సమూయేలు రెండో గ్రంథం 9:1-13
-
మెఫీబోషెతు పట్ల దావీదు విశ్వసనీయ ప్రేమ (1-13)
9 తర్వాత దావీదు ఇలా అడిగాడు: “యోనాతానును బట్టి నేను విశ్వసనీయ ప్రేమ చూపించేలా సౌలు ఇంటివాళ్లలో ఇంకా ఎవరైనా మిగిలివున్నారా?”+
2 సౌలు కుటుంబానికి సీబా+ అనే ఒక సేవకుడు ఉండేవాడు. వాళ్లు అతన్ని దావీదు దగ్గరికి పిలిపించారు. రాజు అతన్ని, “సీబా అంటే నువ్వేనా?” అని అడిగాడు. అతను, “నీ సేవకుడినైన నేనే అతన్ని” అని చెప్పాడు.
3 రాజు అతన్ని, “నేను దేవుని లాంటి విశ్వసనీయ ప్రేమ చూపించేలా సౌలు ఇంటివాళ్లలో ఇంకా ఎవరైనా మిగిలివున్నారా?” అని అడిగాడు. దానికి సీబా, “యోనాతాను కుమారుడు ఒకతను ఇంకా ఉన్నాడు; అతని రెండు కాళ్లూ కుంటివి”+ అని రాజుకు జవాబిచ్చాడు.
4 రాజు, “అతను ఎక్కడున్నాడు?” అని అడిగాడు. దానికి సీబా, “అతను లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు+ ఇంట్లో ఉన్నాడు” అని రాజుకు చెప్పాడు.
5 దావీదు రాజు వెంటనే అతని కోసం మనుషుల్ని పంపించి, లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు.
6 సౌలు మనవడూ యోనాతాను కుమారుడూ అయిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి రాగానే అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు, “మెఫీబోషెతు!” అని పిలిచాడు. దానికి అతను, “ఇదిగో నీ సేవకుడు” అన్నాడు.
7 దావీదు అతనితో, “భయపడకు, నేను నీ తండ్రి యోనాతానును బట్టి తప్పకుండా నీ మీద విశ్వసనీయ ప్రేమ+ చూపిస్తాను, నీ తాత సౌలుకు చెందిన భూములన్నీ నీకు తిరిగి ఇప్పిస్తాను, నువ్వు ఎప్పుడూ నా బల్ల దగ్గర భోజనం చేస్తావు”+ అన్నాడు.
8 అప్పుడు మెఫీబోషెతు సాష్టాంగపడి, “చచ్చిన కుక్కలాంటి+ నామీద నువ్వు దయ చూపించడానికి నీ సేవకుడు ఎంతటివాడు?” అని అన్నాడు.
9 రాజైన దావీదు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి ఇలా చెప్పాడు: “సౌలుకూ, అతని ఇల్లంతటికీ చెందినవన్నీ నేను నీ యజమాని మనవడికి ఇస్తున్నాను.+
10 నువ్వు, నీ కుమారులు, నీ సేవకులు అతని కోసం భూమిని సాగుచేయాలి. నీ యజమాని మనవడికి చెందినవాళ్ల పోషణ కోసం నువ్వు దాని పంటను తీసుకురావాలి. కానీ నీ యజమాని మనవడైన మెఫీబోషెతు మాత్రం ఎప్పుడూ నా బల్ల దగ్గర భోజనం చేస్తాడు.”+
సీబాకు 15 మంది కుమారులు, 20 మంది సేవకులు ఉన్నారు.+
11 అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు నీ సేవకునికి ఆజ్ఞాపించినదంతా నీ సేవకుడు చేస్తాడు” అని రాజుతో అన్నాడు. దాంతో మెఫీబోషెతు, రాజు కుమారుల్లో ఒకడిలా దావీదు* బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
12 అంతేకాదు, మెఫీబోషెతుకు మీకా+ అనే ఒక చిన్న బాబు ఉన్నాడు; సీబా ఇంట్లో ఉన్నవాళ్లంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు.
13 మెఫీబోషెతు ఎప్పుడూ దావీదు రాజు బల్ల దగ్గర భోజనం చేసేవాడు+ కాబట్టి అతను యెరూషలేములో ఉండేవాడు; అతని రెండు కాళ్లూ కుంటివి.+
అధస్సూచీలు
^ లేదా “నా” అయ్యుంటుంది.