కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూకంపాల గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?

భూకంపాల గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?

 ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో భూకంపాలు వస్తున్నాయి. వాటిలో చాలావరకు స్వల్ప భూకంపాలే అయినా, ఓ మోస్తరు భూకంపాలు ఎంతో ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, బాధను కలిగిస్తాయి. కొన్ని భూకంపాలు సునామీల్ని సృష్టించి తీర ప్రాంతాల్లో నివసించే ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటాయి. ఇలాంటి పెద్దపెద్ద భూకంపాలు వస్తాయని బైబిలు ముందే చెప్పిందా?

ఈ ఆర్టికల్‌లో ...

 భూకంపాల గురించి బైబిలు ముందే చెప్పిందా?

 బైబిల్లో యేసు చెప్పిన ఒక ప్రవచనంలో భూకంపాల గురించిన ప్రస్తావన ఉంది. ఆయన అన్న మాటలు బైబిల్లోని మూడు పుస్తకాల్లో ఉన్నాయి, అవి ఏం చెప్తున్నాయంటే:

 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.”మత్తయి 24:7.

 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి; ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు వస్తాయి; ఆహారకొరతలు కూడా వస్తాయి.”—మార్కు 13:8.

 “తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి.”—లూకా 21:11.

 అలా యేసు యుద్ధాలు, ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వచ్చే సమయంలో ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో “తీవ్రమైన భూకంపాలు” కూడా వస్తాయని చెప్పాడు. ఇవన్నీ కలిసి జరిగినప్పుడు, అది “ఈ వ్యవస్థ ముగింపు” లేదా “చివరి రోజులు” అని అర్థం. (మత్తయి 24:3; 2 తిమోతి 3:1) బైబిలు కాలపట్టిక ప్రకారం ఆ “చివరి రోజులు” 1914 లో మొదలయ్యాయని తెలుస్తుంది, ఇప్పుడు మనం ఆ కాలంలోనే జీవిస్తున్నాం.

 మన రోజుల్లో వస్తున్న భూకంపాలు బైబిలు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయా?

 అవును. భూకంపాల గురించి యేసు చెప్పిన మాటలతో సహా ఆయన చెప్పిన ప్రవచనం, నేడు మనం చూసే సంఘటనలతో సరిగ్గా సరిపోతుంది. 1914 నుండి ఓ మోస్తరు భూకంపాలు 1,950 కన్నా ఎక్కువ వచ్చాయి. వాటివల్ల 20 లక్షల కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. a ఈ శతాబ్దంలో వచ్చిన కొన్ని భూకంపాలను పరిశీలించండి.

 2004—హిందూ మహాసముద్రం. 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల కలిగిన సునామీ 12 దేశాల మీద ప్రభావం చూపించింది, దానివల్ల దాదాపు 2,25,000 మంది చనిపోయారు.

 2008—చైనా. 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం పల్లెటూళ్లను, పట్టణాలను నాశనం చేసింది. ఒక అంచనా ప్రకారం దానివల్ల 90,000 చనిపోయారు, దాదాపు 3,75,000 మంది గాయపడ్డారు, ఎన్నో లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

 2010—హయిటీ. 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత వచ్చిన బలమైన ప్రకంపనల వల్ల 3 లక్షల కన్నా ఎక్కువమంది చనిపోయారు, 10 లక్షల కన్నా ఎక్కువమంది నిరాశ్రయులయ్యారు.

 2011—జపాన్‌. 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం సృష్టించిన సునామీల వల్ల దాదాపు 18,500 మంది చనిపోయారు, లక్షలమంది వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఫుకుషిమా పవర్‌ ప్లాంట్‌ దెబ్బతినడం వల్ల, దాని నుండి ప్రమాదకరమైన రేడియేషన్‌ వెలువడింది. రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, ఆ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉన్న దాదాపు 40,000 మంది పదేళ్ల తర్వాత కూడా అక్కడికి తిరిగి వెళ్లలేకపోయారు.

 భూకంపాల గురించి బైబిలు చెప్పేది మనం ఎందుకు తెలుసుకోవాలి?

 భూకంపాల గురించి బైబిలు చెప్పేది తెలుసుకుంటే, అతి త్వరలో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవచ్చు. యేసు ఇలా చెప్పాడు: “ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరపడిందని తెలుసుకోండి.”—లూకా 21:31.

 దేవుని రాజ్యం అనేది ఒక నిజమైన ప్రభుత్వమని, అది పరలోకంలో ఉంటుందని, దానికి రాజు యేసుక్రీస్తని బైబిలు వివరిస్తుంది. యేసు తన అనుచరుల్ని ప్రార్థించమని చెప్పింది ఆ రాజ్యం గురించే.—మత్తయి 6:10.

 దేవుని రాజ్యం భూమిని పరిపాలించినప్పుడు, భూకంపాల లాంటి ప్రకృతి విపత్తుల వల్ల మనుషులకు హాని జరగకుండా దేవుడు చూసుకుంటాడు. (యెషయా 32:18) అంతేకాదు, ఈ రోజుల్లో వస్తున్న భూకంపాల వల్ల ఇప్పటికే ప్రజలకు కలిగిన హానిని, వేదనను కూడా ఆయన పూర్తిగా తీసేస్తాడు. (యెషయా 65:17; ప్రకటన 21:3, 4) దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?” అనే ఆర్టికల్‌ చదవండి.

a ఈ గణాంకాలు, యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ జియోఫిజికల్‌ డేటా సెంటర్‌ నుండి సమాచారాన్ని పొందే గ్లోబల్‌ సిగ్నిఫికెంట్‌ ఎర్త్‌క్వేక్‌ డేటాబేస్‌ నుండి సేకరించినవి.