రాజులు రెండో గ్రంథం 16:1-20

  • ఆహాజు, యూదా రాజు (1-6)

  • ఆహాజు అష్షూరీయులకు కానుక ఇవ్వడం (7-9)

  • ఆహాజు అన్యుల బలిపీఠంలాంటి బలిపీఠాన్ని చేయించడం (10-18)

  • ఆహాజు చనిపోవడం (19, 20)

16  రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని 17వ సంవత్సరంలో, యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు+ రాజయ్యాడు.  రాజైనప్పుడు అతని వయసు 20 ఏళ్లు, అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తన పూర్వీకుడైన దావీదు చేసినట్టు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరైనది చేయలేదు.+  బదులుగా, అతను ఇశ్రాయేలు రాజుల మార్గంలో+ నడిచాడు; అతను, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టిన దేశాల అసహ్యమైన ఆచారాల్ని పాటిస్తూ,+ చివరికి తన సొంత కుమారుణ్ణి అగ్నిలో వేసి కాల్చాడు.*+  అంతేకాదు, అతను ఉన్నత స్థలాల+ మీద, కొండల మీద, పచ్చని ప్రతీ చెట్టు+ కింద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూ వచ్చాడు.  ఆ సమయంలోనే సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజూ రెమల్యా కుమారుడూ అయిన పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వచ్చారు.+ వాళ్లు ఆహాజు ఉన్న నగరాన్ని ముట్టడించారు కానీ దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు.  అప్పుడే సిరియా రాజైన రెజీను ఏలతును+ మళ్లీ ఎదోముకు అప్పగించాడు, తర్వాత అతను యూదుల్ని* ఏలతు నుండి వెళ్లగొట్టాడు. ఎదోమీయులు ఏలతు నగరంలోకి వచ్చి, ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు.  అప్పుడు ఆహాజు, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరుకు,+ “నేను నీ సేవకుణ్ణి, నీ కుమారుణ్ణి. నువ్వు ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తున్న సిరియా రాజు చేతి నుండి, ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రక్షించు” అని సందేశం పంపించాడు.  ఆహాజు యెహోవా మందిరంలో, రాజభవన ఖజానాల్లో ఉన్న వెండిబంగారాల్ని తీసి అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.+  దాంతో అష్షూరు రాజు అతని మనవి విని దమస్కుకు వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు; అక్కడి ప్రజల్ని కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు,+ రెజీనును చంపాడు.+ 10  తర్వాత, ఆహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకోవడానికి దమస్కుకు వెళ్లాడు. ఆహాజు రాజు దమస్కులో ఉన్న బలిపీఠాన్ని చూసి, దాని రూపురేఖల్ని, తయారీ విధానాన్ని వివరించే నమూనాను యాజకుడైన ఊరియాకు పంపించాడు;+ 11  దమస్కు నుండి ఆహాజు రాజు పంపించిన నిర్దేశాలన్నిటి ప్రకారం యాజకుడైన ఊరియా+ ఒక బలిపీఠం కట్టాడు.+ ఆహాజు రాజు దమస్కు నుండి తిరిగొచ్చే లోపే యాజకుడైన ఊరియా దాన్ని కట్టడం పూర్తిచేశాడు. 12  రాజు దమస్కు నుండి తిరిగొచ్చి బలిపీఠం చూశాడు, అతను దాని దగ్గరికి వెళ్లి దానిమీద అర్పణలు అర్పించాడు.+ 13  అతను ఆ బలిపీఠం మీద తన దహనబలుల్ని, ధాన్యార్పణల్ని అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేస్తూ ఉన్నాడు; అంతేకాదు, దానిమీద పానీయార్పణల్ని పోశాడు, సమాధాన బలుల రక్తాన్ని చిలకరించాడు. 14  తర్వాత అతను మందిరం ముందు భాగంలో, యెహోవా సన్నిధిలో ఉన్న రాగి బలిపీఠాన్ని+ దాని స్థానంలో నుండి తీసేశాడు; అది అతను కట్టించిన బలిపీఠానికి, యెహోవా మందిరానికి మధ్య ఉండేది. అతను దాన్ని తీసి తన సొంత బలిపీఠానికి ఉత్తరం వైపున పెట్టించాడు. 15  అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు+ ఇలా ఆజ్ఞాపించాడు: “పెద్ద బలిపీఠం మీద ఉదయకాల దహనబలిని, సాయంకాల ధాన్యార్పణను,+ రాజు దహనబలిని, ధాన్యార్పణను, అలాగే ప్రజలందరి దహనబలుల్ని, ధాన్యార్పణల్ని, పానీయార్పణల్ని దహించు.+ దహనబలుల రక్తాన్నంతటినీ, ఇతర బలుల రక్తాన్నంతటినీ నువ్వు దానిమీదే చిలకరించాలి. రాగి బలిపీఠం విషయానికొస్తే, దాన్ని ఏమి చేయాలో నేను నిర్ణయిస్తాను.” 16  ఆహాజు రాజు ఆజ్ఞాపించిన ప్రతీది యాజకుడైన ఊరియా చేశాడు.+ 17  తర్వాత ఆహాజు రాజు, బండ్లకు ఉన్న పక్క పలకల్ని ముక్కలు చేయించి,+ వాటిమీద ఉన్న గంగాళాలు తీయించాడు;+ రాగి ఎద్దుల మీద ఉన్న సముద్రాన్ని తీయించి,+ రాళ్లు పరిచిన నేల మీద పెట్టించాడు.+ 18  మందిరంలో విశ్రాంతి రోజు కోసం కట్టిన మంటపాన్ని, అలాగే రాజు యెహోవా మందిరంలోకి వచ్చే ప్రవేశ మార్గాన్ని అతను మందిరం నుండి తొలగించాడు; అతను ఇదంతా అష్షూరు రాజు కోసం చేశాడు. 19  ఆహాజు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.+ 20  తర్వాత ఆహాజు చనిపోయాడు;* అతన్ని దావీదు నగరంలో తన పూర్వీకులతోపాటు పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు హిజ్కియా*+ రాజయ్యాడు.

అధస్సూచీలు

అక్ష., “అగ్ని గుండా దాటించాడు.”
లేదా “యూదా మనుషుల్ని.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
“యెహోవా బలపరుస్తాడు” అని అర్థం.