దినవృత్తాంతాలు రెండో గ్రంథం 17:1-19

  • యెహోషాపాతు, యూదా రాజు (1-6)

  • నగరాలకు వెళ్లి బోధించడం (7-9)

  • యెహోషాపాతు సైనిక బలం (10-19)

17  ఆసా స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు+ రాజయ్యాడు; అతను ఇశ్రాయేలులో తన రాజరికాన్ని బలపర్చుకున్నాడు.  అతను యూదాలోని ప్రాకారాలుగల నగరాలన్నిట్లో సైనిక దళాల్ని ఉంచాడు; అతను యూదా దేశంలో, తన తండ్రి ఆసా స్వాధీనం చేసుకున్న ఎఫ్రాయిము నగరాల్లో+ సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు.  యెహోషాపాతు తన పూర్వీకుడైన దావీదు నడిచిన మార్గంలో నడిచాడు,+ అతను బయలు దేవుళ్లను సేవించలేదు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉంటూ వచ్చాడు.  అతను తన తండ్రి సేవించిన దేవుణ్ణి వెదికి+ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడే గానీ, ఇశ్రాయేలు పద్ధతుల ప్రకారం నడుచుకోలేదు.+  యెహోవా అతని రాజరికాన్ని స్థిరపర్చాడు;+ యూదావాళ్లందరూ యెహోషాపాతుకు కానుకలు ఇస్తూ ఉన్నారు; అతనికి ఎంతో ఐశ్వర్యం, ఘనత కలిగాయి.+  అతను యెహోవా మార్గాల్ని అనుసరించడానికి ధైర్యం తెచ్చుకొని, యూదాలోని ఉన్నత స్థలాల్ని,+ పూజా కర్రల్ని* కూడా తీయించాడు.+  యెహోషాపాతు తన పరిపాలనలోని మూడో సంవత్సరంలో తన అధిపతులైన బెన్హయీలును, ఓబద్యాను, జెకర్యాను, నెతనేలును, మీకాయాను పిలిపించి యూదా నగరాల్లో బోధించడానికి వాళ్లను పంపించాడు.  వాళ్లతోపాటు లేవీయులైన షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా, అలాగే యాజకులైన+ ఎలీషామా, యెహోరాము ఉన్నారు.  వాళ్లు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తమతోపాటు తీసుకెళ్లి యూదాలో బోధించడం మొదలుపెట్టారు,+ వాళ్లు యూదా నగరాలన్నిట్లో సంచరిస్తూ ప్రజలకు బోధించారు. 10  యూదా చుట్టుపక్కల రాజ్యాలన్నిట్లో యెహోవా భయం ఆవరించింది, కాబట్టి వాళ్లు యెహోషాపాతుతో యుద్ధం చేయలేదు. 11  ఫిలిష్తీయులు యెహోషాపాతు దగ్గరికి కానుకల్ని, డబ్బును కప్పంగా తీసుకొచ్చారు. అరబీయులు తమ మందల్లో నుండి 7,700 పొట్టేళ్లను, 7,700 మేకపోతుల్ని అతని దగ్గరికి తీసుకొచ్చారు. 12  యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడౌతూ ఉన్నాడు;+ అతను యూదాలో ప్రాకారాలుగల స్థలాల్ని,+ గోదాముల నగరాల్ని+ కడుతూ వచ్చాడు. 13  అతను యూదా నగరాల్లో పెద్దపెద్ద పనులు చేయించాడు. అతను యెరూషలేములో సైనికుల్ని, బలమైన యోధుల్ని ఉంచాడు. 14  తమ కుటుంబాల ప్రకారం వాళ్ల వివరాలు ఇవి: యూదా గోత్రంలోని సహస్రాధిపతుల్లో* అద్నా అనే అధిపతి, అతనితోపాటు ఉన్న 3,00,000 మంది బలమైన యోధులు.+ 15  అతని కింద, అధిపతైన యెహోహానాను, అతనితోపాటు ఉన్న 2,80,000 మంది. 16  అద్నా కింద జిఖ్రీ కుమారుడైన అమస్యా కూడా ఉన్నాడు; అతను యెహోవా సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. అతనితోపాటు 2,00,000 మంది బలమైన యోధులు ఉన్నారు. 17  బెన్యామీను+ గోత్రంలో నుండి ఎల్యాదా అనే బలమైన యోధుడు, అతనితోపాటు విల్లు, డాలు ధరించిన 2,00,000 మంది.+ 18  అతని కింద యెహోజాబాదు, అతనితోపాటు సైన్యంలో సేవచేయగల 1,80,000 మంది. 19  యూదా అంతటా ఉన్న ప్రాకారాలుగల నగరాల్లో+ రాజు నియమించిన కొంతమందితో పాటు ఈ అధిపతులు కూడా రాజుకు సేవ చేశారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అంటే, 1,000 మంది మీద అధిపతులు.