రాజులు రెండో గ్రంథం 14:1-29

  • అమజ్యా, యూదా రాజు (1-6)

  • ఎదోముతో, ఇశ్రాయేలుతో యుద్ధం (7-14)

  • ఇశ్రాయేలు రాజైన యెహోయాషు చనిపోవడం (15, 16)

  • అమజ్యా చనిపోవడం (17-22)

  • యరొబాము II, ఇశ్రాయేలు రాజు (23-29)

14  ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కుమారుడూ అయిన యెహోయాషు+ పరిపాలనలోని రెండో సంవత్సరంలో, యూదా రాజైన యెహోయాషు కుమారుడు అమజ్యా రాజయ్యాడు.  రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు, అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెహోయద్దీను.+  అమజ్యా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ వచ్చాడు, కానీ తన పూర్వీకుడైన దావీదులా నడుచుకోలేదు.+ అతను ప్రతీది తన తండ్రి యెహోయాషు చేసినట్టు చేశాడు.+  అయితే, ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు;+ ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూనే ఉన్నారు.+  రాజ్యం పూర్తిగా తన అధీనంలోకి రాగానే అతను, రాజైన తన తండ్రిని చంపిన సేవకుల్ని చంపాడు.+  అయితే, “కుమారుల పాపాల్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాల్ని బట్టి కుమారులకు మరణశిక్ష విధించకూడదు; ప్రతి ఒక్కరికీ వాళ్లవాళ్ల పాపాల్ని బట్టే మరణశిక్ష విధించాలి”+ అని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం అతను హంతకుల కుమారుల్ని చంపలేదు.  అతను ఉప్పులోయలో 10,000 మంది ఎదోమీయుల్ని+ హతం చేశాడు,+ యుద్ధం చేసి సెల నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు;+ దాన్ని ఈ రోజు వరకు యొక్తయేలు అని పిలుస్తున్నారు.  తర్వాత అమజ్యా, ఇశ్రాయేలు రాజైన యెహూ మనవడూ యెహోయాహాజు కుమారుడూ అయిన యెహోయాషు దగ్గరికి సందేశకుల్ని పంపించి, “రా, మనం యుద్ధంలో తలపడదాం” అన్నాడు.+  దానికి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు, యూదా రాజైన అమజ్యాకు ఈ సందేశం పంపించాడు: “లెబానోనులోని ముళ్లపొద లెబానోనులోని దేవదారు చెట్టు దగ్గరికి, ‘నా కుమారునికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయి’ అని సందేశం పంపించింది. అయితే లెబానోనుకు చెందిన ఒక అడవి మృగం ఆ దారిలో వెళ్తూ ఆ ముళ్లపొదను తొక్కేసింది. 10  నిజమే, నువ్వు ఎదోమును ఓడించావు,+ దాన్నిబట్టి నీ హృదయం గర్వపడుతోంది. నీ ఘనతను ఆస్వాదించు, అయితే నువ్వు నీ రాజభవనంలోనే ఉండిపో. నువ్వు విపత్తును కొనితెచ్చుకోవడం, నువ్వూ నీతోపాటు యూదా నాశనం కావడం ఎందుకు?” 11  కానీ అమజ్యా వినలేదు.+ దాంతో ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయల్దేరాడు. యూదాకు చెందిన బేత్షెమెషు+ దగ్గర అతనూ, యూదా రాజైన అమజ్యా తలపడ్డారు.+ 12  యూదా ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయింది, దాంతో వాళ్లలో ప్రతీ ఒక్కరు వాళ్ల ఇంటికి* పారిపోయారు. 13  ఇశ్రాయేలు రాజైన యెహోయాషు, బేత్షెమెషు దగ్గర అహజ్యా మనవడూ యెహోయాషు కుమారుడూ యూదా రాజూ అయిన అమజ్యాను పట్టుకొని యెరూషలేముకు వచ్చాడు; అతను ఎఫ్రాయిము ద్వారం+ నుండి మూల ద్వారం+ వరకు యెరూషలేము ప్రాకారాన్ని 400 మూరలు* పడగొట్టాడు. 14  అతను యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాల్లో ఉన్న మొత్తం వెండిబంగారాల్ని, వస్తువులన్నిటినీ, అలాగే బందీలను తీసుకొని సమరయకు తిరిగొచ్చాడు. 15  యెహోయాషు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనుల గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి, అతను యూదా రాజైన అమజ్యాతో ఎలా పోరాడాడనే దాని గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 16  తర్వాత యెహోయాషు చనిపోయాడు;* అతన్ని ఇశ్రాయేలు రాజులతోపాటు సమరయలో పాతిపెట్టారు;+ అతని స్థానంలో అతని కుమారుడు యరొబాము*+ రాజయ్యాడు. 17  ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కుమారుడూ అయిన యెహోయాషు చనిపోయిన తర్వాత,+ యూదా రాజూ యెహోయాషు కుమారుడూ అయిన అమజ్యా+ 15 సంవత్సరాలు జీవించాడు.+ 18  అమజ్యా మిగతా చరిత్ర, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 19  తర్వాత యెరూషలేములో కొంతమంది అతని మీద కుట్ర పన్నారు;+ దాంతో అతను లాకీషుకు పారిపోయాడు, కానీ వాళ్లు అతని వెనక లాకీషుకు మనుషుల్ని పంపించి అతన్ని అక్కడ చంపించారు. 20  అతని శవాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకొచ్చి, యెరూషలేములోని దావీదు నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు.+ 21  తర్వాత యూదా ప్రజలందరూ అమజ్యా స్థానంలో అతని కుమారుడు అజర్యాను*+ రాజును చేశారు. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు.+ 22  రాజు* చనిపోయిన* తర్వాత, అజర్యా ఏలతు+ నగరాన్ని తిరిగి నిర్మించి, దాన్ని మళ్లీ యూదా వశం చేశాడు.+ 23  యూదా రాజూ యెహోయాషు కుమారుడూ అయిన అమజ్యా పరిపాలనలోని 15వ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము+ సమరయలో రాజయ్యాడు; అతను 41 సంవత్సరాలు పరిపాలించాడు. 24  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూనే ఉన్నాడు. అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాలన్నిటినీ విడిచిపెట్టలేదు.+ 25  అతను లెబో-హమాతు*+ నుండి అరాబా సముద్రం*+ వరకు ఇశ్రాయేలు సరిహద్దును మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, గత్‌-హెపెరుకు+ చెందిన ప్రవక్తా అమిత్తయి కుమారుడూ అయిన యోనా+ అనే తన సేవకుని ద్వారా చెప్పిన మాట ప్రకారం అది జరిగింది. 26  ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న తీవ్రమైన వేదనల్ని యెహోవా చూశాడు.+ ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు; కనీసం నిస్సహాయులు, బలహీనులు కూడా లేరు. 27  అయితే, ఇశ్రాయేలు పేరును ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా వాగ్దానం చేశాడు+ కాబట్టి, ఆయన వాళ్లను యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా కాపాడాడు.+ 28  యరొబాము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి, అతను ఎలా యుద్ధం చేశాడో, అతను దమస్కు,+ హమాతు+ నగరాల్ని ఎలా ఇశ్రాయేలులోని యూదా వశం చేశాడో ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 29  తర్వాత యరొబాము చనిపోయి,* తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులతోపాటు పాతిపెట్టబడ్డాడు; అతని స్థానంలో అతని కుమారుడు జెకర్యా+ రాజయ్యాడు.

అధస్సూచీలు

అక్ష., “డేరాకు.”
దాదాపు 178 మీటర్లు (584 అడుగులు). అనుబంధం B14 చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
అంటే, యరొబాము II.
“యెహోవా సహాయం చేశాడు” అని అర్థం. 2 రాజులు 15:13; 2 దినవృత్తాంతాలు 26:1-23; యెషయా 6:1; జెకర్యా 14:5లో అతను ఉజ్జియా అని పిలవబడ్డాడు.
అంటే, అతని తండ్రైన అమజ్యా.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించిన.”
అంటే, ఉప్పు సముద్రం, లేదా మృత సముద్రం.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించి.”