కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

mustafahacalaki/DigitalVision Vectors via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరమా, శాపమా?—బైబిలు అభిప్రాయం ఏంటి?

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరమా, శాపమా?—బైబిలు అభిప్రాయం ఏంటి?

 ఈమధ్యే ప్రపంచ నాయకులు, సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు (కృత్రిమ మేధస్సుకు) ఉన్న శక్తి గురించి మాట్లాడారు. వాళ్లు దాని విలువ గురించి చెప్తూనే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

  •   ‘రానున్న యుగమంతా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌దే (Artificial Intelligence). అది ప్రజల జీవితంలో కొత్త వెలుగును నింపబోతుంది. కానీ అదే ఏఐ (AI) టెక్నాలజీ ప్రజల భద్రతకు ఒక పెద్ద ముప్పుగా మారనుంది. అది వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, వాళ్ల హక్కులకు భంగం కలిగిస్తుంది. అంతేకాదు ప్రజాస్వామ్యం మీద వాళ్లకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని చెరిపేస్తుంది.’—కమలా హ్యారీస్‌, వైస్‌ప్రెసిడెంట్‌ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌, మే 4, 2023.

  •   డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఉన్న ఒక అంతర్జాతీయ గుంపుకు నాయకుడైన డా. ఫ్రెడ్రిక్‌ ఫిడెస్పిల్‌ BMJ గ్లోబల్‌ హెల్త్‌ a అనే ఆన్‌లైన్‌ పత్రికలో 2023, మే 9న వచ్చిన ఒక ఆర్టికల్‌లో ఇలా రాశాడు: ‘ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తోంది.’

  •   ‘ఇప్పటికే ప్రజలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఏఐని పావులా వాడుకుంటున్నారు. త్వరలో అది ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టబోతుంది. అంతేకాదు, అది మానవ మనుగడకు ముందుముందు ఏ ప్రమాదం తీసుకొస్తుందో అని టెక్నాలజీ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.’—ద న్యూయార్క్‌ టైమ్స్‌, మే 1, 2023.

 ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మంచి చేస్తుందో, చెడు చేస్తుందో కాలమే చెప్పాలి. అయితే బైబిలు దీనిగురించి ఏం చెప్తుంది?

మనుషుల ప్రయత్నాలు ఎందుకు మంచికి, చెడుకు మధ్య ఊగిసలాడుతున్నాయి?

 టెక్నాలజీలో వచ్చే కొత్త ఆవిష్కరణల్ని మనుషులు మంచికే ఉపయోగిస్తారనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బైబిలు చెప్తుంది.

  1.  1. మనుషులు కొన్నిటిని మంచి ఉద్దేశంతో కనిపెట్టినా, దానివల్ల పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టలేరు.

    •   “ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.”—సామెతలు 14:12.

  2.  2. ఒక వ్యక్తి కనిపెట్టిన దాన్ని ప్రజలు మంచికి వాడతారా, చెడుకు వాడతారా అనేది అతని చేతుల్లో ఉండదు.

    •   “నా తర్వాత వచ్చేవాడికి నేను వాటన్నిటినీ విడిచి వెళ్లాలి. ఆ వచ్చేవాడు తెలివిగలవాడో, మూర్ఖుడో ఎవరికి తెలుసు? అయినాసరే, సూర్యుని కింద నేను ఎంతో కష్టపడి, తెలివితో సంపాదించుకున్నవన్నీ అతని సొంతమౌతాయి. అది కూడా వ్యర్థమే.”—ప్రసంగి 2:18, 19.

 ఈ ఊగిసలాటను చూస్తుంటే మన సృష్టికర్త నిర్దేశం మనకు ఎందుకు అవసరమో అర్థమౌతుంది.

ఆ ఊగిసలాటకు ముగింపు ఏంటి?

 ఏ మనిషి గానీ ఏ టెక్నాలజీ గానీ భూమిని నాశనం చేయడానికి అనుమతించనని సృష్టికర్త మాటిస్తున్నాడు.

  •   “భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది.”—ప్రసంగి 1:4.

  •   “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29.

 సృష్టికర్త మనల్ని బైబిలు ద్వారా శాంతిభద్రతల వైపు నడిపిస్తానని చెప్తున్నాడు. దానిగురించి ఎక్కువ తెలుసుకోవడానికి “మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?” అలాగే “మంచిరోజులు వస్తాయని నిజమైన ఆశ” (ఇంగ్లీష్‌) ఆర్టికల్స్‌ చూడండి.

a ఫ్రెడ్రిక్‌ ఫిడెస్పిల్‌, రూత్‌ మిషల్‌, ఆశా అసోకన్‌, కార్లోస్‌ ఉమానా అలాగే డేవిడ్‌ మ్యాకోయ్‌ రాసిన “ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మనుషుల ఆరోగ్యానికి, మనుగడకు ముప్పు” అనే ఆర్టికల్‌లో నుండి తీసుకున్నవి.