సమూయేలు రెండో గ్రంథం 3:1-39

  • దావీదు ఇంటివాళ్లు బలం పుంజుకున్నారు (1)

  • దావీదు కుమారులు (2-5)

  • అబ్నేరు దావీదు పక్షాన చేరడం (6-21)

  • యోవాబు అబ్నేరును చంపడం (22-30)

  • దావీదు అబ్నేరు గురించి ఏడ్వడం (31-39)

3  సౌలు ఇంటివాళ్లకు, దావీదు ఇంటివాళ్లకు మధ్య చాలాకాలం యుద్ధం కొనసాగింది; దావీదు అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉన్నాడు,+ సౌలు ఇంటివాళ్లు మెల్లమెల్లగా బలహీనమౌతూ ఉన్నారు.+  ఈలోగా, హెబ్రోనులో దావీదుకు కుమారులు పుట్టారు.+ అతని మొదటి కుమారుడు అమ్నోను,+ అతను యెజ్రెయేలుకు చెందిన అహీనోయము+ ద్వారా పుట్టాడు.  రెండో కుమారుడు కిల్యాబు, అతను చనిపోయిన కర్మెలువాసి అయిన నాబాలు భార్య అబీగయీలు+ ద్వారా పుట్టాడు; మూడో కుమారుడు అబ్షాలోము,+ అతను గెషూరు రాజైన తల్మయి+ కూతురు మయకా ద్వారా పుట్టాడు.  నాలుగో కుమారుడు అదోనీయా, అతను హగ్గీతు ద్వారా పుట్టాడు.+ ఐదో కుమారుడు షెఫట్య, అతను అబీటలు ద్వారా పుట్టాడు.  ఆరో కుమారుడు ఇత్రెయాము, అతను దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టాడు. వీళ్లు దావీదుకు హెబ్రోనులో పుట్టారు.  సౌలు ఇంటివాళ్లకు, దావీదు ఇంటివాళ్లకు మధ్య యుద్ధం కొనసాగుతూ ఉండగా, సౌలు ఇంటివాళ్లలో అబ్నేరు+ తన స్థానాన్ని బలపర్చుకుంటూ ఉన్నాడు.  సౌలుకు రిస్పా+ అనే ఉపపత్ని ఉండేది. ఆమె అయ్యా కూతురు. తర్వాత ఇష్బోషెతు+ అబ్నేరును, “నా తండ్రి ఉపపత్నితో నువ్వు ఎందుకు సంబంధం పెట్టుకున్నావు?”+ అని అడిగాడు.  ఇష్బోషెతు మాటలకు అబ్నేరుకు చాలా కోపం వచ్చి ఇలా అన్నాడు: “నేనేమైనా యూదా కుక్కనా?* ఈ రోజు వరకు నేను నీ తండ్రైన సౌలు ఇంటివాళ్లమీద, అతని సహోదరుల మీద, అతని స్నేహితుల మీద విశ్వసనీయ ప్రేమ చూపించాను. నేను నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు; అలాంటిది ఈ రోజు ఒక స్త్రీ విషయంలో చేసిన తప్పు గురించి నువ్వు నన్ను లెక్క అడుగుతున్నావా?  యెహోవా దావీదుకు ప్రమాణం చేసినట్టే నేను అతనికి జరిగించకపోతే, దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి.+ 10  ఆయన సౌలు ఇంటివాళ్ల నుండి రాజ్యాన్ని తీసేస్తానని, దాను నుండి బెయేర్షెబా వరకు+ ఇశ్రాయేలు మీద, యూదా మీద దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని దావీదుకు వాగ్దానం చేశాడు.” 11  ఇష్బోషెతు అబ్నేరుకు భయపడ్డాడు కాబట్టి అతను ఇంకొక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు.+ 12  అబ్నేరు వెంటనే సందేశకుల ద్వారా దావీదుకు ఈ కబురు పంపించాడు: “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం* చేయి. ఇశ్రాయేలు మొత్తాన్ని నీవైపు తిప్పడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను.”+ 13  దానికి దావీదు ఇలా అన్నాడు: “మంచిది! నేను నీతో ఒప్పందం చేస్తాను. కానీ నేను నిన్ను అడిగేది ఒక్కటే, నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కూతురు మీకాలును+ తీసుకురా. లేకపోతే నా ముఖం చూసే ప్రయత్నం చేయొద్దు.” 14  తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్బోషెతు+ దగ్గరికి సందేశకుల్ని పంపించి ఇలా చెప్పాడు: “నా భార్య మీకాలును నాకు ఇవ్వు. ఫిలిష్తీయుల 100 ముందోళ్లు* ఇచ్చి తనతో నా పెళ్లి నిశ్చయం చేసుకున్నాను.”+ 15  దాంతో ఇష్బోషెతు మీకాలు భర్తా, లాయిషు కుమారుడూ అయిన పల్తీయేలు+ దగ్గర నుండి మీకాలును తీసుకురావడానికి మనుషుల్ని పంపించాడు. 16  కానీ ఆమె భర్త ఆమెతోపాటు నడుస్తూ, ఏడుస్తూ ఆమె వెనకాలే బహూరీము+ దాకా వచ్చాడు. అప్పుడు అబ్నేరు అతనితో, “వెనక్కి వెళ్లు!” అన్నాడు. దాంతో అతను వెనక్కి వెళ్లిపోయాడు. 17  ఈలోగా, అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలకు ఈ కబురు పంపించాడు: “దావీదు మీ మీద రాజుగా ఉండాలని కొంతకాలం నుండి మీరు కోరుకుంటున్నారు. 18  మీరు ఇప్పుడే చర్య తీసుకోండి. ఎందుకంటే యెహోవా దావీదుతో ఇలా అన్నాడు: ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నా సేవకుడైన దావీదు+ చేతి ద్వారా ఫిలిష్తీయుల చేతిలో నుండి, వాళ్ల శత్రువులందరి చేతిలో నుండి నేను కాపాడతాను.’ ” 19  తర్వాత అబ్నేరు బెన్యామీనువాళ్లతో+ మాట్లాడాడు. అతను ఇశ్రాయేలు ప్రజలు, బెన్యామీను వంశస్థులందరూ ఏకీభవించిన విషయాన్ని హెబ్రోనులో ఉన్న దావీదుకు వ్యక్తిగతంగా చెప్పడానికి దావీదు దగ్గరికి వెళ్లాడు. 20  అబ్నేరు 20 మందితో కలిసి దావీదును కలవడానికి హెబ్రోనుకు వచ్చినప్పుడు, దావీదు అబ్నేరుకు, అతనితో ఉన్న మనుషులకు విందు ఏర్పాటు చేశాడు. 21  తర్వాత అబ్నేరు దావీదుతో, “నేను వెళ్లి ఇశ్రాయేలీయులందరూ నీతో ఒప్పందం చేసేలా వాళ్లను ఒక దగ్గర సమకూరుస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్న వాటన్నిటి మీద నువ్వు రాజువు అవుతావు” అన్నాడు. దాంతో దావీదు అబ్నేరును పంపించాడు. అతను క్షేమంగా తన దారిన వెళ్లిపోయాడు. 22  సరిగ్గా అప్పుడే, దావీదు సేవకులు, అలాగే యోవాబు దోపిడీ చేసి తిరిగొచ్చారు, వాళ్లు తమ వెంట పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకొచ్చారు. ఆ సమయానికి అబ్నేరు దావీదుతో హెబ్రోనులో లేడు. ఎందుకంటే దావీదు అతన్ని తన దారిన క్షేమంగా పంపించాడు. 23  యోవాబు,+ అతనితో ఉన్న సైన్యమంతా వచ్చినప్పుడు, యోవాబుకు ఇలా చెప్పారు: “నేరు+ కుమారుడైన అబ్నేరు+ రాజు దగ్గరికి వచ్చాడు, రాజు అతన్ని పంపించేశాడు, అతను క్షేమంగా తన దారిన వెళ్లిపోయాడు.” 24  దాంతో యోవాబు రాజు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “నువ్వు చేసిందేమిటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అతన్ని ఏమీ చేయకుండా ఎందుకు వెళ్లనిచ్చావు? 25  నేరు కుమారుడైన అబ్నేరు ఎలాంటివాడో నీకు తెలుసు కదా! నిన్ను మోసం చేసి నీ ప్రతీ కదలికను తెలుసుకోవడానికి, నువ్వు చేస్తున్నవన్నీ తెలుసుకోవడానికే అతను ఇక్కడికి వచ్చాడు.” 26  తర్వాత యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లిపోయి అబ్నేరును తీసుకురావడానికి సందేశకుల్ని పంపించాడు. వాళ్లు అతన్ని సిరా బావి దగ్గర నుండి వెనక్కి తీసుకొచ్చారు; కానీ దావీదుకు దాని గురించి ఏమీ తెలీదు. 27  అబ్నేరు హెబ్రోనుకు తిరిగొచ్చిన తర్వాత,+ యోవాబు అతనితో ఒంటరిగా మాట్లాడడానికి ద్వారం లోపల ఒక పక్కకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ యోవాబు అబ్నేరును పొత్తికడుపులో పొడవడంతో అతను చనిపోయాడు;+ తన సహోదరుడైన అశాహేలును చంపినందుకు అతనలా చేశాడు.+ 28  ఆ తర్వాత దాని గురించి విన్నప్పుడు దావీదు ఇలా అన్నాడు: “నేరు కుమారుడైన అబ్నేరు మరణం విషయంలో నేనూ, నా రాజ్యం ఎప్పటికీ నిర్దోషులమని యెహోవాకు తెలుసు.+ 29  ఆ దోషం యోవాబు తలమీదికి,+ అతని తండ్రి ఇంటివాళ్లందరి మీదికి రావాలి. యోవాబు ఇంట్లో స్రావంతో బాధపడేవాడు+ గానీ, కుష్ఠురోగి+ గానీ, నూలు వడికేవాడు* గానీ, కత్తివాత వల్ల చనిపోయేవాడు గానీ, ఆహారంలేనివాడు+ గానీ ఎప్పటికీ ఉండాలి!” 30  గిబియోను దగ్గర జరిగిన యుద్ధంలో+ అబ్నేరు+ తమ సహోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు, అతని సహోదరుడు అబీషై+ అతన్ని చంపారు. 31  తర్వాత దావీదు యోవాబుతో, అలాగే అతనితో ఉన్న ప్రజలందరితో, “మీ బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకుని అబ్నేరు గురించి ఏడ్వండి” అన్నాడు. దావీదు రాజు స్వయంగా పాడె వెనక నడుచుకుంటూ వెళ్లాడు. 32  వాళ్లు అబ్నేరును హెబ్రోనులో సమాధి చేశారు; అబ్నేరు సమాధి దగ్గర రాజు పెద్దగా ఏడ్చాడు, ప్రజలందరూ ఏడ్చారు. 33  రాజు అబ్నేరు గురించి ఇలా శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక మూర్ఖుడిలా చనిపోవాలా? 34  నీ చేతులు కట్టేయబడలేదు,నీ పాదాలకు సంకెళ్లు వేయబడలేదు. నేరస్తుల ఎదుట ఒకడు చనిపోయినట్టు నువ్వు చనిపోయావు.”+ అప్పుడు ప్రజలందరూ అతని గురించి మళ్లీ ఏడ్చారు. 35  తర్వాత, ఇంకా వెలుతురు ఉండగానే ప్రజలందరూ దావీదుకు ఓదార్పు రొట్టె* ఇవ్వడానికి వచ్చారు; కానీ దావీదు, “సూర్యాస్తమయానికి ముందు నేను రొట్టెనైనా, మరేదైనా రుచిచూస్తే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి!”+ అని ప్రమాణం చేశాడు. 36  ప్రజలందరూ అది గమనించారు, వాళ్లకు అది నచ్చింది. రాజు చేసినవన్నీ నచ్చినట్టే ఇది కూడా ప్రజలందరికీ నచ్చింది. 37  కాబట్టి నేరు కుమారుడైన అబ్నేరు చంపబడడానికి రాజు బాధ్యుడు కాదని+ ఆ రోజు ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులందరికీ తెలిసింది. 38  అప్పుడు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “ఈ రోజు ఇశ్రాయేలులో ఒక అధిపతి, ఒక గొప్ప వ్యక్తి చనిపోయాడని మీకు తెలీదా?+ 39  నేను రాజుగా అభిషేకించబడినా+ ఈ రోజు బలహీనంగా ఉన్నాను. ఈ మనుషులు, అంటే సెరూయా కుమారులు+ నా విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించారు.+ చెడు చేసిన వ్యక్తిని అతని చెడుతనాన్ని బట్టి యెహోవా శిక్షించాలి.”+

అధస్సూచీలు

అక్ష., “కుక్క తలనా?”
లేదా “నిబంధన.”
అంటే, పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మం.
బహుశా స్త్రీలు చేసే పని చేయాల్సివచ్చే అవిటివాడిని సూచిస్తుండవచ్చు.
లేదా “దుఃఖపు రొట్టె.”