కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

విపత్తు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?

విపత్తు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?

ప్రకృతి విపత్తులు రోజురోజుకు ఎక్కువౌతున్నాయి. కాబట్టి విపత్తు బారినపడిన వాళ్లకు సహాయం సరిగ్గా అందాలంటే, ఆ పనుల్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం అవసరం. అందుకే పరిపాలక సభ ప్రతీ బ్రాంచి కార్యాలయంలో విపత్తు సహాయక డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది.

ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌లోని సహోదరులు వెంటనే స్థానిక పెద్దలతో మాట్లాడతారు, ప్రచారకులకు ఏయే విషయాల్లో సహాయం అవసరమో తెలుసుకుంటారు. విపత్తు వల్ల భారీ నష్టం జరిగి, సహాయక పనుల్ని స్థానిక ప్రచారకులు సొంతగా చేసుకోలేకపోతే, బ్రాంచి కార్యాలయం ఆ పనుల్ని చూసుకోవడానికి కొంతమంది సహోదరుల్ని నియమిస్తుంది. ఆ సహోదరులు వాలంటీర్ల సహాయం తీసుకుంటారు, ప్రచారకులకు అవసరమైన వాటిని ఎవరైనా విరాళంగా ఇస్తారేమో కనుక్కుంటారు లేదా వాటిని కొని పంచిపెడతారు.

విపత్తు సహాయక పనుల్ని ఒక క్రమపద్ధతిలో చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కానీ అలా కాకుండా వేర్వేరు సహోదరులు సొంతగా చొరవ తీసుకుని సహాయక పనుల కోసం ఏర్పాట్లు చేస్తే, వాళ్లకు తెలీకుండా వేరే సహోదరులు కూడా వాళ్లలాగే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల గందరగోళం ఏర్పడవచ్చు, విరాళాలు అలాగే ఇతర అవసరమైన వస్తువులు వృథా అవ్వవచ్చు.

బ్రాంచి నియమించిన సహోదరులు విపత్తు సహాయక పనుల కోసం ఎంత డబ్బు కావాలో, ఎంతమంది వాలంటీర్లు కావాలో సరిగ్గా అంచనా వేయగలుగుతారు. అలాగే స్థానిక అధికారులతో మాట్లాడి, వాళ్ల సహాయంతో పనుల్ని ఇంకా వేగంగా చేయగలుగుతారు. కాబట్టి ఎవ్వరూ వాళ్లంతట వాళ్లే చొరవ తీసుకుని విరాళాలు సేకరించకూడదు, అవసరమైన వాటిని పంపించకూడదు, లేదా విపత్తు వచ్చిన చోటుకు వెళ్లకూడదు. బ్రాంచి నియమించిన సహోదరులు ఎవరికి ఆ పనులు అప్పగిస్తారో వాళ్లు మాత్రమే అవి చేయాలి.

మనం సహోదరుల్ని ప్రేమిస్తాం కాబట్టి, విపత్తు వచ్చినప్పుడు వాళ్లకు ఏదోక విధంగా సహాయం చేయాలని కోరుకుంటాం. (హెబ్రీ 13:16) మరి మనం ఎలా సహాయం చేయవచ్చు? అన్నిటికన్నా ముఖ్యంగా విపత్తు బారినపడిన వాళ్ల కోసం, వాళ్లకు సహాయం చేస్తున్న వాళ్ల కోసం మనం ప్రార్థన చేయవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు ఇవ్వవచ్చు. పరిపాలక సభ నిర్దేశాల ప్రకారం, ఈ విరాళాల్ని ఎలా ఉపయోగించడం మంచిదో బ్రాంచి కార్యాలయాలకు తెలుసు. మీకు విపత్తు సహాయక పనుల్లో పాల్గొనాలనే కోరిక ఉంటే, లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ వాలెంటీర్‌ అప్లికేషన్‌ (DC-50) నింపండి.

బ్రెజిల్‌లో భారీగా వచ్చిన వరదలు వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

2020 లో, బ్రెజిల్‌లో వరదలు వచ్చినప్పుడు, యెహోవాసాక్షులు చేసిన విపత్తు సహాయక పనుల్ని చూసి మీకు ఏమనిపిస్తుంది?