లేదా “యుక్తితో.”
^ లేదా “మారుమనసును.”