దినవృత్తాంతాలు రెండో గ్రంథం 27:1-9

  • యోతాము, యూదా రాజు (1-9)

27  యోతాము+ రాజైనప్పుడు అతని వయసు 25 ఏళ్లు; అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి సాదోకు కూతురైన యెరూషా.  అతను తన తండ్రి ఉజ్జియాలాగే యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు,+ కానీ తన తండ్రిలా యెహోవా ఆలయంలో చొరబడలేదు.+ అయితే ప్రజలు మాత్రం చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నారు.  అతను యెహోవా మందిర పైద్వారాన్ని కట్టించాడు;+ అతను ఓపెలు+ గోడ మీద చాలా నిర్మాణపని చేయించాడు.  అంతేకాదు, అతను యూదా పర్వత ప్రాంతంలో+ నగరాల్ని,+ అడవి ప్రాంతాల్లో కోటల్ని,+ బురుజుల్ని+ కట్టించాడు.  అతను అమ్మోనీయుల+ రాజు మీద యుద్ధం చేసి చివరికి వాళ్లను ఓడించాడు. దాంతో అమ్మోనీయులు ఆ సంవత్సరంలో అతనికి 100 తలాంతుల* వెండిని, 10,000 కొర్‌ కొలతల* గోధుమల్ని, 10,000 కొర్‌ కొలతల బార్లీని చెల్లించారు. అమ్మోనీయులు రెండో సంవత్సరంలో, మూడో సంవత్సరంలో కూడా అదేవిధంగా చెల్లించారు.+  యోతాము తన దేవుడైన యెహోవా మార్గాల్లో నడవాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి అతను రోజురోజుకీ బలవంతుడౌతూ ఉన్నాడు.  యోతాము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన యుద్ధాలన్నిటి గురించి, అతని మార్గాల గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో రాయబడివుంది.+  రాజైనప్పుడు అతని వయసు 25 ఏళ్లు; అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు.+  తర్వాత యోతాము చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో+ పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆహాజు రాజయ్యాడు.+

అధస్సూచీలు

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”