రెండో థెస్సలొనీకయులు 1:1-12
1 మన తండ్రైన దేవునితో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,* తిమోతి+ రాస్తున్న ఉత్తరం.
2 తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.
3 సహోదరులారా, మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. అది సరైనదే, ఎందుకంటే మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతోంది, మీ అందరికీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ కూడా పెరుగుతోంది.+
4 అందుకే దేవుని సంఘాల్లో మేము మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాం;+ ఎందుకంటే ఎన్నో హింసలు, కష్టాలు* ఎదురైనా మీరు సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు.+
5 ఇది దేవుని నీతిగల తీర్పుకు రుజువు. దీనివల్ల మీరు దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడతారు. నిజానికి, మీరు బాధలు అనుభవిస్తున్నది కూడా దానికోసమే.+
6 దేవుడు నీతిగలవాడు కాబట్టి మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్లను ఆయన శ్రమలపాలు చేస్తాడు.+
7 అయితే ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. ఇది, యేసు ప్రభువు తన శక్తిమంతులైన దూతలతో పాటు పరలోకం నుండి+ మండుతున్న అగ్నిలో బయల్పర్చబడినప్పుడు+ జరుగుతుంది.
8 అప్పుడు ఆయన, దేవుడు తెలియనివాళ్ల మీదికి, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీదికి శిక్ష తీసుకొస్తాడు.*+
9 శాశ్వత నాశనమనే శిక్ష పడడం+ వల్ల వాళ్లు ప్రభువు ఎదుట నుండి, ఆయన మహిమాన్విత శక్తి నుండి వెళ్లగొట్టబడతారు.
10 ఇది ఆయన తన పవిత్రులతో పాటు మహిమపర్చబడడానికి వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ రోజు, ఆయన మీద విశ్వాసం చూపించిన వాళ్లంతా ఆయన్ని బట్టి ఆశ్చర్యపోతారు. మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి వాళ్లలో మీరు కూడా ఉంటారు.
11 అందుకే మేము ఎప్పుడూ మీ కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు దేనికోసమైతే మిమ్మల్ని పిలిచాడో దానికి ఆయన మిమ్మల్ని అర్హులుగా ఎంచాలనీ,+ ఆయన తన శక్తితో తనకు నచ్చిన మంచి అంతటినీ చేయాలనీ, విశ్వాసంతో మీరు చేసే ప్రతీ పనిని ఆయన సంపూర్ణం చేయాలనీ ప్రార్థిస్తున్నాం.
12 అలా మీ ద్వారా మన ప్రభువైన యేసు పేరు మహిమపర్చబడాలని, మీరు ఆయన వల్ల మహిమపర్చబడాలని మా ఉద్దేశం. మన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే అపారదయ వల్లే ఆ మహిమ కలుగుతుంది.