కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి

మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి

దృశ్య సహాయకాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి, అవి నేర్చుకున్న విషయాల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తాయి. మన మహాగొప్ప బోధకుడైన యెహోవా కూడా ప్రాముఖ్యమైన పాఠాల్ని బోధించేటప్పుడు దృశ్య సహాయకాలు ఉపయోగించాడు. (ఆది 15:5; యిర్మీ 18:1-6) గొప్ప బోధకుడైన యేసు కూడా వాటిని ఉపయోగించాడు. (మత్త 18:2-6; 22:19-21) ఈ మధ్యకాలంలో బాగా ఉపయోగపడుతున్న ఒక దృశ్య సహాయకం, వీడియోలు. మీ బైబిలు విద్యార్థులకు బోధించేటప్పుడు వీడియోలను చక్కగా ఉపయోగిస్తున్నారా?

దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురులోని పాఠాలను బోధించేలా సహాయం చేయడానికి పది వీడియోలను తయారు చేశారు. సాధారణంగా ప్రతీ వీడియో పేరును బ్రోషురులో ముద్దక్షరాల్లో ఉన్న ఒక ప్రశ్న నుండి తీసుకున్నారు. మీరు వెబ్‌సైట్‌లో ఈ బ్రోషురును చూస్తే ఆ వీడియోలకు సంబంధించిన లింకులు కూడా ఉంటాయి. అవి వాటిని ఎప్పుడు చూపించాలో మనకు గుర్తుచేస్తాయి. అంతేకాదు “బోధనా పనిముట్లు” అనే భాగంలో ఉన్న రకరకాల బైబిలు స్టడీ ప్రచురణలకు సంబంధించిన ఇంకొన్ని వీడియోలు కూడా ఉన్నాయి.

మీ విద్యార్థి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఒక బైబిలు అంశాన్ని మీరు చర్చిస్తున్నారా? లేదా మీ విద్యార్థి విశ్వాసానికి సంబంధించి ఏదైనా పరీక్ష ఎదుర్కొంటున్నాడా? అప్పుడు jw.org®లో, JW బ్రాడ్‌కాస్టింగ్‌®లో ఉన్న వీడియోల్లో ఏ వీడియో మీ విద్యార్థికి ఉపయోగపడుతుందో చూడండి. వీలైతే మీ విద్యార్థితోపాటు ఆ వీడియో చూసి, చర్చించండి.

ప్రతీ నెల కొత్తకొత్త వీడియోలు వస్తున్నాయి. మీరు వాటిని చూస్తున్నప్పుడు, ఇతరులకు బోధించడానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి.