దినవృత్తాంతాలు రెండో గ్రంథం 13:1-22

  • అబీయా, యూదా రాజు (1-22)

    • అబీయా యరొబామును ఓడించడం (3-20)

13  యరొబాము రాజు పరిపాలనలోని 18వ సంవత్సరంలో, అబీయా యూదా మీద రాజయ్యాడు.+  అతను యెరూషలేములో మూడు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు మీకాయా,+ ఆమె గిబియాకు+ చెందిన ఊరియేలు కూతురు. ఒకసారి అబీయాకు, యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది.+  అబీయా, శిక్షణ పొందిన* 4,00,000 మంది బలమైన యోధులతో+ యుద్ధానికి వెళ్లాడు. యరొబాము కూడా శిక్షణ పొందిన* 8,00,000 మంది బలమైన యోధులతో అతని మీదికి వచ్చాడు.  అప్పుడు అబీయా ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని సెమరాయిము పర్వతం మీద నిలబడి ఇలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి.  ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఉప్పు ఒప్పందం*+ చేసి దావీదుకు, అతని కుమారులకు+ ఇశ్రాయేలు మీద రాజ్యాధికారాన్ని శాశ్వతంగా ఇచ్చాడని+ మీకు తెలీదా?  కానీ దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడూ, నెబాతు కుమారుడూ అయిన యరొబాము+ తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.+  పనీపాటాలేని కొంతమంది పనికిమాలినవాళ్లు అతని దగ్గరికి వచ్చారు. సొలొమోను కుమారుడైన రెహబాము యువకునిగా, అంత ధైర్యంలేనివాడిగా ఉన్నప్పుడు వాళ్లు అతని మీద పైచేయి సాధించారు. దాంతో అతను వాళ్లను ఎదిరించలేకపోయాడు.  “మీరు ఎక్కువమంది ఉన్నారు, యరొబాము మీకు దేవుళ్లుగా చేయించిన బంగారు దూడలు+ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దావీదు కుమారుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించగలమని మీరు అనుకుంటున్నారు.  అహరోను వంశస్థులైన యెహోవా యాజకుల్ని, లేవీయుల్ని మీరు వెళ్లగొట్టలేదా?+ ఇతర దేశాల ప్రజల్లాగే మీరు మీ సొంత యాజకుల్ని నియమించుకోలేదా?+ ఒక కోడెదూడను, ఏడు పొట్టేళ్లను తీసుకొచ్చే ప్రతీ వ్యక్తి దేవుళ్లుకాని విగ్రహాలకు యాజకుడు అవుతున్నాడు. 10  అయితే మా విషయానికొస్తే, యెహోవాయే మా దేవుడు,+ మేము ఆయన్ని విడిచిపెట్టలేదు; అహరోను వంశస్థులైన మా యాజకులు యెహోవాకు పరిచారం చేస్తున్నారు, లేవీయులు వాళ్లకు సహాయం చేస్తున్నారు. 11  వాళ్లు పరిమళ ధూపంతోపాటు+ ప్రతీరోజు ఉదయం, సాయంత్రం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తున్నారు;+ స్వచ్ఛమైన బంగారంతో చేసిన బల్లమీద సముఖపు రొట్టెలు*+ ఉన్నాయి; వాళ్లు ప్రతీరోజు సాయంత్రం బంగారు దీపస్తంభాన్ని,+ దాని దీపాల్ని వెలిగిస్తున్నారు.+ ఎందుకంటే మేము మా దేవుడైన యెహోవా పట్ల మాకున్న బాధ్యతను నెరవేరుస్తున్నాం; కానీ మీరు ఆయన్ని విడిచిపెట్టారు. 12  ఇదిగో! సత్యదేవుడు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు వ్యతిరేకంగా యుద్ధ ధ్వని చేయడానికి బాకాలు ఊదే ఆయన యాజకులు కూడా మాతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పోరాడకండి, మీరు విజయం సాధించరు.”+ 13  అయితే యరొబాము యూదావాళ్ల వెనక మనుషుల్ని మాటు వేయించాడు; అలా యూదావాళ్లకు ఎదురుగా అతని ప్రధాన సైన్యం, వెనక అతను మాటు వేయించినవాళ్లు ఉన్నారు. 14  యూదావాళ్లు వెనక్కి తిరిగినప్పుడు, ముందు నుండి, వెనక నుండి తమమీద దాడి జరుగుతోందని వాళ్లకు అర్థమైంది. దాంతో వాళ్లు యెహోవాకు మొరపెట్టారు;+ ఆ సమయంలో యాజకులు బాకాలు గట్టిగా ఊదుతున్నారు. 15  యూదావాళ్లు యుద్ధకేకలు వేశారు. వాళ్లు యుద్ధకేకలు వేసినప్పుడు, సత్యదేవుడు అబీయా ఎదుట, యూదా ఎదుట యరొబామును, ఇశ్రాయేలు ప్రజలందర్నీ ఓడించాడు. 16  ఇశ్రాయేలీయులు యూదావాళ్ల ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వాళ్లను యూదావాళ్ల చేతికి అప్పగించాడు. 17  అబీయా, అతని ప్రజలు వాళ్లను ఘోరంగా హతం చేశారు. ఇశ్రాయేలువాళ్లలో శిక్షణ పొందిన* 5,00,000 మంది సైనికులు చనిపోయారు. 18  అలా ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయి అవమానించబడ్డారు. యూదావాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్లు ఇశ్రాయేలు ప్రజల మీద పైచేయి సాధించారు.+ 19  అబీయా యరొబామును తరుముతూ అతని దగ్గర నుండి బేతేలు,+ యెషానా, ఎఫ్రోను+ అనే నగరాల్ని, వాటి చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకున్నాడు. 20  అబీయా కాలంలో యరొబాము మళ్లీ బలం పుంజుకోలేకపోయాడు; తర్వాత యెహోవా అతన్ని మొత్తడంతో అతను చనిపోయాడు.+ 21  కానీ అబీయా అంతకంతకూ బలపడ్డాడు. కొంతకాలానికి, అతను 14 మందిని పెళ్లి చేసుకున్నాడు,+ అతనికి 22 మంది కుమారులు, 16 మంది కూతుళ్లు పుట్టారు. 22  అబీయా మిగతా చరిత్ర, అంటే అతని పనులు, అతని మాటలు ఇద్దో ప్రవక్త పుస్తకంలో*+ రాయబడి ఉన్నాయి.

అధస్సూచీలు

అక్ష., “ఎంపిక చేయబడిన.”
అక్ష., “ఎంపిక చేయబడిన.”
అంటే, శాశ్వతమైన, మార్పులేని ఒప్పందం.
లేదా “సన్నిధి రొట్టెలు.”
అక్ష., “ఎంపిక చేయబడిన.”
లేదా “కథనంలో; వ్యాఖ్యానంలో.”