సమూయేలు రెండో గ్రంథం 16:1-23

  • సీబా మెఫీబోషెతు మీద నిందలు వేయడం (1-4)

  • షిమీ దావీదును శపించడం (5-14)

  • అబ్షాలోము హూషైను చేర్చుకోవడం (15-19)

  • అహీతోపెలు సలహా (20-23)

16  దావీదు కొండశిఖరం+ అవతల కొంచెం దూరం వెళ్లిన తర్వాత, మెఫీబోషెతు+ సేవకుడైన సీబా+ జీను* వేసిన రెండు గాడిదల్ని తీసుకొని దావీదును కలవడానికి వచ్చాడు. వాటిమీద 200 రొట్టెలు, 100 ఎండుద్రాక్ష రొట్టెలు, 100 వేసవికాల పండ్ల* రొట్టెలు, ఒక పెద్ద కుండలో ద్రాక్షారసం ఉన్నాయి.+  అప్పుడు రాజు సీబాతో, “నువ్వు వీటిని ఎందుకు తెచ్చావు?” అన్నాడు. దానికి సీబా, “గాడిదలు రాజు ఇంటివాళ్లు ఎక్కడానికి, రొట్టెలూ వేసవికాల పండ్లూ యువకులు తినడానికి, ద్రాక్షారసం ఎడారిలో అలసిపోయేవాళ్లు తాగడానికి తీసుకొచ్చాను” అన్నాడు.+  అప్పుడు రాజు, “నీ యజమాని కుమారుడు* ఎక్కడ?”+ అని అడిగాడు. దానికి సీబా రాజుతో, “ ‘ఈ రోజు ఇశ్రాయేలు ఇంటివాళ్లు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగిస్తారు’ అని అంటూ అతను యెరూషలేములోనే ఉండిపోయాడు”+ అన్నాడు.  అప్పుడు రాజు సీబాతో, “ఇదిగో! మెఫీబోషెతుకు చెందినవన్నీ నీవి”+ అన్నాడు. అందుకు సీబా, “నేను నీ ముందు సాష్టాంగపడుతున్నాను. నా ప్రభువైన రాజా, నేను నీ దృష్టిలో దయ పొందాలి”+ అన్నాడు.  దావీదు రాజు బహూరీముకు చేరుకున్నప్పుడు, సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడైన షిమీ+ అనే వ్యక్తి దావీదు వైపు వస్తూ గట్టిగా శాపనార్థాలు పెడుతున్నాడు.+  అతను దావీదు మీద, రాజు సేవకులందరి మీద, అలాగే దావీదు కుడివైపు ఎడమవైపు ఉన్న ప్రజలందరి మీద, యోధుల మీద రాళ్లు రువ్వుతూ ఉన్నాడు.  షిమీ శాపనార్థాలు పెడుతూ ఇలా అన్నాడు: “నరహంతకుడా! పనికిమాలినవాడా! పో, వెళ్లిపో.  నువ్వు ఎవరి స్థానంలో రాజుగా పరిపాలించావో ఆ సౌలు ఇంటివాళ్ల రక్తాపరాధం అంతటినీ యెహోవా నీ మీదికి తీసుకొచ్చాడు; అయితే యెహోవా రాజరికాన్ని నీ కుమారుడైన అబ్షాలోము చేతికి అప్పగించాడు. నువ్వు నరహంతకుడివి కాబట్టే నీ మీదికి విపత్తు వచ్చింది!”+  అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో,+ “ఈ చచ్చిన కుక్క+ నా ప్రభువైన రాజును శపించడమా?+ దయచేసి నన్ను వెళ్లనివ్వు, వాడి తల నరికేస్తాను”+ అన్నాడు. 10  కానీ రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా, నాతో మీకేంటి?+ అతన్ని శపించనివ్వండి;+ ‘దావీదును శపించు!’ అని యెహోవా అతనికి చెప్పాడు.+ కాబట్టి, ‘నువ్వు ఎందుకిలా చేస్తున్నావు?’ అని అతన్ని ఎవరు అడగగలరు?” 11  తర్వాత దావీదు అబీషైతో, తన సేవకులందరితో ఇలా అన్నాడు: “నేను కన్న నా సొంత కుమారుడే నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు,+ అలాంటిది ఒక బెన్యామీనీయుడి+ నుండి నేను ఇంతకన్నా ఏం ఆశించాలి! అతన్ని వదిలేయండి, అతన్ని శపించనివ్వండి. ఎందుకంటే యెహోవాయే అలా చేయమని అతనికి చెప్పాడు! 12  యెహోవా బహుశా నా బాధను చూస్తాడేమో,+ షిమీ శాపనార్థాలకు బదులుగా యెహోవా నాకు దీవెనలు ఇస్తాడేమో.”*+ 13  అప్పుడు దావీదు, అతని మనుషులు దారిలో ముందుకు వెళ్తూ ఉంటే, షిమీ దావీదుకు పక్కనున్న కొండమీద నడుస్తూ శాపనార్థాలు పెడుతూ,+ రాళ్లు రువ్వుతూ, చాలా దుమ్ము ఎత్తి పోస్తూ ఉన్నాడు. 14  చాలాసేపటి తర్వాత దావీదు, అతనితో ఉన్న మనుషులందరూ బాగా అలసిపోయి గమ్యస్థానం చేరుకున్నారు. వాళ్లు అక్కడ సేదదీరారు. 15  ఈలోగా అబ్షాలోము, ఇశ్రాయేలీయులందరూ యెరూషలేముకు చేరుకున్నారు, అహీతోపెలు+ అతనితోపాటే ఉన్నాడు. 16  దావీదు స్నేహితుడూ* అర్కీయుడూ+ అయిన హూషై+ అబ్షాలోము దగ్గరికి వచ్చి అతనితో, “రాజు దీర్ఘకాలం జీవించాలి!+ రాజు దీర్ఘకాలం జీవించాలి!” అన్నాడు. 17  అప్పుడు అబ్షాలోము హూషైను, “నీ స్నేహితుని మీద నువ్వు చూపించే విశ్వసనీయ ప్రేమ ఇదేనా? నీ స్నేహితునితోపాటు నువ్వెందుకు వెళ్లలేదు?” అని అడిగాడు. 18  అందుకు హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు: “లేదు. యెహోవా, ఈ ప్రజలు, అలాగే ఇశ్రాయేలు వాళ్లందరూ ఎవర్ని ఎంచుకున్నారో అతని వైపే నేను ఉంటాను. నేను అతనితోపాటే ఉంటాను. 19  నేను మళ్లీ చెప్తున్నాను, నేను ఎవర్ని సేవించాలి? అతని కుమారుణ్ణి కాదా? నేను నీ తండ్రికి సేవ చేసినట్టే నీకూ సేవ చేస్తాను.”+ 20  తర్వాత అబ్షాలోము అహీతోపెలును, “నీ సలహా* చెప్పు.+ మనం ఏమి చేయాలి?” అని అడిగాడు. 21  దానికి అహీతోపెలు అబ్షాలోముకు ఇలా చెప్పాడు: “రాజభవనాన్ని చూసుకోవడానికి నీ తండ్రి ఉంచి వెళ్లిన అతని ఉపపత్నులతో+ సంబంధం పెట్టుకో.+ నువ్వు ఇలా చేసి నీ తండ్రిని అవమానించావని ఇశ్రాయేలీయులందరూ వింటారు, అప్పుడు నీకు మద్దతు ఇచ్చేవాళ్లు ధైర్యం తెచ్చుకుంటారు.” 22  దాంతో వాళ్లు అబ్షాలోము కోసం మిద్దె+ మీద ఒక డేరా వేశారు, అతను ఇశ్రాయేలీయులందరి కళ్లముందు తన తండ్రి ఉపపత్నులతో సంబంధం పెట్టుకున్నాడు.+ 23  ఆ రోజుల్లో అహీతోపెలు ఇచ్చే సలహాను+ సత్యదేవుని నుండి వచ్చే మాటగా ఎంచేవాళ్లు. అహీతోపెలు ఇచ్చే సలహాలన్నిటినీ దావీదు, అబ్షాలోము ఇద్దరూ అలాగే పరిగణించేవాళ్లు.

అధస్సూచీలు

ముఖ్యంగా అంజూర పండ్లు, బహుశా ఖర్జూర పండ్లు కూడా.
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
లేదా “మనవడు.”
లేదా “మళ్లీ మంచి చేస్తాడేమో.”
లేదా “ఆంతరంగికుడూ.”
లేదా “ఆలోచన.”