రెండో పేతురు 3:1-18
3 ప్రియ సహోదరులారా, నా మొదటి ఉత్తరంలోలాగే నేను రాస్తున్న ఈ రెండో ఉత్తరంలో కూడా మీకు కొన్ని విషయాలు గుర్తుచేసి, స్పష్టంగా ఆలోచించే మీ సామర్థ్యాల్ని పురికొల్పుతున్నాను.+
2 పవిత్ర ప్రవక్తలు ముందే చెప్పిన విషయాల్ని, రక్షకుడైన ప్రభువు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు గుర్తుంచుకోవాలన్నదే నా ఉద్దేశం.
3 ముందుగా ఈ విషయం తెలుసుకోండి. చివరి రోజుల్లో ఎగతాళి చేసేవాళ్లు వస్తారు, మంచి విషయాల్ని ఎగతాళి చేస్తారు. వాళ్లు తమ సొంత కోరికల్ని అనుసరిస్తూ+
4 ఇలా అంటారు: “ఆయన ప్రత్యక్షత గురించిన వాగ్దానం ఏమైంది?+ మా పూర్వీకులు చనిపోయిన* రోజు నుండి ఇప్పటివరకు ఏదీ మారలేదు. అన్నీ సృష్టి ఆరంభం నుండి ఉన్నట్టే ఉన్నాయి.”+
5 వాళ్లు కావాలనే ఈ వాస్తవాన్ని పట్టించుకోరు. ఎంతోకాలం క్రితం ఆకాశం ఉండేదని, దేవుని నోటిమాటతో భూమి నీళ్లలో నుండి వేరు చేయబడిందని, అది నీళ్ల మధ్యలో ఉండేదని,+
6 జలప్రళయం వచ్చినప్పుడు ఆ నీళ్ల వల్లే అప్పటి లోకం నాశనమైందని వాళ్లు పట్టించుకోరు.+
7 అయితే ఇప్పుడున్న ఆకాశం, భూమి అదే మాట వల్ల అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి; భక్తిహీనులు నాశనమయ్యే తీర్పు రోజు వరకు అవి అలా ఉంచబడుతున్నాయి.+
8 అయితే ప్రియ సహోదరులారా, ఈ విషయం మర్చిపోకండి. యెహోవాకు* ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలతో సమానం, అలాగే వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం.+
9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు+ కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.+
10 అయితే, యెహోవా* రోజు+ దొంగలా వస్తుంది.+ అప్పుడు ఆకాశం గర్జన శబ్దంతో వేగంగా గతించిపోతుంది;+ ఆకాశంలోనివి, భూమిలోనివి తీవ్రమైన వేడి వల్ల కరిగిపోతాయి; భూమి, దానిమీద జరిగే పనులు బట్టబయలౌతాయి.+
11 ఇవన్నీ ఇలా నాశనమైపోతాయి కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించండి. మీరు పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు చేస్తూ ఉండాలి.
12 అలాగే యెహోవా* రోజు కోసం* ఎదురుచూస్తూ,* దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకుని జీవించాలి.+ ఆ సమయంలో ఆకాశం మంటల్లో కాలిపోతుంది;+ ఆకాశంలోనివి, భూమిలోనివి తీవ్రమైన వేడికి కరిగిపోతాయి.
13 అయితే మనం, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం;+ వాటిలో ఎప్పుడూ నీతి ఉంటుంది.*+
14 ప్రియ సహోదరులారా, మీరు వీటికోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి చివరికి ఆయన దృష్టిలో మచ్చ గానీ కళంకం గానీ లేనివాళ్లుగా, శాంతిని కాపాడుకున్న వాళ్లుగా ఉండడానికి చేయగలిగినదంతా చేయండి.+
15 అంతేకాదు, మన ప్రభువు చూపించే ఓర్పు మీ రక్షణ కోసమేనని గ్రహించండి. మన ప్రియ సహోదరుడు పౌలు కూడా, దేవుడు తనకు అనుగ్రహించిన తెలివి ప్రకారం దాని గురించే మీకు రాశాడు.+
16 నిజానికి, అతను ఈ విషయాల గురించి తన ఉత్తరాలన్నిట్లో మాట్లాడాడు. అయితే వాటిలో ఉన్న కొన్ని విషయాలు అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్లు, నిలకడ లేనివాళ్లు మిగతా లేఖనాల్ని వక్రీకరించినట్టే ఆ విషయాల్ని కూడా వక్రీకరిస్తున్నారు, అలా తమ నాశనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
17 ప్రియ సహోదరులారా, మీకు ఈ విషయాలు ముందే తెలుసు కాబట్టి మీరు అక్రమంగా నడుచుకునేవాళ్ల మోసం వల్ల తప్పుదోవ పట్టకుండా, మీ స్థిరత్వం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి.+
18 మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు అపారదయ విషయంలో, జ్ఞానం విషయంలో ఎదుగుతూ ఉండండి. ఆయనకు ఇప్పుడూ, ఎల్లప్పుడూ మహిమ కలగాలి. ఆమేన్.
అధస్సూచీలు
^ అక్ష., “మరణంలో నిద్రించిన.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “రోజు ప్రత్యక్షత కోసం.”
^ లేదా “బాగా కోరుకుంటూ.” అక్ష., “త్వరపెడుతూ.”
^ లేదా “వాటిలో నీతి నివసిస్తుంది.”