సమూయేలు రెండో గ్రంథం 20:1-26

  • షేబ తిరుగుబాటు; యోవాబు అమాశాను చంపడం (1-13)

  • షేబను వెంటాడి, తల నరికి చంపడం (14-22)

  • దావీదు ప్రభుత్వ నిర్వహణ (23-26)

20  ఆ సమయంలో, సమస్యలు సృష్టించే షేబ+ అనే ఒక బెన్యామీనీయుడు ఉన్నాడు, అతను బిక్రి కుమారుడు. అతను బూర* ఊది+ ఇలా అన్నాడు: “మనకు దావీదులో ఏ భాగమూ లేదు. యెష్షయి కుమారునిలో మనకు ఏ వాటా లేదు.+ ఇశ్రాయేలీయులారా, మీలో ప్రతీ ఒక్కరు మీ మీ దేవుళ్ల* దగ్గరికి వెళ్లిపోండి!”+  దాంతో ఇశ్రాయేలీయులందరూ దావీదును అనుసరించడం మానేసి బిక్రి కుమారుడైన షేబను అనుసరించారు;+ అయితే యొర్దాను నుండి యెరూషలేము వరకు యూదావాళ్లు తమ రాజునే అంటిపెట్టుకొని ఉన్నారు.+  దావీదు యెరూషలేములోని తన రాజభవనానికి+ వచ్చిన తర్వాత, రాజభవనాన్ని చూసుకోవడానికి తాను ఉంచివెళ్లిన పదిమంది ఉపపత్నుల్ని+ ఒక ఇంట్లో కాపలా కింద ఉంచాడు. అతను వాళ్లను పోషించాడు కానీ వాళ్లతో సంబంధం పెట్టుకోలేదు.+ తమ భర్త బ్రతికే ఉన్నా వాళ్లు విధవరాళ్లలా జీవిస్తూ చనిపోయేంతవరకు కాపలా కిందే ఉన్నారు.  అప్పుడు రాజు అమాశాతో,+ “మూడు రోజుల్లోగా యూదా మనుషుల్ని నా దగ్గరికి పిలిపించు, నువ్వు కూడా ఇక్కడ ఉండాలి” అన్నాడు.  దాంతో అమాశా యూదావాళ్లను సమకూర్చడానికి వెళ్లాడు, కానీ అతను రాజు చెప్పిన గడువులోపు రాలేదు.  అప్పుడు దావీదు అబీషైతో+ ఇలా చెప్పాడు: “బిక్రి కుమారుడైన షేబ+ మనకు అబ్షాలోము కన్నా ఎక్కువ హాని చేయవచ్చు.+ అతను ప్రాకారాలుగల నగరాల్లోకి వెళ్లి మన నుండి తప్పించుకోకుండా నువ్వు నీ ప్రభువు సేవకుల్ని తీసుకెళ్లి అతన్ని తరుము.”  కాబట్టి యోవాబు+ మనుషులు, కెరేతీయులు, పెలేతీయులు,+ బలవంతులందరూ అబీషై వెంట వెళ్లారు; వాళ్లు బిక్రి కుమారుడైన షేబను తరమడానికి యెరూషలేము నుండి బయల్దేరారు.  వాళ్లు గిబియోనులోని+ పెద్ద బండ దగ్గర్లో ఉన్నప్పుడు అమాశా+ వాళ్లను కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో యోవాబు యుద్ధ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు, అతని నడికట్టుకు ఉన్న ఒరలో కత్తి ఉంది. అతను ముందుకు అడుగులు వేసినప్పుడు, కత్తి కింద పడింది.  అప్పుడు యోవాబు అమాశాను, “నా సహోదరుడా, నువ్వు క్షేమంగా ఉన్నావా?” అని అడిగాడు. తర్వాత యోవాబు అమాశాను ముద్దుపెట్టుకోవడానికి అన్నట్టు అతని గడ్డాన్ని తన కుడిచేతితో పట్టుకున్నాడు. 10  యోవాబు చేతిలో ఉన్న కత్తి విషయంలో అమాశా జాగ్రత్తగా లేడు. ఆ కత్తితో యోవాబు అమాశాను పొత్తికడుపులో పొడవడంతో+ అతని పేగులు బయటికి వచ్చి నేలమీద పడ్డాయి. యోవాబు అతన్ని మళ్లీ పొడవాల్సిన అవసరం రాలేదు; అతను ఒక్క పోటుతోనే పడిపోయాడు. తర్వాత యోవాబు, అతని సహోదరుడు అబీషై బిక్రి కుమారుడైన షేబను తరిమారు. 11  యోవాబు యువకుల్లో ఒకడు అమాశా పక్కన నిలబడి, “ఎవరైతే యోవాబు పక్షాన ఉన్నారో, ఎవరైతే దావీదుకు చెందినవాళ్లో వాళ్లు యోవాబును అనుసరించాలి!” అని అంటూ ఉన్నాడు. 12  ఆ సమయంలో అమాశా దారి మధ్యలో రక్తపు మడుగులో దొర్లుతూ ఉన్నాడు, దారిలో వెళ్తున్న వాళ్లందరూ అతని దగ్గరికి వచ్చి ఆగుతున్నారని ఆ యువకుడు గమనించాడు. దాంతో అతను అమాశాను అక్కడి నుండి పొలంలోకి లాగి అతని మీద ఒక వస్త్రం కప్పాడు. 13  అతన్ని దారిలో నుండి లాగేసిన తర్వాత, బిక్రి కుమారుడైన షేబను+ తరమడానికి అందరూ యోవాబును అనుసరించారు. 14  షేబ ఇశ్రాయేలు గోత్రాలన్నిటి గుండా ప్రయాణిస్తూ బేత్‌-మయకాకు చెందిన ఆబేల్‌కు+ చేరుకున్నాడు. బిక్రీయులు పోగై, వాళ్లు కూడా అతని వెంట ఆ నగరంలోకి వెళ్లారు. 15  యోవాబు, అతని మనుషులు వచ్చి బేత్‌-మయకాకు చెందిన ఆబేల్‌లో అతన్ని ముట్టడించారు; ఆ నగరం ఒక ప్రాకారం లోపల ఉంది కాబట్టి వాళ్లు దానిమీద దాడిచేయడానికి దానికి ఎదురుగా ఒక ముట్టడిదిబ్బ కట్టారు. యోవాబు మనుషులందరూ ఆ ప్రాకారం పడగొట్టడానికి దాని కింద తవ్వడం మొదలుపెట్టారు. 16  అప్పుడు, తెలివిగల ఒక స్త్రీ నగరంలో నుండి బిగ్గరగా, “మనుషులారా, వినండి, వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి, దయచేసి అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి” అంది. 17  దాంతో అతను ఆమె దగ్గరికి వెళ్లాడు; ఆమె, “యోవాబువి నువ్వేనా?” అని అడిగింది, దానికి అతను, “అవును” అన్నాడు. ఆమె అతనితో, “నీ సేవకురాలు చెప్పేది విను” అంది. అతను, “వింటున్నాను” అన్నాడు. 18  ఆమె ఇలా అంది: “ ‘వాళ్లను ఆబేల్‌ నగరంలో సలహా అడగమనండి’ అని ఒకప్పుడు అంటుండేవాళ్లు. అంతే, సమస్య అక్కడితో పరిష్కారం అయ్యేది. 19  నేను ఇశ్రాయేలులో శాంతియుతమైన, నమ్మకమైన ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. నువ్వు ఇశ్రాయేలులో తల్లిలాంటి ఒక నగరాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. యెహోవా ప్రజల్ని*+ నువ్వు ఎందుకు నాశనం చేయాలి?” 20  అందుకు యోవాబు ఇలా అన్నాడు: “నేను దాన్ని నిర్మూలించి, నాశనం చేయడం అనేది నా ఊహకందని విషయం. 21  అసలు విషయం అది కాదు. ఎఫ్రాయిము పర్వత ప్రాంతానికి+ చెందిన బిక్రి కుమారుడైన షేబ+ దావీదు రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఆ ఒక్కడిని మీరు అప్పగిస్తే, నేను నగరం దగ్గర నుండి వెళ్లిపోతాను.” అప్పుడు ఆ స్త్రీ యోవాబుతో, “ఇదిగో! అతని తలను ప్రాకారం మీద నుండి నీ దగ్గరికి పడేస్తాం!” అని అంది. 22  వెంటనే తెలివిగల ఆ స్త్రీ ప్రజలందరి దగ్గరికి వెళ్లింది. వాళ్లు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గరికి విసిరేశారు. అప్పుడు యోవాబు బూర ఊదాడు. దాంతో ప్రజలు ఆ నగరాన్ని విడిచి తమతమ ఇళ్లకు వెళ్లిపోయారు;+ యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరికి తిరిగొచ్చాడు. 23  యోవాబు ఇశ్రాయేలు సైన్యమంతటి మీద అధిపతిగా ఉన్నాడు;+ యెహోయాదా+ కుమారుడైన బెనాయా+ కెరేతీయులమీద, పెలేతీయులమీద అధికారిగా ఉన్నాడు.+ 24  వెట్టిచాకిరి చేసేవాళ్ల మీద అదోరాము+ అధికారిగా ఉన్నాడు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు,+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు. 25  షెవా కార్యదర్శిగా, సాదోకు,+ అబ్యాతారు+ యాజకులుగా ఉన్నారు. 26  యాయీరీయుడైన ఈరా కూడా దావీదు ముఖ్య అధికారి* అయ్యాడు.

అధస్సూచీలు

లేదా “డేరాల” అయ్యుంటుంది.
అక్ష., “కొమ్ము.”
అక్ష., “స్వాస్థ్యాన్ని.”
అక్ష., “యాజకుడు.”