రాజులు రెండో గ్రంథం 25:1-30

  • నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం (1-7)

  • యెరూషలేము, దాని ఆలయం నాశనమవడం; బందీలుగా తీసుకెళ్లిన రెండో గుంపు (8-21)

  • గెదల్యాను అధికారిగా నియమించడం (22-24)

  • గెదల్యాను చంపడం; ప్రజలు ఐగుప్తుకు పారిపోవడం (25, 26)

  • యెహోయాకీను బబులోనులో విడుదలవ్వడం (27-30)

25  సిద్కియా పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు+ తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చాడు.+ అతను దానికి ఎదురుగా మకాం వేసి, దాని చుట్టూ ముట్టడిదిబ్బ కట్టాడు,+  రాజైన సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు నగరం ముట్టడి కింద ఉంది.  నాలుగో నెల తొమ్మిదో రోజున నగరంలో కరువు తీవ్రమైంది,+ దేశ ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.  నగర ప్రాకారం పడగొట్టబడింది.+ కల్దీయులు నగరాన్ని చుట్టుముడుతుండగా, రాత్రిపూట సైనికులందరూ రాజు తోట దగ్గర రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పారిపోయారు; సిద్కియా రాజు అరాబా మార్గంలో పారిపోయాడు.  అయితే కల్దీయుల సైన్యం రాజును తరిమి యెరికో ఎడారి మైదానాల్లో అతన్ని పట్టుకుంది, దాంతో అతని సైన్యాలన్నీ అతని దగ్గర నుండి చెదిరిపోయాయి.  వాళ్లు సిద్కియా రాజును పట్టుకుని+ రిబ్లా దగ్గరున్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు; అక్కడ అతనికి శిక్ష విధించబడింది.  వాళ్లు సిద్కియా కళ్లముందే అతని కుమారుల్ని చంపారు; తర్వాత నెబుకద్నెజరు సిద్కియాను గుడ్డివాణ్ణి చేసి, అతన్ని రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకొచ్చాడు.+  ఐదో నెల ఏడో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన 19వ సంవత్సరంలో, రాజ సంరక్షకుల అధిపతీ బబులోను రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.+  అతను యెహోవా మందిరాన్ని,+ రాజభవనాన్ని, యెరూషలేములోని ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు;+ అంతేకాదు ప్రముఖుల ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు. 10  రాజ సంరక్షకుల అధిపతితో ఉన్న కల్దీయుల సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాల్ని పడగొట్టింది. 11  రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను ఆ నగరంలో మిగిలిన ప్రజల్ని, బబులోను రాజు పక్షాన చేరినవాళ్లను, మిగతా ప్రజలందర్నీ బందీలుగా తీసుకెళ్లాడు.+ 12  అయితే రాజ సంరక్షకుల అధిపతి కొంతమంది నిరుపేదల్ని దేశంలో ఉండనిచ్చి, వాళ్లను ద్రాక్షతోటల్లో పనికి పెట్టాడు, వాళ్లతో వెట్టిచాకిరి చేయించాడు. 13  కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న రాగి స్తంభాల్ని, యెహోవా మందిరంలో ఉన్న బండ్లను, రాగి సముద్రాన్ని ముక్కలుముక్కలు చేసి ఆ రాగిని బబులోనుకు తీసుకెళ్లారు.+ 14  అంతేకాదు, ఆలయ సేవ కోసం ఉపయోగించే బాల్చీల్ని, పారల్ని, ఒత్తులు కత్తిరించే కత్తెరల్ని, గిన్నెల్ని, రాగి పాత్రలన్నిటినీ తీసుకెళ్లారు. 15  రాజ సంరక్షకుల అధిపతి మేలిమి బంగారంతో,+ వెండితో చేయబడిన నిప్పు పాత్రల్ని, గిన్నెల్ని తీసుకెళ్లాడు.+ 16  యెహోవా మందిరం కోసం సొలొమోను చేయించిన రెండు స్తంభాలు, సముద్రం, బండ్ల విషయానికొస్తే, వాటన్నిటి రాగి బరువు ఎంతో తూచడం సాధ్యం కాదు. 17  ప్రతీ స్తంభం ఎత్తు 18 మూరలు,* దాని మీద ఉన్న స్తంభ శీర్షం రాగిది; శీర్షం ఎత్తు మూడు మూరలు; శీర్షం చుట్టూ ఉన్న అల్లిక, దానిమ్మ పండ్లు రాగితో చేసినవి.+ ఆ రెండు స్తంభాలు చూడడానికి ఒకేలా ఉంటాయి. 18  రాజ సంరక్షకుల అధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను,+ రెండో యాజకుడైన జెఫన్యాను,+ ముగ్గురు ద్వారపాలకుల్ని కూడా తీసుకెళ్లాడు.+ 19  అతను సైనికుల మీద అధికారిగా ఉన్న ఒక ఆస్థాన అధికారినీ, నగరంలో ఉన్న ఐదుగురు రాజు సలహాదారుల్నీ, ప్రజల్ని సైన్యంలో చేర్చే సైన్యాధిపతి కార్యదర్శినీ, నగరంలో కనిపించిన 60 మంది సామాన్య ప్రజల్నీ తీసుకెళ్లాడు. 20  రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ వాళ్లను రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. 21  బబులోను రాజు, హమాతు+ దేశంలో ఉన్న రిబ్లాలో వాళ్లను చంపించాడు. అలా యూదావాళ్లు తమ దేశంలో నుండి చెరలోకి వెళ్లారు.+ 22  బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా దేశంలో తాను వదిలిపెట్టి వెళ్లిన ప్రజల మీద గెదల్యాను అధికారిగా నియమించాడు. ఈ గెదల్యా షాఫాను+ మనవడు, అహీకాము+ కుమారుడు.+ 23  బబులోను రాజు గెదల్యాను నియమించాడని వినగానే సైన్యాధిపతులందరూ, వాళ్ల మనుషులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్లు ఎవరంటే: నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు; కారేహ కుమారుడైన యోహానాను; నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడు శెరాయా; మాయకాతీయుని కుమారుడైన యజన్యా; వాళ్ల మనుషులు.+ 24  గెదల్యా వాళ్లతో, వాళ్ల మనుషులతో ప్రమాణం చేసి ఇలా అన్నాడు: “కల్దీయులకు సేవకులుగా ఉండడానికి భయపడకండి. ఈ దేశంలో నివసిస్తూ బబులోను రాజుకు సేవ చేయండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.”+ 25  ఏడో నెలలో, ఎలీషామా మనవడూ నెతన్యా కుమారుడూ అయిన ఇష్మాయేలు+ పదిమంది మనుషులతో వచ్చాడు. ఈ ఇష్మాయేలు రాజవంశానికి* చెందినవాడు. వాళ్లు గెదల్యా మీద దాడి చేసి అతన్ని చంపారు, గెదల్యాతోపాటు మిస్పాలో ఉన్న యూదుల్ని, కల్దీయుల్ని కూడా చంపారు.+ 26  తర్వాత సైన్యాధిపతులతో సహా తక్కువవాళ్లు-గొప్పవాళ్లు అనే తేడా లేకుండా ప్రజలందరూ లేచి ఐగుప్తుకు పారిపోయారు.+ వాళ్లు కల్దీయులకు భయపడి అలా వెళ్లారు.+ 27  యూదా రాజైన యెహోయాకీను+ బందీగా వెళ్లిన 37వ సంవత్సరం, 12వ నెల, 27వ రోజున, అంటే బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను రాజైన సంవత్సరంలో, యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.+ 28  అతను యెహోయాకీనుతో దయగా మాట్లాడి, బబులోనులో తన దగ్గరున్న ఇతర రాజుల సింహాసనాల కన్నా అతనికి ఉన్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు. 29  కాబట్టి యెహోయాకీను తన ఖైదీ వస్త్రాల్ని తీసేసి, తాను బ్రతికున్నంత కాలం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు. 30  యెహోయాకీను బ్రతికున్నంత కాలం ప్రతీరోజు రాజు అతనికి ఆహారం ఇస్తూ వచ్చాడు.

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “రాజ్య విత్తనానికి.”