కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Francesco Carta fotografo/Moment via Getty Images

ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది

ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది

 ప్రతీ నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని ఈ మధ్య ప్రపంచమంతటా జరిగిన ఒక సర్వేలో a తేలింది.

  •   “వయసుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవ్వరినైనా ఒంటరితనం పీడించవచ్చు.”​—చీడో పెంబ, ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సోషల్‌ కనెక్షన్‌ కమిషన్‌ సహ-అధ్యక్షుడు.

 ముసలివాళ్లు లేదా సమాజానికి దూరంగా బ్రతికేవాళ్లు మాత్రమే ఒంటరితనంతో బాధపడతారని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు! ఒంటరితనం పిల్లల్ని, యౌవనుల్ని, ఆరోగ్యంగా ఉన్నవాళ్లను, జీవితంలో ఎన్నో సాధించినవాళ్లను, పెళ్లయిన వాళ్లను ఇలా ఎవ్వరినైనా తన గుప్పిట్లోకి తీసుకోగలదు. నలుగురికి దూరంగా ఉంటూ ఒంటరితనంలో మగ్గిపోతున్నవాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, మనసుకు మానని గాయాలు అవుతాయి.

  •   ‘ఒంటరితనం అనేది కేవలం మనసు బాలేకపోవడం కాదు. ఒక రోజులో 15 సిగరెట్లు తాగే వ్యక్తి చావుకు ఎంత దగ్గర్లో ఉంటాడో ఒంటరితనంతో బాధపడేవాళ్లు కూడా చావుకు అంతే దగ్గరగా ఉంటారు’ అని U.S. సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి అన్నాడు.

బైబిలు ఏం చెప్తుంది

 మనం నలుగురికి దూరంగా బ్రతకడం మన సృష్టికర్తకు ఇష్టం లేదు. మనసుకు హాయినిచ్చే స్నేహితులతో సంతోషంగా సమయం గడపాలన్నదే దేవుని ఉద్దేశం.

  •   బైబిలు సూత్రం: “దేవుడు ఇలా అన్నాడు: ‘మనిషి ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు.’”​—ఆదికాండం 2:18.

 మనం తనతో కూడా స్నేహం చేయాలన్నది దేవుని కోరిక. మనం ఆయనకు దగ్గరవ్వడానికి అడుగులు వేస్తే, ఆయన కూడా మనకు దగ్గరౌతానని మాటిస్తున్నాడు.—యాకోబు 4:8.

  •   బైబిలు సూత్రం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.”—మత్తయి 5:3.

 మనం వేరేవాళ్లతో కలిసి తనను ఆరాధించడం దేవునికి నచ్చుతుంది. చెప్పాలంటే, అలా నలుగురితో కలిసి దేవున్ని ఆరాధించడం మన మనసుకు మందు.

  •   బైబిలు సూత్రం: “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు … మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం.”—హెబ్రీయులు 10:24, 25.

 ఒంటరితనానికి ఎదురీదడం ఎందుకు చాలా అవసరమో తెలుసుకోవడానికి “నలుగురితో కలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా ఎందుకీ ఒంటరితనం?” అనే ఇంగ్లీష్‌ ఆర్టికల్‌ చదవండి.

a The Global State of Social Connections, by Meta and Gallup, 2023.