రాజులు రెండో గ్రంథం 12:1-21

  • యెహోయాషు, యూదా రాజు (1-3)

  • యెహోయాషు ఆలయాన్ని బాగుచేయడం (4-16)

  • సిరియన్ల దాడి (17, 18)

  • యెహోయాషును చంపడం (19-21)

12  యెహూ+ పరిపాలనలోని ఏడో సంవత్సరంలో యెహోయాషు+ రాజయ్యాడు, అతను యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.+  యాజకుడైన యెహోయాదా తనకు ఉపదేశించిన రోజులన్నిట్లో, యెహోయాషు యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.  అయితే ఉన్నత స్థలాలు+ మాత్రం తీసేయబడలేదు; ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూనే ఉన్నారు.  యెహోయాషు యాజకులకు ఇలా చెప్పాడు: “పవిత్రమైన అర్పణలుగా యెహోవా మందిరానికి వచ్చే డబ్బంతటినీ+ తీసుకోండి. అంటే ప్రతీ వ్యక్తి పన్నుగా* చెల్లించాల్సిన డబ్బును,+ ఒట్టు పెట్టుకున్నవాళ్లు ఇచ్చే డబ్బును, ప్రతీ వ్యక్తి తన హృదయంలో నిర్ణయించుకొని యెహోవా మందిరానికి తీసుకొచ్చే డబ్బును+ తీసుకోండి.  యాజకులే స్వయంగా దాతల* దగ్గర నుండి డబ్బు తీసుకొని, మందిరంలో పాడైన చోట్లను మరమ్మతు చేయడం కోసం దాన్ని ఉపయోగించాలి.”+  అయితే, యెహోయాషు రాజు పరిపాలన 23వ సంవత్సరం వరకు యాజకులు ఇంకా మందిరానికి మరమ్మతులు చేయలేదు.+  కాబట్టి రాజైన యెహోయాషు యాజకుడైన యెహోయాదాను,+ మిగతా యాజకుల్ని పిలిచి, “మందిరానికి ఉన్న పగుళ్లను మీరు ఎందుకు బాగుచేయడం లేదు? మందిరాన్ని బాగుచేయడం కోసం ఉపయోగిస్తే తప్ప, దాతల దగ్గర నుండి ఇక డబ్బులు తీసుకోకండి” అని చెప్పాడు.+  దాంతో, ప్రజల దగ్గర నుండి ఇక డబ్బులు తీసుకోకూడదని, మందిరాన్ని బాగుచేసే బాధ్యత తీసుకోకూడదని యాజకులు నిర్ణయించుకున్నారు.  అప్పుడు యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె+ తీసుకొని దాని మూతకు ఒక రంధ్రం చేసి, దాన్ని బలిపీఠం పక్కన పెట్టించాడు; ఆ పెట్టె యెహోవా మందిరంలోకి ప్రవేశించేవాళ్లకు కుడివైపున ఉంది. ద్వారపాలకులుగా సేవచేసే యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ అందులోనే వేసేవాళ్లు.+ 10  యాజకులకు ఆ పెట్టెలో చాలా డబ్బులు కనిపించినప్పుడల్లా వాళ్లు ఆ విషయాన్ని రాజు కార్యదర్శికి, ప్రధానయాజకునికి చెప్పేవాళ్లు; వాళ్లు వచ్చి యెహోవా మందిరానికి వచ్చిన ఆ డబ్బును పోగుచేసి* లెక్కపెట్టేవాళ్లు.+ 11  లెక్కపెట్టిన డబ్బును యెహోవా మందిరంలో జరుగుతున్న పని మీద నియమించబడినవాళ్లకు ఇచ్చేవాళ్లు. వాళ్లు దాన్ని యెహోవా మందిరంలో పనిచేస్తున్న వడ్రంగులకు, నిర్మాణకులకు చెల్లించేవాళ్లు,+ 12  అలాగే తాపీ పనివాళ్లకు, రాళ్లు కొట్టేవాళ్లకు చెల్లించేవాళ్లు. అంతేకాదు వాళ్లు ఆ డబ్బుతో యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి కావాల్సిన మ్రానుల్ని, చెక్కిన రాళ్లను కూడా కొన్నారు. మందిరాన్ని బాగుచేయడానికి అయిన మిగతా ఖర్చులన్నిటి కోసం కూడా ఆ డబ్బును ఉపయోగించారు. 13  అయితే, యెహోవా మందిరం కోసం వెండి పాత్రల్ని, ఒత్తులు కత్తిరించే కత్తెరల్ని, గిన్నెల్ని, బాకాల్ని+ చేయించడానికి గానీ ఇతర వెండిబంగారు వస్తువుల్ని చేయించడానికి గానీ యెహోవా మందిరంలోకి వచ్చిన ఆ డబ్బును ఉపయోగించలేదు.+ 14  వాళ్లు ఆ డబ్బును పనిచేసినవాళ్లకు మాత్రమే ఇచ్చేవాళ్లు, వాళ్లు దాన్ని యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి ఉపయోగించారు. 15  మరమ్మతు పనిని చూసుకునేవాళ్లు నమ్మకస్థులు కాబట్టి, వాళ్లు పనివాళ్లకు ఇచ్చిన డబ్బు విషయంలో వాళ్లను లెక్క అడిగేవాళ్లు కాదు.+ 16  అయితే, అపరాధ పరిహారార్థ బలుల డబ్బుల్ని,+ పాపపరిహారార్థ బలుల డబ్బుల్ని యెహోవా మందిరం మరమ్మతు కోసం ఉపయోగించలేదు; ఆ డబ్బులు యాజకులకు చెందుతాయి.+ 17  అప్పుడే సిరియా రాజైన హజాయేలు+ గాతు+ మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత అతను యెరూషలేము మీద దాడిచేయాలని నిర్ణయించుకున్నాడు.+ 18  అప్పుడు యూదా రాజైన యెహోయాషు తన పూర్వీకులూ యూదా రాజులూ అయిన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ప్రతిష్ఠించిన పవిత్ర అర్పణలన్నిటినీ, అలాగే తన పవిత్ర అర్పణల్ని, యెహోవా మందిరంలోని, రాజభవనంలోని ఖజానాల్లో ఉన్న బంగారమంతా తీసి సిరియా రాజైన హజాయేలుకు పంపించాడు.+ దాంతో అతను యెరూషలేము మీద దాడి చేయకుండా వెళ్లిపోయాడు. 19  యెహోయాషు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 20  అయితే, అతని సేవకులు కలిసి అతని మీద కుట్రపన్ని,+ సిల్లాకు వెళ్లే దారిలో ఉన్న మిల్లో*+ కోటలో* అతన్ని చంపారు. 21  షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అనే అతని సేవకులు అతని మీద దాడిచేసి చంపారు.+ అతన్ని దావీదు నగరంలో తన పూర్వీకులతోపాటు పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు అమజ్యా రాజయ్యాడు.+

అధస్సూచీలు

లేదా “నిర్ణయించబడిన విలువగా.”
లేదా “పరిచయస్థుల.”
లేదా “సంచుల్లో పెట్టి.” అక్ష., “కట్టి.”
ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బ.”
లేదా “బేత్‌మిల్లో దగ్గర.”