దినవృత్తాంతాలు రెండో గ్రంథం 32:1-33

  • సన్హెరీబు యెరూషలేము మీద దండెత్తడం (1-8)

  • సన్హెరీబు యెహోవాను దూషించడం (9-19)

  • దేవదూత అష్షూరు సైన్యాన్ని చంపడం (20-23)

  • హిజ్కియా అనారోగ్యం, గర్వం (24-26)

  • హిజ్కియా సాధించినవి, మరణం (27-33)

32  హిజ్కియా నమ్మకంగా ఈ పనులన్నిటినీ+ చేసిన తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా మీద దండెత్తాడు. అతను ప్రాకారాలున్న నగరాల్లోకి చొరబడి, వాటిని స్వాధీనం చేసుకోవాలని ముట్టడించాడు.+  యెరూషలేము మీద యుద్ధం చేయడానికి సన్హెరీబు వచ్చాడని హిజ్కియా చూసినప్పుడు  అతను తన అధిపతులతో, తన యోధులతో మాట్లాడి, నగరం బయట ఉన్న నీటి ఊటల్ని+ నిలిపేయాలని నిర్ణయించాడు; వాళ్లు అతనికి మద్దతు ఇచ్చారు.  చాలామంది ప్రజలు సమకూడి ఆ ప్రాంతంలో ప్రవహించే ఊటలన్నిటినీ, నీటి ప్రవాహాన్ని నిలిపేశారు; “అష్షూరు రాజులు వచ్చినప్పుడు వాళ్లకు పుష్కలంగా నీళ్లు దొరకకూడదు” అని వాళ్లు అనుకున్నారు.  అంతేకాదు హిజ్కియా దృఢ నిశ్చయంతో, పడిపోయిన ప్రాకారమంతటినీ మళ్లీ కట్టించి, దానిమీద బురుజులు నిర్మించాడు; అతను బయట మరో ప్రాకారాన్ని కట్టించాడు. అతను దావీదు నగరపు మిల్లోను*+ కూడా బాగుచేయించాడు, అలాగే పెద్ద ఎత్తున ఆయుధాల్ని,* డాళ్లను చేయించాడు.  తర్వాత హిజ్కియా ప్రజలమీద సైన్యాధిపతుల్ని నియమించి, వాళ్లను నగర ద్వారం దగ్గర ఉన్న వీధిలో సమావేశపర్చి ఇలా ప్రోత్సహించాడు:  “ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి; అష్షూరు రాజును, అతనితో ఉన్న సమూహాన్నంతటినీ చూసి భయపడకండి, బెదిరిపోకండి.+ ఎందుకంటే అతనితో ఉన్నవాళ్ల కన్నా మనతో ఉన్నవాళ్లే ఎక్కువ.+  అతను మనుషుల బలం మీద ఆధారపడుతున్నాడు, కానీ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాల్లో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు.”+ యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు విని ప్రజలు బలం పొందారు.+  ఆ తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో* లాకీషు+ దగ్గర ఉన్నప్పుడు, తన సేవకుల్ని యెరూషలేముకు పంపించాడు. అతను యూదా రాజైన హిజ్కియాకు, యెరూషలేములోని యూదా వాళ్లందరికి+ ఈ సందేశం పంపించాడు: 10  “అష్షూరు రాజైన సన్హెరీబు చెప్తున్నదేమిటంటే, ‘యెరూషలేము ముట్టడి వేయబడుతుంటే, మీరు దేనిమీద నమ్మకం పెట్టుకొని అందులోనే ఉన్నారు?+ 11  “మన దేవుడైన యెహోవా మనల్ని అష్షూరు రాజు చేతిలో నుండి రక్షిస్తాడు” అని అంటూ మీరు కరువుతో, దాహంతో చనిపోయేలా హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు.+ 12  మీ దేవుని ఉన్నత స్థలాల్ని,+ బలిపీఠాల్ని+ తీసేసి, “మీరు ఒక్క బలిపీఠం ఎదుటే వంగి నమస్కరించాలి, దానిమీదే మీ బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయాలి” అని యూదావాళ్లకు, యెరూషలేమువాళ్లకు చెప్పింది ఈ హిజ్కియానే కదా?+ 13  నేనూ, నా పూర్వీకులూ వేరే దేశాల ప్రజలందరికీ ఏమి చేశామో మీకు తెలీదా?+ వేరే దేశాల ప్రజల దేవుళ్లు నా చేతిలో నుండి తమ దేశాన్ని రక్షించుకోగలిగారా?+ 14  మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి రక్షిస్తాడని అనుకోవడానికి, నా పూర్వీకులు నాశనం చేసిన ఈ దేశాలవాళ్ల దేవుళ్లందరిలో ఎవరైనా తమ ప్రజల్ని నా చేతిలో నుండి రక్షించగలిగారా?+ 15  హిజ్కియా చేతిలో మోసపోకండి, తప్పుదారి పట్టకండి!+ అతని మీద నమ్మకం పెట్టుకోకండి, ఏ దేశాల దేవుళ్లు గానీ రాజ్యాల దేవుళ్లు గానీ నా చేతిలో నుండి, నా పూర్వీకుల చేతిలో నుండి తమ ప్రజల్ని రక్షించలేకపోయారు. కాబట్టి, మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి ఏ మాత్రం రక్షించలేడు!’ ”+ 16  సన్హెరీబు సేవకులు సత్యదేవుడైన యెహోవాను, ఆయన సేవకుడైన హిజ్కియాను ఇంకా ఎగతాళి చేస్తూ మాట్లాడారు. 17  ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అవమానించడానికి,+ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్హెరీబు ఇలా ఉత్తరాలు కూడా రాశాడు:+ “వేరే దేశాల దేవుళ్లు తమ ప్రజల్ని నా చేతిలో నుండి రక్షించలేకపోయినట్టే,+ హిజ్కియా దేవుడు కూడా తన ప్రజల్ని నా చేతిలో నుండి రక్షించలేడు.” 18  వాళ్లు ప్రాకారం మీద ఉన్న యెరూషలేము ప్రజల్ని భయపెట్టి, బెదిరిపోయేలా చేసి నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ప్రజలతో బిగ్గరగా యూదుల భాషలో మాట్లాడుతూ వచ్చారు.+ 19  వాళ్లు భూమ్మీది ప్రజల దేవుళ్లకు అంటే మనుషులు చేతితో చేసిన దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే, యెరూషలేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. 20  అయితే హిజ్కియా రాజు, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త+ దీని గురించి ప్రార్థిస్తూ, సహాయం కోసం పరలోకంలో ఉన్న దేవునికి మొరపెడుతూ ఉన్నారు.+ 21  అప్పుడు యెహోవా ఒక దేవదూతను పంపించి అష్షూరు రాజు శిబిరంలో ఉన్న ప్రతీ బలమైన యోధుణ్ణి, నాయకుణ్ణి, అధిపతిని చంపేశాడు.+ దాంతో అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. తర్వాత అతను తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు అతని కుమారుల్లో కొంతమంది అతన్ని కత్తితో చంపారు.+ 22  అలా యెహోవా హిజ్కియాను, యెరూషలేము నివాసుల్ని అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, మిగతావాళ్లందరి చేతిలో నుండి రక్షించి అన్నివైపుల నుండి వాళ్లకు విశ్రాంతినిచ్చాడు. 23  చాలామంది యెరూషలేములో యెహోవాకు కానుకల్ని, యూదా రాజైన హిజ్కియాకు శ్రేష్ఠమైన వస్తువుల్ని తీసుకొచ్చారు.+ ఆ తర్వాత అన్ని దేశాలవాళ్లు హిజ్కియాను ఎంతో గౌరవించారు. 24  ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతను యెహోవాకు ప్రార్థన చేశాడు.+ ఆయన హిజ్కియాకు జవాబిచ్చి, ఒక సూచన* ఇచ్చాడు.+ 25  కానీ హిజ్కియా తనకు జరిగిన మేలు విషయంలో కృతజ్ఞత చూపించలేదు; ఎందుకంటే అతని హృదయం గర్వించింది; దానివల్ల అతని మీదికి, యూదా, యెరూషలేము మీదికి దేవుని కోపం వచ్చింది. 26  అయితే, హిజ్కియా తన హృదయ గర్వాన్ని తీసేసుకున్నాడు,+ యెరూషలేము నివాసులు కూడా తమను తాము తగ్గించుకున్నారు. దాంతో హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం వాళ్ల మీదికి రాలేదు.+ 27  హిజ్కియాకు విస్తారంగా సిరిసంపదలు, ఘనత కలిగాయి.+ అతను వెండిని, బంగారాన్ని, అమూల్యమైన రాళ్లను, సాంబ్రాణి తైలాన్ని, డాళ్లను, మంచి వస్తువులన్నిటినీ ఉంచడానికి గోదాములు కట్టించుకున్నాడు.+ 28  అతను ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె కోసం నిల్వచేసే స్థలాల్ని, అలాగే రకరకాల పశువులన్నిటి కోసం, మందల కోసం శాలల్ని కట్టించాడు. 29  అతను నగరాల్ని, అలాగే విస్తారంగా జంతువుల్ని, మందల్ని, పశువుల్ని కూడా సంపాదించుకున్నాడు. దేవుడు అతనికి విస్తారంగా సంపదలు ఇచ్చాడు. 30  గీహోను+ ఎగువ కాలువకు అడ్డుకట్ట కట్టించి,+ ఆ నీళ్లను నేరుగా పడమటి వైపుగా దావీదు నగరానికి+ మళ్లించింది హిజ్కియానే. హిజ్కియా తాను చేసిన ప్రతీ పనిలో విజయం సాధించాడు. 31  అయితే, దేశంలో జరిగిన సూచన*+ గురించి అడగడానికి బబులోను అధిపతులు తమ ప్రతినిధుల్ని అతని దగ్గరికి పంపించినప్పుడు,+ సత్యదేవుడు అతన్ని పరీక్షించి,+ అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవడానికి+ అతన్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. 32  హిజ్కియా మిగతా చరిత్ర గురించి, అతను విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల+ గురించి ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త దర్శన గ్రంథంలో,+ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడివుంది. 33  తర్వాత హిజ్కియా చనిపోయాడు,* అతన్ని దావీదు వంశస్థుల సమాధులున్న స్థలాలకు ఎక్కివెళ్లే దారిలో పాతిపెట్టారు;+ అతను మరణించినప్పుడు యూదా వాళ్లందరు, యెరూషలేము నివాసులు అతన్ని ఘనపర్చారు. అతని స్థానంలో అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.

అధస్సూచీలు

ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బను.”
లేదా “విసిరే ఆయుధాల్ని.”
లేదా “తన మొత్తం సైనిక బలంతో, వైభవంతో.”
లేదా “గుర్తు.”
లేదా “గుర్తు.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”