రెండో తిమోతి 4:1-22
4 దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తుయేసు వెల్లడై+ తన రాజ్యంతో వచ్చినప్పుడు+ బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పుతీరుస్తాడు.+ నేను నీకు ఆజ్ఞాపించేది ఏమిటంటే,
2 వాక్యాన్ని ప్రకటించు;+ అనుకూలంగా ఉన్న సమయాల్లో, కష్టమైన సమయాల్లో చురుగ్గా* ఆ పని చేయి; సంపూర్ణమైన ఓర్పుతో, బోధనాకళతో+ గద్దించు,+ గట్టిగా హెచ్చరించు, ప్రోత్సహించు.
3 ఎందుకంటే, ప్రజలు మంచి* బోధను సహించని+ రోజులు వస్తాయి; వాళ్లు తమ సొంత కోరికలకు అనుగుణంగా, తమకు నచ్చేవాటిని చెప్పే బోధకుల్ని పోగుచేసుకుంటారు.+
4 వాళ్లు సత్యాన్ని వినడం మానేసి, కట్టుకథల వైపు తిరుగుతారు.
5 కానీ నువ్వైతే అన్ని విషయాల్లో నీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకో, కష్టాల్ని సహించు,+ మంచివార్త ప్రచారకుడిగా* పనిచేయి,* నీ పరిచర్యను పూర్తిగా నెరవేర్చు.+
6 నేను ఇప్పటికే పానీయార్పణగా+ పోయబడుతున్నాను, నా విడుదల సమయం+ దగ్గరపడింది.
7 నేను మంచి పోరాటం పోరాడాను,+ పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను,+ విశ్వాసాన్ని అనుసరించాను.
8 ఇప్పుడు నాకోసం నీతి కిరీటం+ సిద్ధంగా ఉంచబడింది. నీతిగల న్యాయమూర్తి అయిన ప్రభువు+ ఆ రోజున నాకు దాన్ని బహుమతిగా ఇస్తాడు;+ నా ఒక్కడికే కాదు, ఆయన వెల్లడయ్యే సమయం కోసం ఆశగా ఎదురుచూసే వాళ్లందరికీ ఇస్తాడు.
9 వీలైనంత త్వరగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించు.
10 ఎందుకంటే ఈ వ్యవస్థ* మీద ప్రేమతో దేమా+ నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్లిపోయాడు; క్రేస్కే గలతీయకు వెళ్లాడు, తీతు దల్మతియకు వెళ్లాడు.
11 లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకుని రా, అతను పరిచర్యలో నాకు సహాయంగా ఉంటాడు.
12 తుకికును+ నేను ఎఫెసుకు పంపించాను.
13 నువ్వు వచ్చేటప్పుడు త్రోయలో కర్పు దగ్గర నేను వదిలేసి వచ్చిన అంగీని, అలాగే గ్రంథపు చుట్టల్ని, ముఖ్యంగా తోలు కాగితాల్ని* తీసుకురా.
14 రాగిపనివాడైన అలెక్సంద్రు నాకు ఎంతో హాని చేశాడు. అతని పనులకు తగ్గట్టు యెహోవా* అతనికి ప్రతిఫలమిస్తాడు.+
15 అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అతను మా సందేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
16 మొదటిసారి నేను నా వాదన వినిపిస్తున్నప్పుడు ఎవ్వరూ నా పక్షాన నిలబడలేదు, అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారు. వాళ్లు చేసినదానికి దేవుడు వాళ్లను జవాబుదారులుగా ఎంచకూడదని కోరుకుంటున్నాను.
17 అయితే ప్రభువు నా దగ్గర నిలబడి, నాలో శక్తిని నింపాడు. నా ద్వారా ప్రకటనా పని పూర్తిగా జరగాలని, అన్నిదేశాల ప్రజలు దాన్ని వినాలని+ అలా చేశాడు; నేను సింహం నోటి నుండి కాపాడబడ్డాను.+
18 ప్రభువు, ప్రతీ చెడ్డపని నుండి నన్ను కాపాడి, తన పరలోక రాజ్యం కోసం నన్ను సురక్షితంగా ఉంచుతాడు.+ ఆయనకు యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్.
19 ప్రిస్కకు,* అకులకు,+ ఒనేసిఫోరు ఇంటివాళ్లకు+ నా శుభాకాంక్షలు చెప్పు.
20 ఎరస్తు+ కొరింథులో ఉండిపోయాడు. అయితే త్రోఫిము+ అనారోగ్యంగా ఉండడంతో నేను అతన్ని మిలేతులో వదిలేసి వచ్చాను.
21 చలికాలం మొదలవ్వకముందే ఇక్కడికి రావడానికి గట్టిగా ప్రయత్నించు.
యుబూలు, పుదే, లిను, క్లౌదియ, సహోదరులందరూ నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
22 ప్రభువు నువ్వు చూపించే స్ఫూర్తికి తోడుండాలి. ఆయన అపారదయ నీకు తోడుండాలి.
అధస్సూచీలు
^ లేదా “అత్యవసర భావంతో.”
^ లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
^ లేదా “సువార్తికుడిగా.”
^ లేదా “మంచివార్త ప్రకటిస్తూ ఉండు.”
^ అంటే, తోలు గ్రంథపు చుట్టల్ని.
^ అనుబంధం A5 చూడండి.
^ ప్రిస్కిల్ల అని కూడా పిలవబడింది.