సమూయేలు రెండో గ్రంథం 24:1-25
24 యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది.+ ఎందుకంటే, “నువ్వు వెళ్లి ఇశ్రాయేలువాళ్లను, యూదావాళ్లను లెక్కపెట్టు”+ అని ఒకరు దావీదును ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉసిగొల్పారు.*+
2 అప్పుడు, దావీదు రాజు తన దగ్గర ఉన్న సైన్యాధిపతి యోవాబుకు+ ఇలా ఆజ్ఞాపించాడు: “దయచేసి నువ్వు దాను నుండి బెయేర్షెబా వరకు+ ఇశ్రాయేలు గోత్రాలన్నిటి గుండా వెళ్లి ప్రజల పేర్లు నమోదు చేయి, ప్రజలు ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది.”
3 అయితే యోవాబు రాజుతో, “ప్రజల్ని నీ దేవుడైన యెహోవా 100 రెట్లు వృద్ధి చేయాలి, నా ప్రభువైన రాజు కళ్లు అది చూడాలి; కానీ నా ప్రభువైన రాజా, నువ్వు ఇలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నావు?” అన్నాడు.
4 కానీ యోవాబు, సైన్యాధిపతుల మాట మీద రాజు మాటే నెగ్గింది. దాంతో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల పేర్లు నమోదు చేయడానికి రాజు ఎదుట నుండి వెళ్లిపోయారు.+
5 వాళ్లు యొర్దాను దాటి అరోయేరులో,+ నగరానికి కుడిపక్కన* లోయ* మధ్యలో మకాం వేసి, గాదీయుల ప్రాంతం వైపు యాజెరు వైపు వెళ్లారు.
6 తర్వాత వాళ్లు గిలాదుకు,+ తహ్తింహోద్షీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుండి వాళ్లు దానాయాను మీదుగా సీదోను+ వైపు తిరిగారు.
7 తర్వాత వాళ్లు తూరు కోటకు, హివ్వీయుల,+ కనానీయుల నగరాలన్నిటికీ వెళ్లి, చివరికి యూదాకు చెందిన నెగెబులోని+ బెయేర్షెబా+ దగ్గర ఆగారు.
8 అలా వాళ్లు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల 20 రోజుల తర్వాత యెరూషలేముకు వచ్చారు.
9 యోవాబు ప్రజల సంఖ్యను దావీదుకు తెలియజేశాడు. కత్తి దూయగలవాళ్లు ఇశ్రాయేలులో 8,00,000 మంది, యూదాలో 5,00,000 మంది ఉన్నారు.+
10 కానీ ప్రజల్ని లెక్కపెట్టిన తర్వాత దావీదు మనస్సాక్షి* అతన్ని గద్దించింది.+ దాంతో దావీదు యెహోవాతో ఇలా అన్నాడు: “నేను ఈ పని చేసి చాలా పెద్ద పాపం చేశాను.+ యెహోవా, నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను; దయచేసి నీ సేవకుని తప్పును క్షమించు.”+
11 ఉదయం దావీదు నిద్రలేచినప్పుడు, దావీదు కోసం దర్శనాలు చూసే గాదు+ ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్యం వచ్చి ఇలా చెప్పింది:
12 “నువ్వు వెళ్లి దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ముందు మూడు విషయాలు పెడుతున్నాను. వాటిలో ఏది నీమీదికి తీసుకురమ్మంటావో చెప్పు.” ’ ”+
13 దాంతో గాదు దావీదు దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “నీ దేశం మీదికి ఏడు సంవత్సరాలు కరువు రావాలా?+ లేదా నీ శత్రువులు నిన్ను తరుముతుంటే నువ్వు మూడు నెలలు పారిపోతావా?+ లేదా నీ దేశంలో మూడు రోజులు తెగులు రావాలా?+ నన్ను పంపించిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు.”
14 అప్పుడు దావీదు గాదుతో ఇలా అన్నాడు: “నేను పెద్ద చిక్కులో పడ్డాను. అయితే మనుషుల చేతిలో పడడం+ కన్నా యెహోవా చేతిలో పడడమే మనకు మంచిది,+ ఎందుకంటే ఆయన ఎంతో కరుణగల దేవుడు.”+
15 అప్పుడు యెహోవా ఉదయం నుండి నిర్ణీత సమయం వరకు ఇశ్రాయేలు మీద తెగులు రప్పించాడు.+ దాంతో దాను నుండి బెయేర్షెబా వరకు+ 70,000 మంది చనిపోయారు.+
16 దేవదూత యెరూషలేమును నాశనం చేయడానికి దానివైపు తన చెయ్యి చాపినప్పుడు, యెహోవా విపత్తు విషయంలో దుఃఖపడ్డాడు.*+ అప్పుడు ప్రజల్లో నాశనం కలిగిస్తున్న దూతతో ఆయన, “చాలు! నీ చెయ్యి దించు” అన్నాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన+ అరౌనా కళ్లం+ దగ్గర ఉన్నాడు.
17 ప్రజల్ని హతం చేస్తున్న దేవదూతను దావీదు చూసినప్పుడు, అతను యెహోవాతో ఇలా అన్నాడు: “పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను; కానీ గొర్రెల్లాంటి+ వీళ్లేం చేశారు? దయచేసి నీ చెయ్యి నా మీదికి, నా తండ్రి ఇంటివాళ్ల మీదికి రానివ్వు.”+
18 కాబట్టి ఆ రోజు గాదు దావీదు దగ్గరికి వచ్చి, “నువ్వు లేచి యెబూసీయుడైన అరౌనా కళ్లంలో యెహోవా కోసం ఒక బలిపీఠం కట్టు”+ అని చెప్పాడు.
19 దాంతో దావీదు, గాదు ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టు అక్కడికి వెళ్లాడు.
20 రాజు, అతని సేవకులు తన దగ్గరికి రావడం చూసి అరౌనా వెంటనే బయటికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడ్డాడు.
21 అరౌనా దావీదును, “నా ప్రభువైన రాజు తన సేవకుని దగ్గరికి ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. దానికి దావీదు, “నేను నీ కళ్లాన్ని కొనడానికి వచ్చాను. ప్రజల మీదికి వచ్చిన తెగులు ఆగిపోయేలా+ నేను ఇక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాలి” అన్నాడు.
22 కానీ అరౌనా దావీదుతో ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, దీన్ని తీసుకొని నీకు ఏది మంచిదనిపిస్తే అది అర్పించు. ఇదిగో, దహనబలి కోసం ఎద్దులు, కట్టెల కోసం నూర్చే పనిముట్టు, పశువుల కాడి ఇక్కడ ఉన్నాయి.
23 రాజా, అరౌనా అనే నేను వీటన్నిటినీ రాజుకు ఇస్తున్నాను.” తర్వాత అరౌనా రాజుతో ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా నీ మీద అనుగ్రహం చూపించాలి.”
24 అయితే రాజు అరౌనాతో, “అలాకాదు, నేను దాన్ని వెల ఇచ్చి కొనాల్సిందే. వెల ఇవ్వకుండా తీసుకున్న* వాటిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలులుగా అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు కళ్లాన్ని, పశువుల్ని 50 షెకెల్‌ల* వెండి ఇచ్చి కొన్నాడు.+
25 దావీదు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి+ దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించాడు. అప్పుడు దేశం కోసం వాళ్లు చేసిన విన్నపాల్ని యెహోవా విన్నాడు.+ దాంతో ఇశ్రాయేలు మీదికి వచ్చిన తెగులు ఆగిపోయింది.
అధస్సూచీలు
^ లేదా “దావీదు ఉసిగొల్పబడ్డాడు.”
^ లేదా “దక్షిణాన.”
^ లేదా “వాగు.”
^ లేదా “హృదయం.”
^ లేదా “విచారపడ్డాడు.”
^ లేదా “నాకు ఏ ఖర్చూ అవ్వని.”
^ అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.