రెండో తిమోతి 3:1-17
3 అయితే ఈ విషయం తెలుసుకో. చివరి రోజుల్లో+ ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.
2 ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు,* డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు,
3 మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు,* లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు,
4 నమ్మకద్రోహులు, మూర్ఖులు,* గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు,
5 పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.+ అలాంటివాళ్లకు నువ్వు దూరంగా ఉండు.
6 వాళ్లలో కొందరు కుయుక్తిగా ఇళ్లలో చొరబడతారు; పాపాల అదుపులో ఉండి వివిధరకాల కోరికల వెంట పరుగులుతీసే బలహీనమైన స్త్రీలను చెరపట్టుకుపోతారు.
7 అలాంటి స్త్రీలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, అయినా ఎప్పటికీ సత్యం గురించిన సరైన జ్ఞానం సంపాదించుకోలేరు.
8 యన్నే, యంబ్రే అనేవాళ్లు మోషేను వ్యతిరేకించినట్టే, ఈ మనుషులు కూడా సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటివాళ్ల మనసు పూర్తిగా భ్రష్టుపట్టింది; వాళ్లు విశ్వాసానికి తగ్గట్టు నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాళ్లను ఆమోదించడు.
9 అయితే వాళ్లు అంతకుమించి ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్లాగే వాళ్ల మూర్ఖత్వం కూడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.+
10 నువ్వైతే నా బోధను, నా జీవన విధానాన్ని, నా లక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని, నా ఓర్పును, నా ప్రేమను, నా సహనాన్ని జాగ్రత్తగా అనుసరించావు.+
11 అంతేకాదు అంతియొకయలో,+ ఈకొనియలో,+ లుస్త్రలో+ నాకు ఎదురైన హింసలు, నేను పడిన బాధలు నీకు తెలుసు. వాటన్నిటి నుండి ప్రభువు నన్ను కాపాడాడు.
12 నిజానికి, క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.+
13 అయితే దుష్టులు, మోసగాళ్లు ఇతరుల్ని తప్పుదోవ పట్టిస్తూ, వాళ్లూ తప్పుదోవ పడుతూ అంతకంతకూ చెడిపోతారు.+
14 నువ్వు మాత్రం, నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు. ఎందుకంటే, నువ్వు ఎవరి నుండి ఆ విషయాలు నేర్చుకున్నావో నీకు తెలుసు;
15 అంతేకాదు పసితనం+ నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు.+ క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.+
16 లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.+ అవి బోధించడానికి,+ గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.+
17 దానివల్ల దేవుని సేవకుడు ప్రతీ మంచిపని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు.
అధస్సూచీలు
^ లేదా “స్వార్థపరులు.”
^ లేదా “ఇతరులతో సమ్మతించడానికి ఇష్టపడనివాళ్లు.”
^ లేదా “తలబిరుసుగా ప్రవర్తించేవాళ్లు.”