రాజులు రెండో గ్రంథం 15:1-38

  • అజర్యా, యూదా రాజు (1-7)

  • ఇశ్రాయేలు చివరి రాజులు: జెకర్యా (8-12), షల్లూము (13-16), మెనహేము (17-22), పెకహ్యా (23-26), పెకహు (27-31)

  • యోతాము, యూదా రాజు (32-38)

15  ఇశ్రాయేలు రాజైన యరొబాము* పరిపాలనలోని 27వ సంవత్సరంలో, యూదా రాజైన అమజ్యా+ కుమారుడు అజర్యా*+ రాజయ్యాడు.+  రాజైనప్పుడు అతని వయసు 16 ఏళ్లు, అతను యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెకొల్యా.  అతను తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ వచ్చాడు.+  అయితే, ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు,+ ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూనే ఉన్నారు.+  యెహోవా అజర్యాను మొత్తడంతో అతను చనిపోయే రోజు వరకు కుష్ఠురోగిగానే+ ఉన్నాడు. అతను వేరుగా ఒక ఇంట్లో ఉన్నాడు.+ ఆ సమయంలో రాజు కుమారుడైన యోతాము+ రాజభవనాన్ని చూసుకుంటూ దేశ ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు.+  అజర్యా+ మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.  తర్వాత అజర్యా చనిపోయాడు.*+ అతన్ని దావీదు నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.  యూదా రాజైన అజర్యా+ పరిపాలనలోని 38వ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను ఆరు నెలలు పరిపాలించాడు.  అతను తన పూర్వీకుల్లాగే యెహోవా దృష్టికి చెడు చేశాడు. అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాల్ని విడిచిపెట్టలేదు.+ 10  తర్వాత యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్రపన్ని, ఇబ్లెయాము+ దగ్గర అతన్ని చంపాడు.+ అతన్ని చంపి అతని స్థానంలో షల్లూము రాజయ్యాడు. 11  జెకర్యా మిగతా చరిత్ర, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 12  యెహోవా యెహూతో, “నీ కుమారులు నాలుగు తరాల వరకు+ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు”+ అని చెప్పిన మాట ఆ విధంగా నెరవేరింది. 13  యూదా రాజైన ఉజ్జియా*+ పరిపాలనలోని 39వ సంవత్సరంలో యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు; అతను సమరయలో ఒక నెల పరిపాలించాడు. 14  తర్వాత గాదీ కుమారుడైన మెనహేము తిర్సా+ నుండి సమరయకు వచ్చి, యాబేషు కుమారుడైన షల్లూమును చంపాడు.+ తర్వాత అతని స్థానంలో మెనహేము రాజయ్యాడు. 15  షల్లూము మిగతా చరిత్ర గురించి, అతను పన్నిన కుట్ర గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 16  మెనహేము తిప్సహుకు వచ్చినప్పుడు ఆ నగరంవాళ్లు ద్వారాలు తీయలేదు కాబట్టి, అతను తిర్సా నుండి తిప్సహు మీదికి వచ్చి దానిలో, దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్లందర్నీ చంపాడు. అందులోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు. 17  యూదా రాజైన అజర్యా పరిపాలనలోని 39వ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు. 18  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు. అతను బ్రతికున్నంత కాలం నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాలన్నిటినీ విడిచిపెట్టలేదు.+ 19  అష్షూరు రాజైన పూలు+ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడానికి వచ్చాడు; అప్పుడు మెనహేము, రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తనకు సహాయం చేసినందుకు అతనికి 1,000 తలాంతుల* వెండిని ఇచ్చాడు.+ 20  అష్షూరు రాజుకు వెండిని ఇవ్వడానికి, మెనహేము ప్రముఖులైన ధనవంతుల్లో ఒక్కొక్కరి నుండి 50 షెకెల్‌ల* వెండి వసూలు చేశాడు.+ అప్పుడు అష్షూరు రాజు దాడి విరమించుకొని వెళ్లిపోయాడు. 21  మెనహేము+ మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 22  తర్వాత మెనహేము చనిపోయాడు.* అతని స్థానంలో అతని కుమారుడు పెకహ్యా రాజయ్యాడు. 23  యూదా రాజైన అజర్యా పరిపాలనలోని 50వ సంవత్సరంలో మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 24  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు. అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాల్ని విడిచిపెట్టలేదు.+ 25  తర్వాత పెకహ్యా సహాయాధికారీ రెమల్యా కుమారుడూ అయిన పెకహు+ అతని మీద కుట్రపన్ని అర్గోబు, అరీహేనులతో కలిసి అతన్ని సమరయలో రాజభవనంలోని పటిష్ఠమైన బురుజులో చంపాడు. అతని వెంట 50 మంది గిలాదు మనుషులు ఉన్నారు; అతను పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు. 26  పెకహ్యా మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 27  యూదా రాజైన అజర్యా పరిపాలనలోని 52వ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను 20 సంవత్సరాలు పరిపాలించాడు. 28  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు. అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాల్ని విడిచిపెట్టలేదు.+ 29  ఇశ్రాయేలు రాజైన పెకహు రోజుల్లో, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు+ ఈయోను, ఆబేల్‌-బేత్‌-మయకా,+ యానోహా, కెదెషు,+ హాసోరు, గిలాదు,+ గలిలయ ప్రాంతాలమీద, నఫ్తాలి ప్రాంతమంతటి+ మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. అతను అక్కడి నివాసుల్ని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు.+ 30  తర్వాత ఏలా కుమారుడైన హోషేయ+ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్రపన్ని, అతని మీద దాడిచేసి చంపాడు; అతను ఉజ్జియా కుమారుడైన యోతాము+ పరిపాలనలోని 20వ సంవత్సరంలో పెకహు స్థానంలో రాజయ్యాడు. 31  పెకహు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 32  ఇశ్రాయేలు రాజూ రెమల్యా కుమారుడూ అయిన పెకహు పరిపాలనలోని రెండో సంవత్సరంలో, యూదా రాజైన ఉజ్జియా+ కుమారుడు యోతాము+ రాజయ్యాడు. 33  రాజైనప్పుడు అతని వయసు 25 ఏళ్లు; అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి సాదోకు కూతురైన యెరూషా.+ 34  యోతాము తన తండ్రి ఉజ్జియాలాగే యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ వచ్చాడు.+ 35  అయితే, ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు, ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూనే ఉన్నారు.+ యెహోవా మందిర పైద్వారాన్ని కట్టించింది ఈ యోతామే.+ 36  యోతాము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 37  ఆ రోజుల్లో యెహోవా సిరియా రాజైన రెజీనును, రెమల్యా కుమారుడైన పెకహును+ యూదా మీదికి పంపించడం మొదలుపెట్టాడు.+ 38  తర్వాత యోతాము చనిపోయాడు,* అతన్ని తన పూర్వీకుడైన దావీదు నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆహాజు రాజయ్యాడు.

అధస్సూచీలు

అంటే, యరొబాము II.
“యెహోవా సహాయం చేశాడు” అని అర్థం. 2 రాజులు 15:13; 2 దినవృత్తాంతాలు 26:1-23; యెషయా 6:1; జెకర్యా 14:5లో అతను ఉజ్జియా అని పిలవబడ్డాడు.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
ఇది అజర్యాకు ఇంకో పేరు.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”