రాజులు రెండో గ్రంథం 8:1-29

  • షూనేము స్త్రీ ఆస్తిని తిరిగి పొందడం (1-6)

  • ఎలీషా, బెన్హదదు, హజాయేలు (7-15)

  • యెహోరాము, యూదా రాజు (16-24)

  • అహజ్యా, యూదా రాజు (25-29)

8  ఎలీషా తాను బ్రతికించిన అబ్బాయి+ తల్లితో ఇలా అన్నాడు: “ఒక కరువు రాబోతుందని యెహోవా ప్రకటించాడు,+ అది ఏడు సంవత్సరాల పాటు దేశంలో ఉంటుంది. కాబట్టి నువ్వు, నీ ఇంటివాళ్లు ఇక్కడి నుండి బయల్దేరి మీకు వీలైన చోట పరదేశులుగా జీవించండి.”  ఆ స్త్రీ సత్యదేవుని సేవకుడు చెప్పినట్టే చేసింది. ఆమె తన ఇంటివాళ్లతో పాటు ఫిలిష్తీయుల దేశానికి+ వెళ్లి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించింది.  ఆ ఏడు సంవత్సరాల తర్వాత, ఆమె ఫిలిష్తీయుల దేశం నుండి తన దేశానికి తిరిగొచ్చి తన ఇంటి కోసం, పొలం కోసం మనవి చేయడానికి రాజు దగ్గరికి వెళ్లింది.  ఆ సమయంలో రాజు, సత్యదేవుని సేవకుని పరిచారకుడైన గేహజీతో మాట్లాడుతున్నాడు; రాజు అతన్ని, “ఎలీషా చేసిన గొప్ప పనులన్నిటి+ గురించి దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.  చనిపోయిన అబ్బాయిని ఎలీషా ఎలా బ్రతికించాడో+ గేహజీ రాజుకు వివరిస్తుండగా, ఎలీషా బ్రతికించిన బాబు తల్లి తన ఇంటి కోసం, పొలం కోసం మనవి చేయడానికి+ రాజు దగ్గరికి వచ్చింది. వెంటనే గేహజీ, “నా ప్రభువైన రాజా, ఆ స్త్రీ ఈమే, ఎలీషా బ్రతికించిన ఈమె కుమారుడు ఇతనే” అన్నాడు.  అప్పుడు రాజు ఏమి జరిగిందో చెప్పమని ఆమెను అడిగాడు. ఆమె జరిగిన విషయం రాజుకు చెప్పింది. రాజు ఆమె కోసం ఒక ఆస్థాన అధికారిని నియమించి, “ఆమెకు చెందినవన్నీ, ఆమె దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన రోజు నుండి ఇప్పటివరకు ఆమె పొలంలో పండినవన్నీ ఆమెకు తిరిగి ఇప్పించు” అని చెప్పాడు.  ఒకసారి సిరియా రాజైన బెన్హదదుకు+ జబ్బు చేసింది, ఆ సమయంలో ఎలీషా దమస్కుకు+ వెళ్లాడు. “సత్యదేవుని సేవకుడు+ ఇక్కడికి వచ్చాడు” అనే వార్త రాజుకు అందింది.  అప్పుడు రాజు హజాయేలుతో,+ “నువ్వు ఒక కానుక తీసుకొని వెళ్లి సత్యదేవుని సేవకుణ్ణి కలువు.+ నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానో లేదో అతన్ని యెహోవా దగ్గర విచారణ చేయమను” అని చెప్పాడు.  హజాయేలు దమస్కులోని అన్నిరకాల మంచి వస్తువుల్ని 40 ఒంటెల మీద ఎక్కించి వాటిని కానుకగా తీసుకుని ఎలీషాను కలవడానికి వెళ్లాడు; అతను ఎలీషా దగ్గరికి వచ్చి అతని ముందు నిలబడి ఇలా అన్నాడు: “నీ కుమారుడూ, సిరియా రాజూ అయిన బెన్హదదు నన్ను నీ దగ్గరికి పంపించాడు; తన జబ్బు నయమౌతుందో లేదో అతను నిన్ను అడగమన్నాడు.” 10  ఎలీషా అతనికి ఇలా చెప్పాడు: “నువ్వు వెళ్లి అతనితో, ‘ఖచ్చితంగా కోలుకుంటావు’ అని చెప్పు, అయితే అతను తప్పకుండా చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశాడు.”+ 11  సత్యదేవుని సేవకుడు ఆ మాట చెప్పాక, హజాయేలుకు ఇబ్బంది అనిపించే దాకా అతన్నే చూస్తూ ఉన్నాడు, తర్వాత సత్యదేవుని సేవకుడు ఏడ్వడం మొదలుపెట్టాడు. 12  అప్పుడు హజాయేలు, “నా ప్రభూ, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. దానికి ఎలీషా ఇలా అన్నాడు: “ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి హాని చేస్తావో నాకు తెలుసు.+ నువ్వు వాళ్ల ప్రాకారాలుగల నగరాల్ని తగలబెడతావు, వాళ్ల యోధుల్ని కత్తితో చంపుతావు, పిల్లల్ని ముక్కలుముక్కలు చేస్తావు, గర్భిణీ స్త్రీల కడుపులు చీలుస్తావు.”+ 13  దానికి హజాయేలు, “నీ సేవకుడినైన నేను ఒక మామూలు కుక్కను, నేను అలాంటి పని ఎలా చేయగలను?” అన్నాడు. అయితే ఎలీషా, “నువ్వు సిరియా మీద రాజు అవుతావని యెహోవా నాకు తెలియజేశాడు” అన్నాడు.+ 14  అప్పుడు హజాయేలు ఎలీషా దగ్గర నుండి తన ప్రభువు దగ్గరికి తిరిగొచ్చాడు. రాజు హజాయేలును, “ఎలీషా నీకు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. అతను, “నువ్వు తప్పకుండా కోలుకుంటావని చెప్పాడు”+ అని అన్నాడు. 15  అయితే మరుసటి రోజు, హజాయేలు ఒక దుప్పటిని తీసుకొని నీళ్లలో ముంచి, రాజు చనిపోయేంతవరకు దాన్ని అతని ముఖం మీద పెట్టి ఉంచాడు.+ తర్వాత అతని స్థానంలో హజాయేలు రాజయ్యాడు.+ 16  ఇశ్రాయేలు రాజూ అహాబు కుమారుడూ అయిన యెహోరాము పరిపాలనలోని ఐదో సంవత్సరంలో,+ యెహోషాపాతు యూదా మీద రాజుగా ఉండగానే అతని కుమారుడైన యెహోరాము+ యూదా మీద రాజయ్యాడు. 17  రాజైనప్పుడు అతనికి 32 ఏళ్లు, అతను యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. 18  అతను అహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు+ కాబట్టి అహాబు ఇంటివాళ్లలాగే+ అతను ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచాడు;+ అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు.+ 19  అయితే యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి+ యూదా రాజ్యాన్ని నాశనం చేయాలనుకోలేదు. ఎందుకంటే ఆయన దావీదుకు, అతని కుమారులకు ఎప్పుడూ ఒక దీపాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.+ 20  యెహోరాము రోజుల్లో ఎదోమువాళ్లు యూదా మీద తిరుగుబాటు చేసి+ సొంత రాజును నియమించుకున్నారు.+ 21  కాబట్టి యెహోరాము తన రథాలన్నిటినీ తీసుకొని జాయీరుకు వెళ్లాడు. అతను రాత్రిపూట లేచి తననూ, రథాధిపతుల్నీ చుట్టుముడుతున్న ఎదోమీయుల్ని ఓడించాడు; దాంతో సైనికులు తమ డేరాలకు పారిపోయారు. 22  అయినాసరే ఎదోమువాళ్లు ఈ రోజు వరకు యూదా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు; ఆ సమయంలో లిబ్నావాళ్లు+ కూడా తిరుగుబాటు చేశారు. 23  యెహోరాము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 24  తర్వాత యెహోరాము చనిపోయాడు;* అతన్ని దావీదు నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు.+ అతని స్థానంలో అతని కుమారుడు అహజ్యా+ రాజయ్యాడు. 25  ఇశ్రాయేలు రాజూ అహాబు కుమారుడూ అయిన యెహోరాము పరిపాలనలోని 12వ సంవత్సరంలో, యూదా రాజైన యెహోరాము కుమారుడు అహజ్యా రాజయ్యాడు.+ 26  రాజైనప్పుడు అతనికి 22 ఏళ్లు, అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా.+ ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ+ మనవరాలు.* 27  అతను అహాబు ఇంటివాళ్ల మార్గంలో నడుస్తూ,+ వాళ్లలా యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను అహాబు ఇంటివాళ్లకు బంధువు.+ 28  అతను సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కుమారుడైన యెహోరాముతో పాటు రామోత్గిలాదుకు+ వెళ్లినప్పుడు, సిరియన్లు యెహోరామును గాయపర్చారు.+ 29  సిరియా రాజైన హజాయేలుతో రామా దగ్గర యుద్ధం చేసినప్పుడు, సిరియన్లు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి+ యెహోరాము రాజు యెజ్రెయేలుకు తిరిగొచ్చాడు.+ అహాబు కుమారుడైన యెహోరాము గాయపడ్డాడు* కాబట్టి, అతన్ని చూడడానికి యూదా రాజూ యెహోరాము కుమారుడూ అయిన అహజ్యా యెజ్రెయేలుకు వెళ్లాడు.

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
అక్ష., “కూతురు.”
లేదా “అనారోగ్యంగా ఉన్నాడు.”