అప్రమత్తంగా ఉండండి!
శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
2022, ఫిబ్రవరి 24న, రష్యా బలగాలు యుక్రెయిన్‌పై దాడి చేశాయి. దాంతో, ఆ దేశ పౌరులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని పారిపోవడం మొదలుపెట్టారు. a
“అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది, పేలుళ్ల శబ్దానికి చెవులు చిల్లులు పడుతున్నాయి. అది ఎంత భయానకంగా ఉందంటే, ఆ భయానికి నోరు పెకలట్లేదు. అక్కడ ప్రజలందర్నీ ట్రైనుల్లో తరలిస్తున్నారని తెలుసుకున్నప్పుడు, మేము కూడా వెళ్లిపోదాం అనుకున్నాం. చెప్పాలంటే, మేము మా జీవితాన్నంతా ఒక చిన్న బ్యాగులో సర్దుకొని బయల్దేరాలి. మేము ముఖ్యమైన డాక్యుమెంట్లు, మందులు, నీళ్లు, ఆహారం మాత్రమే తీసుకోగలిగాం. మేము అన్నీ వదిలేసి, ఒకపక్క బాంబులు పడుతుంటే ఎలాగోలా రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాం.”—యుక్రెయిన్‌లోని ఖర్ఖివ్ నుండి నటాలియా.
“ఆఖరి క్షణం వరకు మేము యుద్ధం జరగదులే అనుకున్నాం. కానీ, ఉన్నట్టుండి మా నగరంలో కొన్ని చోట్ల నుండి పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, కిటికీలు అదిరాయి. నేను ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే తీసుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. నేను ఉదయం 8:00 గంటలకు ఇంటి నుండి బయల్దేరి, ట్రైను ఎక్కి లివివ్‌కు చేరుకున్నాను, అక్కడి నుండి మళ్లీ బస్సులో పోలాండ్‌కి వచ్చాను.”—యుక్రెయిన్‌లోని ఖర్ఖివ్ నుండి నదీయా.
ఈ ఆర్టికల్‌లో ...
శరణార్థుల కష్టాలకు అసలు కారణాలు ఏంటి?
యుక్రెయిన్‌లో శరణార్థుల కష్టాలు, రష్యా దాడి వల్ల మొదలయ్యాయి. అయితే, బైబిలు ఇంకో అడుగు ముందుకు వేసి, శరణార్థుల కష్టాలన్నిటి వెనకున్న కంటికి కనిపించని కారణాల్ని వెలికి తీస్తుంది:
మానవ ప్రభుత్వాలు మనుషుల జీవితాల్లో వెలుగును నింపలేకపోయాయి. అధికారంలో ఉన్నవాళ్లు తరచూ వాళ్ల అధికారాన్ని ఉపయోగించి ప్రజల్ని అణచివేస్తున్నారు.—ప్రసంగి 4:1; 8:9.
అపవాది అయిన సాతాను, “ఈ లోక పరిపాలకుడు.” అతను మనుషుల మీద ఎంత చెడ్డ ప్రభావం చూపిస్తాడో బైబిలు చెప్తుంది: “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.”—యోహాను 14:30; 1 యోహాను 5:19.
వందల సంవత్సరాలుగా మనుషుల్ని పట్టిపీడిస్తున్న సమస్యలే కాకుండా, మనం కష్టమైన కాలాల్ని కూడా ఎదుర్కొంటామని బైబిలు ముందే చెప్పింది: “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.” (2 తిమోతి 3:1) మనం ఇప్పుడు అదే కాలంలో జీవిస్తున్నాం. ఈ చివరి రోజుల్లో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి. వాటివల్ల ప్రజలు ఇళ్లు వదిలి వేరేచోటికి వెళ్లిపోవాల్సి వస్తుంది.—లూకా 21:10, 11.
శరణార్థుల జీవితంలో ఏమైనా ఆశ మిగిలి ఉందా?
మన సృష్టికర్త అయిన యెహోవా b దేవుడు, ఇళ్లు వదిలేసి వచ్చిన శరణార్థుల మీద అలాగే పరదేశుల మీద ప్రేమ, కనికరం చూపిస్తాడని బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండం 10:18) ఆయన తన పరలోక ప్రభుత్వాన్ని ఉపయోగించి శరణార్థుల కష్టాల్ని తీరుస్తానని మాటిస్తున్నాడు. ఆ ప్రభుత్వాన్ని దేవుని రాజ్యం అంటారు. అది మనుషుల ప్రభుత్వాల స్థానంలో వస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) యెహోవా తన రాజ్యాన్ని ఉపయోగించి అపవాది అయిన సాతానును తీసేస్తాడు. (రోమీయులు 16:20) దేవుని రాజ్యం అన్ని దేశాల సరిహద్దుల్ని చెరిపేసి భూమంతటినీ పరిపాలిస్తుంది. అప్పుడు మనుషులందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. ఎవ్వరూ వాళ్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే, బైబిలు ఇలా మాటిస్తోంది: “వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూర చెట్టు కింద కూర్చుంటారు, ఎవ్వరూ వాళ్లను భయపెట్టరు, ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవాయే ఈ మాట చెప్పాడు.”—మీకా 4:4.
ఇప్పుడు మనం చూస్తున్న శరణార్థుల కష్టాలకు ఏకైక పరిష్కారం, దేవుని రాజ్యం మాత్రమే. యెహోవా ఆ రాజ్యాన్ని ఉపయోగించి శరణార్థుల కష్టాల్నే కాదు, ఆ కష్టాలకు కారణమైన వాటిని కూడా తీసేస్తాడు. కొన్ని ఉదాహరణలు చూడండి:
యుద్ధం. “[యెహోవా] యుద్ధాలు జరగకుండా చేస్తాడు.” (కీర్తన 46:9) దేవుడు అది ఎలా చేస్తాడో తెలుసుకోవడానికి, “భూమ్మీద శాంతి సాధ్యమా?” అనే ఆర్టికల్ చదవండి.
అణచివేత, దౌర్జన్యం. “అణచివేత నుండి, దౌర్జన్యం నుండి [యెహోవా] వాళ్లను రక్షిస్తాడు.” (కీర్తన 72:14) ప్రజలు తమ నరనరాల్లో పాతుకుపోయిన స్వభావాన్ని కూడా ఎలా మార్చుకోగలరో అర్థం చేసుకోవడానికి, “ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం” అనే ఆర్టికల్స్ చదవండి.
పేదరికం. ‘సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను [యెహోవా] రక్షిస్తాడు.’ (కీర్తన 72:12) దేవుడు పేదరికాన్ని కూకటివేళ్లతో సహా ఎలా పెరికేస్తాడో తెలుసుకోవడానికి, “పేద-ధనిక తేడాలు లేని సమాజం సాధ్యమేనా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చదవండి.
ఆహారకొరతలు. “భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది.” (కీర్తన 72:16) అందరి కడుపూ నిండేలా దేవుడు ఎలా చూసుకుంటాడో తెలుసుకోవడానికి, “ఆకలిదప్పులు లేని ప్రపంచం” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చదవండి.
నేడు శరణార్థులకు బైబిలు ఏమైనా సహాయం చేయగలదా?
తప్పకుండా! బైబిలు శరణార్థుల జీవితాల్లో భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేయడంతో పాటు, ఇప్పుడు ఎదుర్కొనే కష్టాల్లో ఎలా గట్టెక్కాలో కూడా చెప్తుంది.
బైబిలు సలహా: “అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు, వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.”—సామెతలు 14:15.
అంటే ... మీకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వవచ్చో, అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారో ముందే ఆలోచించి పెట్టుకోండి. శరణార్థులు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడ వాళ్లకు పెద్దగా ఏమీ తెలీదు కాబట్టి దొంగలు వాళ్లను అమాయకుల్ని చేసి మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి!
బైబిలు సలహా: “మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”—1 తిమోతి 6:8.
అంటే ... డబ్బు మీద, వస్తువుల మీద మనసుపెట్టకండి. ఆహారం, బట్టలు లాంటి కనీస అవసరాలతో తృప్తిపడితే మీరు సంతోషంగా ఉంటారు.
బైబిలు సలహా: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—మత్తయి 7:12.
అంటే ... అందరితో ఓపిగ్గా, దయగా ఉండండి. అప్పుడు, మీరు ఎక్కడ ఉన్నా ప్రజలు మీకు మర్యాద ఇస్తారు, తమతో కలుపుకుంటారు.
బైబిలు సలహా: “ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి.”—రోమీయులు 12:17.
అంటే ... ఎవరైనా మిమ్మల్ని అవమానించి, చులకనగా చూసినా వాళ్ల మీద కోపం పెంచుకోకండి, పగ తీర్చుకోకండి. దానివల్ల పరిస్థితులు ఇంకా ఘోరంగా అవుతాయే తప్ప, ఎలాంటి ఉపయోగం ఉండదు.
బైబిలు సలహా: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.
అంటే ... మీ జీవితంలో దేవునికి మొదటిస్థానం ఇవ్వండి, ఆయనకు ప్రార్థించండి. కష్టాల్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఆయన మీకు ఇవ్వగలడు.
బైబిలు సలహా: ‘ఏ విషయం గురించీ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి; అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.’—ఫిలిప్పీయులు 4:6, 7.
అంటే ... మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ హృదయం, మనసు ప్రశాంతంగా ఉండేలా సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. “ఫిలిప్పీయులు 4:6, 7—‘ఏ విషయం గురించీ ఆందోళన పడకండి’” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చూడండి.
a రష్యా దాడి మొదలైన తర్వాతి రోజే, యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR), ఈ సంక్షోభాన్ని అతి పెద్ద ఎమర్జెన్సీగా ప్రకటించింది. కేవలం 12 రోజుల్లోనే, 20 లక్షల కంటే ఎక్కువమంది శరణార్థులు యుక్రెయిన్ నుండి పక్క దేశాలకు వెళ్లిపోయారు. ఇంకో 10 లక్షలమంది ప్రజలేమో, యుక్రెయిన్‌లోనే చెల్లాచెదురు అయిపోయారు.
b యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్ చూడండి.