దినవృత్తాంతాలు రెండో గ్రంథం 14:1-15

  • అబీయా మరణం (1)

  • ఆసా, యూదా రాజు (2-8)

  • ఆసా 10,00,000 మంది ఇతియోపీయుల్ని ఓడించడం (9-15)

14  తర్వాత అబీయా చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో+ పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. అతని రోజుల్లో దేశం పది సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది.  ఆసా తన దేవుడైన యెహోవా దృష్టిలో మంచిది, సరైనది చేశాడు.  అతను అన్య దేవుళ్ల బలిపీఠాల్ని,+ ఉన్నత స్థలాల్ని తీయించాడు, పూజా స్తంభాల్ని పగలగొట్టించి,+ పూజా కర్రల్ని* నరికించాడు.+  అంతేకాదు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకమని, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని పాటించమని అతను యూదావాళ్లకు చెప్పాడు.  అతను యూదా నగరాలన్నిట్లో నుండి ఉన్నత స్థలాల్ని, ధూపస్తంభాల్ని తీయించాడు;+ అతని పరిపాలనలో రాజ్యంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.  యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వడంతో ఆ సంవత్సరాల్లో దేశం ప్రశాంతంగా ఉంది,+ అతని మీద ఏ యుద్ధం జరగలేదు. కాబట్టి అతను యూదాలో ప్రాకారాలుగల నగరాల్ని కట్టించాడు.+  ఆసా యూదావాళ్లతో ఇలా అన్నాడు: “మనం ఈ నగరాల్ని కట్టి, వాటిని ప్రాకారాలతో, బురుజులతో,+ ద్వారాలతో, అడ్డగడియలతో పటిష్ఠం చేద్దాం. దేశం ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం మన దేవుడైన యెహోవాను వెదికాం. మనం ఆయన్ని వెదికాం కాబట్టి ఆయన అన్నివైపుల నుండి మనకు విశ్రాంతినిచ్చాడు.” దాంతో వాళ్లు నిర్మాణ పనుల్ని పూర్తిచేయగలిగారు.+  ఆసా సైన్యంలో పెద్ద డాళ్లు, ఈటెలు ధరించిన 3,00,000 మంది యూదావాళ్లు ఉన్నారు. అలాగే బెన్యామీనుకు చెందిన 2,80,000 మంది బలమైన యోధులు ఉన్నారు; వాళ్ల దగ్గర చిన్న డాళ్లు,* విల్లులు ఉన్నాయి.+  తర్వాత ఇతియోపీయుడైన జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో యూదావాళ్ల మీదికి వచ్చాడు.+ అతను మారేషాకు+ చేరుకున్నప్పుడు, 10  ఆసా అతని మీదికి వెళ్లాడు; వాళ్లు మారేషా దగ్గర ఉన్న జెపాతా లోయలో యుద్ధ పంక్తులు తీరారు. 11  అప్పుడు ఆసా తన దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థించాడు:+ “యెహోవా, నువ్వు సహాయం చేసేవాళ్లు బలవంతులా,* బలహీనులా అనేది నీకు లెక్క కాదు.+ మా దేవా, యెహోవా, మేము నీ మీద ఆధారపడుతున్నాం,+ మాకు సహాయం చేయి, మేము నీ పేరున ఈ సమూహం మీదికి వచ్చాం.+ యెహోవా, నువ్వు మా దేవుడివి. మామూలు మనిషిని నీ మీద గెలవనివ్వకు.”+ 12  కాబట్టి యెహోవా ఆసా ఎదుట, యూదా ఎదుట ఇతియోపీయుల్ని ఓడించాడు, వాళ్లు పారిపోయారు.+ 13  ఆసా, అతనితో ఉన్న ప్రజలు గెరారు+ వరకు వాళ్లను తరిమారు; ఇతియోపీయుల్లో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. వాళ్లు యెహోవా చేతిలో, ఆయన సైన్యం చేతిలో పూర్తిగా నాశనమయ్యారు. తర్వాత యూదావాళ్లు పెద్ద ఎత్తున దోపుడుసొమ్మును తీసుకెళ్లారు. 14  అంతేకాదు, యెహోవా భయం గెరారు చుట్టూ ఉన్న నగరాలన్నిటినీ ఆవరించడంతో వాళ్లు వాటిని నాశనం చేశారు; ఆ నగరాలన్నిట్లో చాలా వస్తువులు ఉండడంతో వాటన్నిటినీ దోచుకున్నారు. 15  అంతేకాదు, పశువుల్ని కాసేవాళ్ల డేరాల మీద కూడా దాడిచేసి పెద్ద ఎత్తున గొర్రెల్ని, ఒంటెల్ని పట్టుకున్నారు. తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చారు.

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
పదకోశం చూడండి.
లేదా “కేడెములు.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
అక్ష., “ఎక్కువమందా.”