రాజులు రెండో గ్రంథం 5:1-27

  • నయమాను కుష్ఠురోగాన్ని ఎలీషా బాగుచేయడం (1-19)

  • అత్యాశ వల్ల గేహజీకి కుష్ఠు రావడం (20-27)

5  సిరియా రాజు సైన్యాధిపతైన నయమాను ఒక ప్రముఖమైన వ్యక్తి. రాజు అతన్ని ఎంతో గౌరవించేవాడు, ఎందుకంటే యెహోవా అతని ద్వారా సిరియాకు విజయాన్ని* ఇచ్చాడు. అతను బలమైన యోధుడు, కానీ అతను కుష్ఠురోగి.  ఒకసారి సిరియన్లు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసినప్పుడు, అక్కడి నుండి ఒక అమ్మాయిని బందీగా తీసుకొచ్చారు. ఆమె నయమాను భార్యకు సేవకురాలైంది.  ఆమె తన యజమానురాలితో, “నా ప్రభువు సమరయలోని ప్రవక్త+ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది! అతను నా ప్రభువు కుష్ఠురోగాన్ని బాగుచేస్తాడు”+ అని చెప్పింది.  అప్పుడు అతను* రాజు దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలుకు చెందిన ఆ పాప చెప్పిన మాటల్ని తెలియజేశాడు.  అప్పుడు సిరియా రాజు, “వెళ్లు! నేను ఇశ్రాయేలు రాజుకు ఒక ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. దాంతో నయమాను పది తలాంతుల* వెండిని, 6,000 బంగారు రూకల్ని, పది జతల బట్టల్ని వెంట తీసుకొని వెళ్లాడు.  అతను ఇశ్రాయేలు రాజు దగ్గరికి ఉత్తరాన్ని తీసుకొచ్చాడు. అందులో ఇలా ఉంది: “ఈ ఉత్తరంతోపాటు నా సేవకుడైన నయమానును పంపిస్తున్నాను. నువ్వు అతని కుష్ఠురోగాన్ని బాగుచేయాలి.”  ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, బట్టలు చింపుకుని, “ఇతని కుష్ఠురోగాన్ని బాగుచేయమని చెప్పి ఇతన్ని నా దగ్గరికి పంపించాడు! ఎవరినైనా చంపడానికి, బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా?+ అతను నాతో ఎలా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాడో చూడండి” అన్నాడు.  ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకున్నాడని సత్యదేవుని సేవకుడైన ఎలీషా వినగానే, అతను రాజు దగ్గరికి ఈ సందేశం పంపించాడు: “నువ్వు ఎందుకు నీ బట్టలు చింపుకున్నావు? దయచేసి అతన్ని నా దగ్గరికి రానివ్వు, అప్పుడు ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి అర్థమౌతుంది.”+  దాంతో నయమాను తన గుర్రాలతో, యుద్ధ రథాలతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలబడ్డాడు. 10  అయితే, ఎలీషా ఒక సందేశకుని ద్వారా నయమానుకు ఈ కబురు పంపించాడు: “నువ్వు వెళ్లి యొర్దాను నదిలో ఏడుసార్లు+ స్నానం చేయి,+ అప్పుడు నీ శరీరం బాగౌతుంది, నువ్వు శుద్ధుడివి అవుతావు.” 11  అప్పుడు నయమానుకు కోపం వచ్చింది, అతను అక్కడి నుండి వెళ్లిపోతూ ఇలా అన్నాడు: “అతను బయటికి నా దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడి, తన దేవుడైన యెహోవా పేరున ప్రార్థన చేసి, తన చేతిని కుష్ఠురోగం ఉన్న చోట ఆడించి దాన్ని బాగుచేస్తాడని నేను అనుకున్నాను. 12  దమస్కులో+ ఉన్న అబానా, ఫర్పరు నదులు ఇశ్రాయేలు నదులన్నిటికన్నా శ్రేష్ఠమైనవి కావా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధుణ్ణి కాలేనా?” అతను ఆ మాట అని కోపంగా తిరిగెళ్లిపోయాడు. 13  అతని సేవకులు అతని దగ్గరికి వచ్చి, “ప్రభూ, ఒకవేళ ఆ ప్రవక్త ఏదైనా కష్టమైన పని చేయమంటే నువ్వు చేసేవాడివి కదా? అలాంటిది, ‘స్నానం చేసి శుద్ధుడివి అవ్వు’ అనే కదా అతను చెప్పాడు, అది ఇంకెంత సులభమైన పని” అన్నారు. 14  దాంతో నయమాను సత్యదేవుని సేవకుడు చెప్పినట్టు యొర్దాను నదికి వెళ్లి అందులో ఏడుసార్లు మునిగాడు.+ అప్పుడు అతని శరీరం బాగై, చిన్న పిల్లవాడి శరీరంలా అయ్యింది,+ అతను శుద్ధుడయ్యాడు.+ 15  తర్వాత అతను తన పరివారమంతటితో పాటు సత్యదేవుని సేవకుని దగ్గరికి తిరిగొచ్చి,+ అతని ముందు నిలబడి, “ఇశ్రాయేలులో తప్ప భూమ్మీద ఇంకెక్కడా దేవుడు లేడని+ నాకు ఇప్పుడు అర్థమైంది. దయచేసి నీ సేవకుడినైన నేను ఇచ్చే కానుకను* తీసుకో” అన్నాడు. 16  అయితే ఎలీషా, “నేను సేవిస్తున్న* యెహోవా జీవం తోడు, నేను దాన్ని తీసుకోను”+ అన్నాడు. నయమాను ఎంత బ్రతిమాలినా ఎలీషా దాన్ని తీసుకోలేదు. 17  చివరికి నయమాను ఇలా అన్నాడు: “అలా కాకపోతే, దయచేసి నీ సేవకుడినైన నాకు ఈ దేశపు మట్టిలో రెండు కంచర గాడిదలు మోసేంత మట్టిని ఇప్పించు. ఇకమీదట నీ సేవకుడు యెహోవాకు తప్ప వేరే ఏ దేవుళ్లకు దహనబలిని గానీ, బలిని గానీ అర్పించడు. 18  కానీ యెహోవా నీ సేవకుణ్ణి ఈ ఒక్క విషయంలో క్షమించాలి: నా ప్రభువైన రాజు వంగి నమస్కారం చేయడానికి రిమ్మోను గుడికి వెళ్లినప్పుడు, అతను నా చెయ్యి మీద ఆనుకుంటాడు కాబట్టి నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. నేను రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేసినప్పుడు, యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి.” 19  అప్పుడు ఎలీషా అతనితో, “ప్రశాంతంగా వెళ్లు” అన్నాడు. అతను ఎలీషా దగ్గర నుండి బయల్దేరి కొంతదూరం వెళ్లాక, 20  సత్యదేవుని సేవకుడైన+ ఎలీషాకు పరిచారం చేసే గేహజీ+ ఇలా అనుకున్నాడు: ‘నా యజమాని సిరియావాడైన ఈ నయమాను+ ఇచ్చిన కానుకను తీసుకోకుండా అతన్ని వెళ్లిపోనిచ్చాడు. యెహోవా జీవం తోడు, నేను అతని వెనకాలే పరుగెత్తుకుంటూ వెళ్లి అతని దగ్గర ఏమైనా తీసుకుంటాను.’ 21  దాంతో గేహజీ నయమాను వెనకే పరుగెత్తాడు. ఎవరో తన వెనక పరుగెత్తుకుంటూ రావడం నయమాను చూసినప్పుడు, అతన్ని కలవడానికి తన రథం మీద నుండి దిగి, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు. 22  అతను ఇలా అన్నాడు: “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపిస్తూ, ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ప్రవక్తల కుమారుల్లో నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. దయచేసి వాళ్ల కోసం ఒక తలాంతు వెండిని, రెండు జతల బట్టల్ని ఇవ్వు’ అని నీతో చెప్పమన్నాడు.”+ 23  అప్పుడు నయమాను, “ఒకటి కాదు, రెండు తలాంతులు తీసుకో” అన్నాడు. అతను గేహజీని బ్రతిమాలి+ రెండు జతల బట్టల్ని, రెండు తలాంతుల వెండిని రెండు సంచుల్లో పెట్టి తన సేవకుల్లో ఇద్దరికి ఇచ్చాడు. ఆ సేవకులు వాటిని మోస్తూ గేహజీ ముందు నడిచారు. 24  గేహజీ ఓపెలుకు* చేరుకున్నప్పుడు ఆ సేవకుల చేతుల్లో నుండి వాటిని తీసుకొని ఇంట్లో పెట్టి వాళ్లను పంపించేశాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, 25  అతను లోపలికి వచ్చి తన యజమాని పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అతన్ని, “గేహజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. అతను, “నీ సేవకుడినైన నేను ఎక్కడికీ వెళ్లలేదు” అన్నాడు.+ 26  అప్పుడు ఎలీషా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అతని వెనకాలే వెళ్లడం, అతను నిన్ను కలవడానికి తన రథం మీద నుండి దిగడం నాకు తెలియదనుకున్నావా? వెండిని, బట్టల్ని, ఒలీవ తోటల్ని, ద్రాక్షతోటల్ని, గొర్రెల్ని, పశువుల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను తీసుకోవడానికి ఇది సమయమా?+ 27  కాబట్టి నయమాను కుష్ఠురోగం+ నీకు, నీ వంశస్థులకు ఎప్పటికీ ఉంటుంది.” వెంటనే కుష్ఠురోగం వచ్చి అతని శరీరం మంచులా తెల్లగా అయ్యింది,+ దాంతో అతను ఎలీషా ముందు నుండి వెళ్లిపోయాడు.

అధస్సూచీలు

లేదా “రక్షణను.”
నయమానును సూచిస్తుండవచ్చు.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “దీవెనను.”
అక్ష., “నేను ఎవరి ముందు నిలబడ్డానో ఆ.”
సమరయలోని ఒక స్థలం, అది ఒక కొండ గానీ దుర్గం గానీ కావచ్చు.