రాజులు రెండో గ్రంథం 7:1-20

  • కరువు ముగుస్తుందని ఎలీషా చెప్పడం (1, 2)

  • సిరియన్ల శిబిరంలో ఆహారం దొరకడం (3-15)

  • ఎలీషా ప్రవచనం నెరవేరడం (16-20)

7  అప్పుడు ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా చెప్తున్న మాట* వినండి. యెహోవా చెప్పేదేమిటంటే: ‘రేపు దాదాపు ఈ సమయానికి సమరయ ద్వారం* దగ్గర, ఒక సీయ కొలత* మెత్తని పిండి ఒక షెకెల్‌కు,* రెండు సీయ కొలతల బార్లీ ఒక షెకెల్‌కు దొరుకుతాయి.’ ”+  అప్పుడు రాజుకు నమ్మకస్థుడైన సహాయాధికారి సత్యదేవుని సేవకునితో, “యెహోవా ఆకాశ తూములు* తెరిచినా, ఇది సాధ్యమౌతుందా?”+ అన్నాడు. దానికి ఎలీషా, “నువ్వు దాన్ని కళ్లారా చూస్తావు,+ కానీ దాన్ని తినవు”+ అన్నాడు.  నగర ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు.+ వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “మనం చనిపోయేదాకా ఇక్కడ కూర్చొనివుండడం దేనికి?  నగరంలో కరువు ఉంది+ కాబట్టి అక్కడికి వెళ్తే చనిపోతాం. ఇక్కడే కూర్చొని ఉన్నా ఎలాగూ చనిపోతాం. కాబట్టి మనం సిరియన్ల శిబిరానికి వెళ్దాం. వాళ్లు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాం, చంపితే చనిపోదాం.”  సాయంత్రం చీకటిపడ్డాక వాళ్లు లేచి సిరియన్ల శిబిరం దగ్గరికి వెళ్లారు. వాళ్లు సిరియన్ల శిబిరం అంచుకు చేరుకున్నప్పుడు, వాళ్లకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.  యెహోవా అంతకుముందు సిరియా శిబిరంలోని వాళ్లకు యుద్ధ రథాల శబ్దం, గుర్రాల శబ్దం, ఒక పెద్ద సైన్యం శబ్దం వినబడేలా చేశాడు.+ దాంతో వాళ్లు ఒకరితో ఒకరు, “ఇదిగో! ఇశ్రాయేలు రాజు మన మీద యుద్ధం చేయడానికి హిత్తీయుల రాజులకు, ఐగుప్తు* రాజులకు డబ్బులు ఇచ్చి పిలిపించాడు!” అని చెప్పుకున్నారు.  కాబట్టి వాళ్లు వెంటనే లేచి సాయంత్రం చీకట్లో పారిపోయారు; వాళ్లు తమ డేరాల్ని, గుర్రాల్ని, గాడిదల్ని, శిబిరాన్నంతటినీ ఉన్నదున్నట్టు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు.  ఆ కుష్ఠురోగులు శిబిరం అంచుకు వచ్చి ఒక డేరాలోకి వెళ్లి తినడం తాగడం మొదలుపెట్టారు. వాళ్లు అక్కడి నుండి వెండిబంగారాల్ని, బట్టల్ని తీసుకెళ్లి దాచిపెట్టారు. తర్వాత వెనక్కి వచ్చి ఇంకో డేరాలోకి వెళ్లి అందులోని వస్తువుల్ని తీసుకెళ్లి దాచిపెట్టారు.  చివరికి వాళ్లు ఇలా అనుకున్నారు: “మనం చేసేది సరైనది కాదు. ఈ మంచివార్తను ఇతరులకు చెప్పాలి. తెల్లారేవరకు ఏమీ చెప్పకుండా ఉంటే మనకు శిక్షపడుతుంది. మనం వెళ్లి, ఈ విషయాన్ని రాజభవనం దగ్గర తెలియజేద్దాం.” 10  వాళ్లు వెళ్లి, నగర ద్వారపాలకులకు బిగ్గరగా ఇలా చెప్పారు: “మేము సిరియన్ల శిబిరంలోకి వెళ్లాం, అక్కడ ఎవ్వరూ లేరు. మాకు అక్కడ ఎవరి శబ్దం వినిపించలేదు. కట్టేసివున్న గుర్రాలు, గాడిదలు మాత్రమే ఉన్నాయి, వాళ్లు డేరాల్ని ఉన్నవి ఉన్నట్టుగానే వదిలేసి వెళ్లిపోయారు.” 11  వెంటనే ద్వారపాలకులు రాజభవనంలోని మనుషుల్ని బిగ్గరగా పిలిచి, ఆ విషయం చెప్పారు. 12  వెంటనే రాజు రాత్రిపూట లేచి తన సేవకులతో ఇలా అన్నాడు: “సిరియన్ల పథకం ఏమిటో నేను చెప్తాను. మనం ఆకలితో ఉన్నామని+ సిరియన్లకు తెలుసు. కాబట్టి, ‘ఇశ్రాయేలు ప్రజలు నగరం నుండి బయటికి వస్తారు, వాళ్లను ప్రాణాలతో పట్టుకొని నగరంలోకి ప్రవేశిద్దాం’+ అని అనుకుంటూ వాళ్లు శిబిరాన్ని విడిచిపెట్టి పొలంలో దాక్కున్నారు.” 13  అప్పుడు రాజు సేవకుల్లో ఒకతను ఇలా అన్నాడు: “దయచేసి, కొంతమంది మనుషుల్ని నగరంలో మిగిలిన ఐదు గుర్రాల్ని తీసుకొని పంపిద్దాం. ఇక్కడ ఉండే ఇశ్రాయేలీయులందరికీ ఏమి జరుగుతుందో వాళ్లకూ అదే జరుగుతుంది. ఇప్పటివరకు నాశనమైన ఇశ్రాయేలీయులందరికీ జరిగిందే వాళ్లకూ జరుగుతుంది. అందుకే వాళ్లను పంపించి చూద్దాం.” 14  దాంతో ఆ మనుషులు గుర్రాల్ని కట్టిన రెండు రథాల్ని తీసుకున్నారు. రాజు వాళ్లతో, “మీరు వెళ్లి చూడండి” అని చెప్పి వాళ్లను సిరియన్ల శిబిరానికి పంపించాడు. 15  వాళ్లు సిరియన్ల వెనక యొర్దాను వరకు వెళ్లారు; సిరియన్లు భయంతో పారిపోతూ పారేసిన బట్టలు, పాత్రలు ఆ దారిపొడవునా ఉన్నాయి. ఆ సందేశకులు వెనక్కి వచ్చి, రాజుకు విషయం చెప్పారు. 16  అప్పుడు ప్రజలు బయటికి వెళ్లి సిరియన్ల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పినట్టే, ఒక సీయ కొలత మెత్తని పిండి ఒక షెకెల్‌కు, రెండు సీయ కొలతల బార్లీ ఒక షెకెల్‌కు అమ్మారు.+ 17  రాజు, తన నమ్మకస్థుడైన సహాయాధికారిని ద్వారం దగ్గర అధికారిగా నియమించాడు. అయితే, ప్రజలు ఆ అధికారిని ద్వారం దగ్గర తొక్కడంతో అతను చనిపోయాడు, రాజు సత్యదేవుని సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు, అతను రాజుతో చెప్పినట్టే అది జరిగింది. 18  “రేపు దాదాపు ఈ సమయానికి సమరయ ద్వారం దగ్గర, రెండు సీయ కొలతల బార్లీ ఒక షెకెల్‌కు, ఒక సీయ కొలత మెత్తని పిండి ఒక షెకెల్‌కు దొరుకుతాయి” అని సత్యదేవుని సేవకుడు రాజుతో అన్నట్టే జరిగింది.+ 19  కానీ ఆ సహాయాధికారి సత్యదేవుని సేవకునితో, “యెహోవా ఆకాశ తూములు తెరిచినా, ఇలాంటిది సాధ్యమౌతుందా?” అన్నాడు. దానికి ఎలీషా, “నువ్వు దాన్ని కళ్లారా చూస్తావు, కానీ దాన్ని తినవు” అన్నాడు. 20  అతనికి అలాగే జరిగింది. ప్రజలు అతన్ని ద్వారం దగ్గర తొక్కడంతో అతను చనిపోయాడు.

అధస్సూచీలు

లేదా “వాక్యం.”
లేదా “సంతల.”
అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో (దాదాపు 10 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ప్రవాహ ద్వారాలు.”
లేదా “ఈజిప్టు.”