దినవృత్తాంతాలు రెండో గ్రంథం 20:1-37

  • ఇరుగుపొరుగు దేశాలు యూదా మీద దండెత్తడం (1-4)

  • యెహోషాపాతు సహాయం కోసం ప్రార్థించడం (5-13)

  • యెహోవా జవాబివ్వడం (14-19)

  • యూదాను అద్భుతంగా కాపాడడం (20-30)

  • యెహోషాపాతు పరిపాలన ముగింపు (31-37)

20  తర్వాత మోయాబీయులు,+ అమ్మోనీయులు కొంతమంది అమ్మోనీమువాళ్లతో* కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు.  అప్పుడు యెహోషాపాతుకు ఈ వార్త అందింది: “సముద్ర* ప్రాంతం నుండి, ఎదోము+ నుండి ఒక పెద్ద సమూహం నీ మీదికి వచ్చింది; వాళ్లు హససోన్‌-తామారులో, అంటే ఏన్గెదీలో ఉన్నారు.”  అది విని యెహోషాపాతు భయపడి యెహోవాను వెదకాలని నిశ్చయించుకున్నాడు.+ కాబట్టి ఉపవాసం ఉండమని యూదా అంతటా చాటించాడు.  అప్పుడు యూదా ప్రజలు యెహోవా దగ్గర విచారణ చేయడానికి సమకూడారు;+ యెహోవా నిర్దేశం అడగడానికి వాళ్లు యూదా నగరాలన్నిటి నుండి వచ్చారు.  అప్పుడు యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ప్రాంగణం ఎదుట యూదా, యెరూషలేము సమాజం మధ్యలో నిలబడి,  ఇలా ప్రార్థించాడు: “మా పూర్వీకుల దేవా, యెహోవా, నువ్వు మాత్రమే పరలోకంలో దేవుడివి.+ నీకు దేశాల రాజ్యాలన్నిటి మీద ఆధిపత్యం ఉంది.+ నీ చేతిలో శక్తి, బలం ఉన్నాయి, నీకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిలబడలేరు.+  మా దేవా, నువ్వు నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశ నివాసుల్ని వెళ్లగొట్టి, నీ స్నేహితుడైన అబ్రాహాము+ సంతానానికి* దాన్ని శాశ్వత ఆస్తిగా ఇచ్చావు.  వాళ్లు దానిలో స్థిరపడి నీ పేరు కోసం అక్కడ ఒక పవిత్రమైన స్థలాన్ని కట్టారు,+ వాళ్లు ఇలా అన్నారు,  ‘కత్తి వల్లో, శిక్ష వల్లో, తెగులు వల్లో, కరువు వల్లో మా మీదికి విపత్తు వస్తే, మేము ఈ మందిరం ఎదుట, నీ ఎదుట నిలబడి (ఎందుకంటే, నువ్వు నీ పేరు కోసం ఈ మందిరాన్ని ఎంచుకున్నావు) కష్టాల్లో మాకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు, నువ్వు మా ప్రార్థన విని మమ్మల్ని రక్షించాలి.’+ 10  ఇదిగో అమ్మోను, మోయాబు, శేయీరు పర్వత ప్రాంతం వాళ్లు+ ఏమి చేస్తున్నారో చూడు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేటప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుల్ని వాళ్ల మీద దండెత్తనివ్వలేదు. ఇశ్రాయేలీయులు వాళ్లను పూర్తిగా నాశనం చేయకుండా వాళ్ల దగ్గర నుండి వెళ్లిపోయారు.+ 11  ఇప్పుడు వాళ్లు మాకు ఇలా ప్రతిఫలం ఇస్తున్నారు, నువ్వు మాకు వారసత్వంగా ఇచ్చిన నీ దేశం నుండి మమ్మల్ని వెళ్లగొట్టడానికి వస్తున్నారు.+ 12  మా దేవా, నువ్వు వాళ్లను శిక్షించవా?+ మా మీదికి వస్తున్న ఈ పెద్ద సమూహాన్ని ఎదిరించడానికి మా శక్తి చాలదు; ఏమి చేయాలో మాకు తెలియట్లేదు,+ మా కళ్లు నీ వైపే చూస్తున్నాయి.”+ 13  ఆ సమయంలో, యూదావాళ్లందరూ తమ భార్యలతో, పిల్లలతో,* పసి పిల్లలతో యెహోవా ఎదుట నిలబడివున్నారు. 14  అప్పుడు యెహోవా పవిత్రశక్తి సమాజం మధ్యలో ఉన్న యహజీయేలు మీదికి వచ్చింది; యహజీయేలు జెకర్యా కుమారుడు, జెకర్యా బెనాయా కుమారుడు, బెనాయా యెహీయేలు కుమారుడు, యెహీయేలు లేవీయుడైన మత్తన్యా కుమారుడు, మత్తన్యా ఆసాపు వంశస్థుడు. 15  అతను ఇలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ జాగ్రత్తగా వినండి! యెహోవా చెప్తున్నదేమిటంటే, ‘ఈ పెద్ద సమూహాన్ని చూసి మీరు భయపడకండి, బెదిరిపోకండి; ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది.+ 16  రేపు వాళ్ల మీదికి వెళ్లండి. వాళ్లు జీజు కనుమ దారిలో వస్తారు; మీరు వాళ్లను యెరూవేలు ఎడారి ఎదుట ఉన్న లోయ* చివర్లో చూస్తారు. 17  ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. మీరు మీ స్థానాల్లో స్థిరంగా నిలబడి,+ యెహోవా ఇచ్చే రక్షణను చూడండి.*+ యూదా, యెరూషలేమా, భయపడకండి, బెదిరిపోకండి.+ రేపు వాళ్ల మీదికి వెళ్లండి, యెహోవా మీకు తోడుగా ఉంటాడు.’ ”+ 18  వెంటనే యెహోషాపాతు నేలమీద సాష్టాంగపడ్డాడు; యూదావాళ్లందరూ, యెరూషలేము నివాసులందరూ యెహోవా ఎదుట సాష్టాంగపడి, యెహోవాను ఆరాధించారు. 19  అప్పుడు కహాతు,+ కోరహు వంశస్థులైన లేవీయులు లేచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.+ 20  వాళ్లు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి తెకోవ+ ఎడారికి వెళ్లారు. వాళ్లు వెళ్తుండగా, యెహోషాపాతు లేచి నిలబడి ఇలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, నేను చెప్పేది వినండి! మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడగలుగుతారు.* ఆయన ప్రవక్తల మీద విశ్వాసముంచండి,+ అప్పుడు మీరు విజయం సాధిస్తారు.” 21  యెహోషాపాతు ప్రజల్ని సంప్రదించిన తర్వాత, యెహోవాకు పాటలు పాడడానికి, పవిత్రమైన బట్టలు ధరించి స్తుతించడానికి మనుషుల్ని నియమించాడు.+ వాళ్లు సైనికుల ముందు నడుస్తూ, “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఎందుకంటే ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది”+ అని పాడాలి. 22  వాళ్లు ఆనందంగా స్తుతులు పాడడం మొదలుపెట్టినప్పుడు, యెహోవా యూదా మీద దండెత్తిన అమ్మోను, మోయాబు, శేయీరు పర్వత ప్రాంతంవాళ్ల మీద మాటు వేయించాడు. దాంతో వాళ్లు ఒకరినొకరు చంపుకున్నారు.+ 23  అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు పర్వత+ ప్రాంతంవాళ్ల మీద దాడిచేసి, వాళ్లను నిర్మూలించారు; వాళ్లు శేయీరు నివాసుల్ని నాశనం చేసిన తర్వాత, ఒకరినొకరు చంపుకున్నారు.+ 24  యూదావాళ్లు ఎడారిలోని+ కావలిబురుజు దగ్గరికి వచ్చి ఆ సమూహం వైపు చూసినప్పుడు, వాళ్లకు అక్కడ నేలమీద పడివున్న వాళ్ల శవాలు కనిపించాయి;+ వాళ్లలో ఎవ్వరూ మిగల్లేదు. 25  దాంతో యెహోషాపాతు, అతని ప్రజలు వాళ్ల దగ్గర నుండి దోపుడుసొమ్ము తీసుకోవడానికి వచ్చారు. అక్కడ వాళ్లకు విస్తారంగా వస్తువులు, బట్టలు, అమూల్యమైన వస్తువులు కనిపించాయి. వాళ్లు ఆ శవాల మీద నుండి వాటిని తీసుకున్నారు. వాళ్లు ఇక మోయలేనంత వరకు వాటిని తీసుకున్నారు.+ ఆ దోపుడుసొమ్ము చాలా ఉండడంతో వాటిని తీసుకెళ్లడానికి మూడు రోజులు పట్టింది. 26  నాలుగో రోజున వాళ్లు బెరాకా లోయ దగ్గర సమావేశమై యెహోవాను స్తుతించారు.* అందుకే ఆ స్థలానికి వాళ్లు బెరాకా* లోయ అని పేరు పెట్టారు.+ ఈ రోజు వరకు దానికి ఆ పేరే ఉంది. 27  తర్వాత, యెహోవా తమ శత్రువుల మీద తమకు విజయాన్ని ఇచ్చినందుకు యూదా, యెరూషలేము మనుషులందరూ సంతోషంగా+ యెరూషలేముకు తిరిగొచ్చారు; యెహోషాపాతు వాళ్ల ముందు నడిచాడు. 28  వాళ్లు తంతివాద్యాలు, వీణలు,*+ బాకాలు+ వాయిస్తూ యెరూషలేముకు వచ్చి, యెహోవా మందిరానికి+ వెళ్లారు. 29  యెహోవా ఇశ్రాయేలు శత్రువులతో పోరాడాడని అన్ని రాజ్యాల వాళ్లు విన్నప్పుడు దేవుని భయం వాళ్లను ఆవరించింది.+ 30  అలా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది, అతని దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చాడు.+ 31  యెహోషాపాతు యూదాను పరిపాలిస్తూ ఉన్నాడు. రాజైనప్పుడు అతని వయసు 35 ఏళ్లు, అతను యెరూషలేములో 25 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు.+ 32  యెహోషాపాతు తన తండ్రి ఆసా మార్గంలోనే+ నడుస్తూ వచ్చాడు, అతను దాని నుండి పక్కకు మళ్లలేదు; అతను యెహోవా దృష్టికి సరైనది చేశాడు.+ 33  అయితే, ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు,+ ప్రజలు తమ పూర్వీకుల దేవుడి కోసం తమ హృదయాల్ని ఇంకా సిద్ధం చేసుకోలేదు.+ 34  యెహోషాపాతు మిగతా చరిత్ర మొదటి నుండి చివరి వరకు, హనానీ+ కుమారుడైన యెహూ+ రాసిన పుస్తకంలో ఉంది. ఆ విషయాలు ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో చేర్చబడ్డాయి. 35  తర్వాత యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో చేతులు కలిపాడు, ఈ అహజ్యా చాలా చెడ్డగా ప్రవర్తించాడు.+ 36  తర్షీషుకు వెళ్లే నౌకల్ని+ నిర్మించడానికి యెహోషాపాతు అతనితో చేతులు కలిపాడు, వాళ్లు ఎసోన్గెబెరులో+ నౌకల్ని నిర్మించారు. 37  అయితే మారేషాకు చెందిన దోదావాహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచిస్తూ, “నువ్వు అహజ్యాతో చేతులు కలిపావు కాబట్టి, యెహోవా నీ పనిని నాశనం చేస్తాడు”+ అని చెప్పాడు. కాబట్టి ఆ నౌకలు బద్దలైపోయాయి,+ అవి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.

అధస్సూచీలు

లేదా “మెయోనీయులతో” అయ్యుంటుంది.
మృత సముద్రం అని స్పష్టమౌతోంది.
అక్ష., “విత్తనానికి.”
అక్ష., “కుమారులతో.”
లేదా “వాగు.”
లేదా “యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి.”
లేదా “సహించగలుగుతారు.”
అక్ష., “దీవించారు.”
“దీవెన” అని అర్థం.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.