అప్రమత్తంగా ఉండండి!
కమ్ముతున్న కరువు మేఘాలు—బైబిలు ఏం చెప్తుంది?
“చైనాలో ఈ ఏడాది ’అత్యంత తీవ్రమైన‘ వడగాలులు వీచాయి. ఇప్పటివరకు నమోదైన అత్యంత పొడి వేసవికాలాల్లో ఇది మూడవది.”—ద గార్డియన్, సెప్టెంబరు 7, 2022.
“గత నాలుగేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకుని, ఇప్పుడు ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కొన్ని ఆఫ్రికా దేశాలు.”—UN న్యూస్, ఆగస్టు 26, 2022.
“యూరప్‌లో సగానికి పైగా దేశాల్లో, కరువు హెచ్చరికలు జారీ అయ్యాయి. బహుశా గత 500 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన కరువు కావచ్చు.”—BBC న్యూస్, ఆగస్టు 23, 2022.
ఇలాంటి కరువులు ఇకముందు కూడా వస్తూనే ఉంటాయని, ఇంకా తీవ్రమౌతాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. మరి భవిష్యత్తు విషయంలో ఏదైనా ఆశ ఉందా? బైబిలు ఏం చెప్తుంది?
కరువుల గురించి బైబిలు ముందే చెప్పింది
మన కాలంలో జరిగే ఈ విషయాల్ని బైబిలు ముందే చెప్పింది:
“ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు … వస్తాయి.”—లూకా 21:11.
కరువుల వల్ల తరచూ ఆహార కొరతలు ఏర్పడతాయి. అలాంటి ఆహార కొరతల గురించి, వాటివల్ల కలిగే బాధ-మరణం గురించి బైబిలు ముందే చెప్పింది.—ప్రకటన 6:6, 8.
కరువులు ఎందుకు అంతకంతకు తీవ్రమౌతున్నాయి?
ఒక ముఖ్యమైన కారణాన్ని బైబిలు చెప్తుంది. అదేంటంటే:
“తన అడుగును నిర్దేశించుకునే అధికారం అతనికి [మనిషికి] లేదు.”—యిర్మీయా 10:23.
అంటే దానర్థం, మనుషులు ‘తమ అడుగుల్ని’ నిర్దేశించుకోలేరు, లేదా తమను తాము పరిపాలించుకోలేరు. వాళ్ల తప్పుడు నిర్ణయాల వల్ల తరచూ కరువులు, నీటి కొరతలు ఏర్పడతాయి.
గ్లోబల్ వార్మింగ్‌కి (భూమి వేడేక్కడానికి) కారణం మనుషులు చేసే పనులే అనీ, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కరువులు ఎక్కువ అవుతున్నాయని చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు.
కొంతమంది ముందుచూపు లేకుండా అత్యాశతో అడవుల్ని నరికేస్తున్నారు, కాలుష్యం కలిగిస్తున్నారు, సహజ వనరుల్ని అవసరానికి మించి వాడేస్తున్నారు. దానివల్ల నీటి నిల్వలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి.
కానీ బైబిలు మనలో ఆశను నింపుతుంది.
భవిష్యత్తు విషయంలో ఏదైనా ఆశ ఉందా?
ప్రస్తుతం ఉన్న నీటి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడని బైబిలు మాటిస్తుంది. ఆయన దాన్నెలా చేస్తాడు?
1. దేవుడు “భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం” చేస్తాడు. (ప్రకటన 11:18) నీటి కొరతలు ఏర్పడడానికి ఒక కారణం, చెడ్డవాళ్లు-అత్యాశపరులు పర్యావరణాన్ని నాశనం చేయడమే. కాబట్టి, వాళ్లను తీసేయడం ద్వారా దేవుడు నీటి సమస్యను పరిష్కరిస్తాడు.—2 తిమోతి 3:1, 2.
2. “ఎండిన నేల జమ్ము మడుగు అవుతుంది.” (యెషయా 35:1, 6, 7) దేవుడు కరువుల వల్ల జరిగిన నష్టాన్ని సరిచేస్తాడు, అలాగే ఈ భూమిని సమృద్ధిగా నీళ్లున్న అందమైన తోటలా మారుస్తాడు.
3. “నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, అది విస్తారంగా పండేలా చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తున్నావు.” (కీర్తన 65:9) దేవుడు భూమిని దీవిస్తాడు, అప్పుడు భూమ్మీద అందరికీ మంచి ఆహారం, స్వచ్ఛమైన నీళ్లు పుష్కలంగా ఉంటాయి.