పూర్వకాలం నాటి ముద్రలు—అవేంటి?
సాధారణంగా బంకమట్టి మీద లేదా మైనం మీద ముద్ర వేయడానికి ఉపయోగించే చిన్న పరికరాలే ముద్రలు. వాటిమీద అక్షరాలు లేదా చిత్రాలు చెక్కివుంటాయి. ముద్రలు రకరకాల ఆకారాల్లో అంటే శంకువు, చతురస్రం, స్థూపం, జంతువు తల వంటి ఆకారాల్లో ఉండేవి. యాజమాన్య హక్కును తెలపడానికి లేదా ఒక దస్తావేజును అధికారికం చేయడానికి, అలాగే సంచుల్ని, తలుపుల్ని, సమాధి ద్వారాల్ని ఎవరూ తెరవకుండా ఉంచడానికి ముద్రలు వేసేవాళ్లు.
ముద్రల్ని ఎముక, సున్నపురాయి, లోహం, సాధారణ రత్నం, చెక్క వంటి రకరకాల పదార్థాల్ని ఉపయోగించి తయారుచేసేవాళ్లు. కొన్నిసార్లు యజమాని పేరు, అతని తండ్రి పేరు ఆ ముద్ర మీద చెక్కేవాళ్లు. కొన్ని ముద్రల మీదైతే యజమాని బిరుదు కూడా ఉంది.
ఒక దస్తావేజును అధికారికం చేయడానికి, యజమాని ఆ దస్తావేజుకు కట్టివున్న బంకమట్టి, మైనం, లేదా వేరే మెత్తటి పదార్థం మీద ముద్ర వేసేవాడు. (యోబు 38:14) తర్వాత ఆ పదార్థం గట్టిపడేది, దానివల్ల వేరేవాళ్లు ఎవరూ దాన్ని తెరిచే అవకాశం ఉండేది కాదు.
అధికారాన్ని ఇవ్వడానికి ముద్రల్ని ఉపయోగించేవాళ్లు
యజమాని ఒక వ్యక్తికి ముద్రలు ఇచ్చాడంటే, అతనికి తన అధికారాన్ని ఇచ్చినట్టు. ఉదాహరణకు, ప్రాచీనకాలంలో ఐగుప్తు రాజైన ఫరో యోసేపుకు తన ముద్రను ఇచ్చాడు. యోసేపు ఒక హెబ్రీయుడు, అతను యాకోబు కుమారుడు. అతను చాలాకాలంగా ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. తర్వాత, అతన్ని అన్యాయంగా జైల్లో వేశారు. అయితే, కొంతకాలానికి ఫరో అతన్ని విడుదల చేసి, ప్రధానమంత్రిగా నియమించాడు. అంతేకాదు, ‘ఫరో తన చేతికి ఉన్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టాడు’ అని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 41:42) ఆ ఉంగరానికి అధికారిక ముద్ర ఉంది కాబట్టి తనకు ఇవ్వబడిన ముఖ్యమైన పనిని నిర్వర్తించే అధికారం యోసేపుకు ఉంది.
ప్రాచీన ఇశ్రాయేలులో యెజెబెలు రాణి నాబోతు అనే వ్యక్తిని చంపించడానికి తన భర్త ముద్రను ఉపయోగించింది. అహాబు రాజు పేరుతో ఆమె కొంతమంది పెద్దలకు ఉత్తరాలు రాసి, అమాయకుడైన నాబోతు మీద దేవుణ్ణి శపించాడనే ఆరోపణ వేయమని చెప్పింది. ఆమె ఆ ఉత్తరాల మీద అహాబు రాజు ముద్ర వేసి తన కుట్రను అమలుచేసింది.—1 రాజులు 21:5-14.
పర్షియా రాజైన అహష్వేరోషు తాను జారీచేసిన ఆదేశాల మీద తన ఉంగరంతో ముద్ర వేసి, వాటిని అధికారికం చేశాడు.—ఎస్తేరు 3:10, 12.
ఇశ్రాయేలు ప్రధానులు, లేవీయులు, యాజకులు రాతపూర్వక ఒప్పందం మీద ముద్రలు వేసి తమ అంగీకారాన్ని తెలియజేశారని బైబిలు రచయిత నెహెమ్యా రాశాడు.—నెహెమ్యా 1:1; 10:1.
ఎవరూ ప్రవేశించకుండా ఉండేలా ద్వారాలకు ముద్ర వేసిన రెండు సందర్భాల గురించి బైబిలు చెప్తుంది. దానియేలు ప్రవక్తను సింహాల గుహలో పడేసినప్పుడు, ‘ఒక రాయిని తీసుకొచ్చి, దానితో ఆ గుహ ద్వారాన్ని మూసేశారు.’ తర్వాత, మాదీయ-పారసీక రాజైన దర్యావేషు, ‘దానియేలు విషయంలో ఎలాంటి మార్పూ జరగకుండా తన ఉంగరంతో, తన ప్రముఖుల ఉంగరంతో దానికి ముద్ర వేశాడు.’—దానియేలు 6:17, NW.
యేసుక్రీస్తు శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు, దానికి అడ్డుగా దొర్లించిన రాయికి శత్రువులు “ముద్రవేసి,” సమాధిని భద్రం చేశారు. (మత్తయి 27:66, అధస్సూచి) ఒకవేళ అది రోమా అధికారిక ముద్ర అయితే, “రాయికి, సమాధి ద్వారానికి ... మధ్య ఉన్న సందులో బంకమట్టి లేదా మైనం పెట్టి ఉండవచ్చు” అని డేవిడ్ ఎల్. టర్నర్ అనే వ్యక్తి మత్తయి సువార్త మీద రాసిన రెఫరెన్సు పుస్తకంలో చెప్పాడు.
ప్రాచీన ముద్రలు ఆ కాలం గురించి ఎన్నో విషయాలు చెప్తాయి. అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వాటిమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నిజానికి, సిజిల్లోగ్రఫీ (అంటే, ముద్రల్ని అధ్యయనం చేయడం) ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.