కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

kovop58/stock.adobe.com

అప్రమత్తంగా ఉండండి!

ఒలింపిక్‌ పోటీలు మనుషుల్ని నిజంగా ఐక్యం చేస్తాయంటారా?—బైబిలు ఏం చెప్తుంది?

ఒలింపిక్‌ పోటీలు మనుషుల్ని నిజంగా ఐక్యం చేస్తాయంటారా?—బైబిలు ఏం చెప్తుంది?

 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో 206 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్లమంది చూస్తారని అంచనా. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ఇలా అన్నాడు: ‘ఇవి లోకంలో శాంతిని, ఐక్యతను తీసుకొచ్చే పోటీలు. ఎన్ని తేడాలు ఉన్నా మనుషులందరం ఒక్కటే కాబట్టి ఐక్యంగా ఉంటూ, శాంతిగా జీవించాలనే ఒలింపిక్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.’

 అయితే ఒలింపిక్స్‌ వల్ల అది నిజంగా సాధ్యమౌతుందా? శాంతి-ఐక్యతల్ని మనం ఎప్పటికైనా చూస్తామా?

ఒలింపిక్‌ పోటీలు శాంతి-ఐక్యతల్ని తీసుకురాగలవా?

 ఈ సంవత్సరం ఒలింపిక్స్‌, ఆటలతోపాటు ప్రజల మధ్య అడ్డుగోడలుగా ఉన్న కొన్ని సామాజిక, రాజకీయ అంశాల్ని కూడా తెరమీదికి తీసుకొచ్చింది. ముఖ్యంగా మానవ హక్కుల సమస్యలు, జాతి విద్వేషాలు, మత వివక్ష వంటి అన్యాయాల్ని ఎత్తి చూపించింది.

 ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ ఆటల పోటీలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. అయితే ఇవి ప్రజల ఆలోచనలు, పనులు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా బయటపెడతాయి. దానివల్ల శాంతి-ఐక్యతలు కాకుండా మనుషుల మధ్య దూరాలు పెరుగుతుంటాయి.

 నేడు మనుషుల మధ్య ఐక్యతను పాడు చేస్తున్న రకరకాల ఆలోచనలు, ప్రవర్తనల గురించి బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?” అనే ఆర్టికల్‌ చదవండి.

మరి ప్రపంచంలో శాంతి-ఐక్యతలు ఎలా వస్తాయి?

 అవి నిజంగా ఎలా వస్తాయో బైబిలు చెప్తుంది. భూమ్మీదున్న మనుషులందర్నీ ఐక్యం చేసే ఒక ప్రభుత్వం వస్తుందని అది మాటిస్తోంది. బైబిలు ఆ ప్రభుత్వాన్ని పరలోకంలో ఉండే “దేవుని రాజ్యం” అని పిలుస్తుంది.—లూకా 4:43; మత్తయి 6:10.

 ఆ రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు, ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకొస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది:

  •   “నీతిమంతులు వర్ధిల్లుతారు, … శాంతి విస్తరిస్తుంది.”—కీర్తన 72:7.

  •   ‘సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను ఆయన రక్షిస్తాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.’—కీర్తన 72:12, 14.

 నేడు కూడా, 239 దేశాల్లో ఉన్న లక్షలమందిని యేసు బోధలు ఐక్యం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు శాంతిగా ఉండడం నేర్చుకున్నారు. దానిగురించి తెలుసుకోవడానికి “ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం” అనే విషయాన్ని చర్చించిన కావలికోట పత్రిక చదవండి.