రాజులు రెండో గ్రంథం 21:1-26

  • మనష్షే, యూదా రాజు; అతని పాపాలు (1-18)

    • యెరూషలేము నాశనం చేయబడుతుంది (12-15)

  • ఆమోను, యూదా రాజు (19-26)

21  మనష్షే+ రాజైనప్పుడు అతనికి 12 ఏళ్లు. అతను యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.  అతను ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన దేశాల అసహ్యమైన ఆచారాలు పాటిస్తూ యెహోవా దృష్టికి చెడు చేశాడు.+  అతను తన తండ్రి హిజ్కియా నాశనం చేసిన ఉన్నత స్థలాల్ని+ మళ్లీ కట్టించాడు. అతను ఇశ్రాయేలు రాజైన అహాబులా బయలుకు బలిపీఠాలు కట్టించాడు, ఒక పూజా కర్రను* కూడా చేయించాడు.+ అతను ఆకాశ సైన్యమంతటికీ మొక్కి వాటిని సేవించాడు.+  యెహోవా ఏ మందిరం గురించైతే, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను”+ అని అన్నాడో, ఆ యెహోవా మందిరంలో అతను బలిపీఠాల్ని కూడా కట్టించాడు.  యెహోవా మందిరంలోని రెండు ప్రాంగణాల్లో+ అతను ఆకాశ సైన్యమంతటికీ+ బలిపీఠాలు కట్టించాడు.  అతను తన సొంత కుమారుణ్ణి అగ్నిలో వేసి కాల్చాడు;* ఇంద్రజాలం చేశాడు, శకునాలు చూశాడు, చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, భవిష్యత్తు చెప్పేవాళ్లను నియమించాడు.+ అతను యెహోవా దృష్టిలో విపరీతంగా చెడ్డపనులు చేసి ఆయనకు కోపం తెప్పించాడు.  మనష్షే తాను చేయించిన పూజా కర్ర*+ విగ్రహాన్ని* మందిరంలో పెట్టించాడు. ఆ మందిరం గురించే యెహోవా దావీదుతో, అతని కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నేను ఈ మందిరంలో, అలాగే ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి నేను ఎంచుకున్న యెరూషలేములో నా పేరును శాశ్వతంగా ఉంచుతాను.  ఇశ్రాయేలీయులు నేను వాళ్లకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ, వాళ్లు పాటించాలని నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటినీ జాగ్రత్తగా పాటిస్తే, వాళ్ల పూర్వీకులకు నేను ఇచ్చిన దేశం నుండి వాళ్లు ఎప్పటికీ అటూఇటూ వెళ్లరు.”+  అయితే ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడలేదు; మనష్షే వాళ్లను తప్పుదారిలో నడిపిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా నిర్మూలించిన దేశాల+ ప్రజల కన్నా ఎక్కువ చెడ్డపనులు వాళ్లతో చేయించాడు. 10  యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలా చెప్తూ వచ్చాడు:+ 11  “యూదా రాజైన మనష్షే ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు; అతను తనకు ముందున్న అమోరీయులందరి+ కన్నా చెడ్డగా ప్రవర్తించి,+ అసహ్యమైన తన విగ్రహాలతో* యూదావాళ్లు పాపం చేయడానికి కారకుడయ్యాడు. 12  అందుకే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే: ‘ఇదిగో! నేను యెరూషలేము మీద, యూదా మీద ఎలాంటి విపత్తు తీసుకురాబోతున్నానంటే, దాని గురించి వినే వాళ్లెవరికైనా రెండు చెవులు గింగురుమంటాయి.+ 13  నేను సమరయను కొలిచిన కొలనూలుతోనే+ యెరూషలేమును కొలుస్తాను,+ అహాబు ఇంటికి ఉపయోగించిన లంబసూత్రాన్నే* ఉపయోగిస్తాను.+ ఒక వ్యక్తి గిన్నెను కడిగి, తుడిచి, బోర్లించినట్టు నేను యెరూషలేమును శుభ్రంగా తుడిచేస్తాను.+ 14  నేను నా స్వాస్థ్యంలో మిగిలినవాళ్లను విడిచిపెట్టేస్తాను, వాళ్లను తమ శత్రువుల చేతికి అప్పగిస్తాను. వాళ్ల శత్రువులందరూ వాళ్లను బందీలుగా తీసుకెళ్తారు, వాళ్లను దోచుకుంటారు,+ 15  ఎందుకంటే వాళ్ల పూర్వీకులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ, నాకు కోపం తెప్పిస్తూ ఉన్నారు.’ ”+ 16  యూదావాళ్లు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించి పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు. అంతేకాదు అతను, పెద్ద ఎత్తున అమాయకుల రక్తాన్ని చిందించి యెరూషలేమును ఈ చివర నుండి ఆ చివర వరకు రక్తంతో నింపేశాడు.+ 17  మనష్షే మిగతా చరిత్ర, అంటే అతను చేసిన అన్ని పనులు, అతను చేసిన పాపాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 18  తర్వాత మనష్షే చనిపోయాడు,* అతన్ని తన రాజభవన తోటలో, అంటే ఉజ్జా తోటలో పాతిపెట్టారు;+ అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు. 19  ఆమోను+ రాజైనప్పుడు అతని వయసు 22 ఏళ్లు; అతను యెరూషలేములో రెండు సంవత్సరాలు పరిపాలించాడు.+ అతని తల్లి పేరు మెషుల్లెమెతు. ఆమె యొట్బకు చెందిన హారూసు కూతురు. 20  అతను తన తండ్రి మనష్షేలాగే యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు.+ 21  ఆమోను తన తండ్రి నడిచిన మార్గాలన్నిట్లో నడుస్తూ వచ్చాడు. అతను తన తండ్రి సేవించిన అసహ్యమైన విగ్రహాల్నే సేవిస్తూ, వాటికి మొక్కుతూ ఉన్నాడు.+ 22  అలా ఆమోను తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు; అతను యెహోవా మార్గంలో నడవలేదు.+ 23  కొంతకాలం తర్వాత ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతన్ని తన ఇంట్లోనే చంపారు. 24  అయితే, దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వాళ్లందర్నీ చంపి, అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజును చేశారు.+ 25  ఆమోను మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 26  ఆమోనును ఉజ్జా తోటలో ఉన్న అతని సమాధిలో పాతిపెట్టారు.+ అతని స్థానంలో అతని కుమారుడు యోషీయా+ రాజయ్యాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “అగ్ని గుండా దాటించాడు.”
పదకోశం చూడండి.
లేదా “చెక్కుడు విగ్రహాన్ని.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “మట్టపుగుండునే.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”