మన క్రైస్తవ జీవితం
లోకాంతాన్ని తప్పించుకుంటాం అనే ధైర్యంతో ఉందాం
ఈ చెడ్డలోకం విషయంలో యెహోవా ఓపిక త్వరలో నశించిపోతుంది. అబద్ధమతం నాశనమౌతుంది, దేశాల గుంపు దేవుని ప్రజలమీద దాడిచేస్తుంది, హార్‌మెగిద్దోన్‌లో చెడ్డవాళ్లందర్నీ యెహోవా నాశనం చేస్తాడు. ఈ ముఖ్యమైన సంఘటనల కోసం క్రైస్తవులమైన మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
అయితే, మహాశ్రమ గురించి మనకు అన్ని వివరాలూ తెలియవు. ఉదాహరణకు అది సరిగ్గా ఎప్పుడు మొదలౌతుందో మనకు తెలీదు. ప్రభుత్వాలు ఏ కారణాలతో మతం మీద దాడిచేస్తాయో మనకు తెలీదు. దేశాలు దేవుని ప్రజల మీద ఎంతకాలం దాడిచేస్తాయో లేదా ఎలా దాడి చేస్తాయో మనకు తెలీదు. హార్‌మెగిద్దోన్‌లో యెహోవా చెడ్డవాళ్లను ఏ విధంగా నాశనం చేస్తాడో కూడా మనకు తెలీదు.
అయితే భవిష్యత్తు కోసం నమ్మకంగా, ధైర్యంగా సిద్ధపడడానికి మనకు అవసరమయ్యే సమాచారమంతా లేఖనాల్లో ఉంది. ఉదాహరణకు, మనం “చివరి రోజుల” ముగింపులో జీవిస్తున్నామని మనకు తెలుసు. (2తి 3:1) సత్యమతం నాశనం అవ్వకుండా ఉండడానికి, అబద్ధమతం మీద జరిగేదాడి “తగ్గించబడుతుంది” అని మనకు తెలుసు. (మత్త 24:22) యెహోవా తన ప్రజల్ని కాపాడతాడని మనకు తెలుసు. (2పే 2:9) హార్‌మెగిద్దోన్‌లో చెడ్డవాళ్లను నాశనం చేసి, గొప్ప సమూహాన్ని రక్షించడానికి యెహోవా ఎంచుకున్న వ్యక్తి నీతిమంతుడు, శక్తిమంతుడు అని కూడా మనకు తెలుసు.—ప్రక 19:11, 15, 16.
భవిష్యత్తులో జరిగే ఈ సంఘటనల వల్ల ప్రజలు భయపడి “సొమ్మసిల్లుతారు.” కానీ మనం మాత్రం యెహోవా గతంలో తన ప్రజల్ని ఎలా కాపాడాడో, భవిష్యత్తు గురించి ఆయన ఏం చెప్పాడో చదివి, ధ్యానించినప్పుడు మన విడుదల దగ్గరపడిందనే ధైర్యంతో ‘స్థిరంగా నిలబడి [మన] తలలు ఎత్తుకుంటాం.’—లూకా 21:26, 28.