విపరీత వాతావరణంతో తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదా?
విపరీత వాతావరణం వల్ల ఇబ్బందులు పడిన లక్షలమందిలో మీరూ ఒకరా? ప్రమాదకరమైన వాతావరణం వల్ల చాలా రకాల నష్టాలు కలుగుతాయి. హరికేన్లు, టైఫూన్లు, తుఫానులు, సుడిగాలుల వల్ల తరచూ వరదలు, తీవ్రగాలులు వస్తాయి. వాటివల్ల హాని జరుగుతుంది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడవచ్చు; తుఫాను సమయంలో వచ్చే ఉరుములు-మెరుపుల వల్ల ప్రమాదకరమైన కార్చిచ్చులు అంటుకోవచ్చు. అనావృష్టిలు, వడగాల్పులు, మంచు తుఫానులు కూడా అంతే నష్టాన్ని కలిగించగలవు.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈమధ్య విపరీతమైన వాతావరణం తరచూ కనిపిస్తోంది, వాటి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. “విపత్తుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ... ఎందుకంటే అంతకంతకూ ఎక్కువౌతున్న వరదలు, తుఫానులు, ముఖ్యంగా అనావృష్టిలు ప్రజల జీవితాల్ని, వాళ్ల జీవనాధారాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి, దాంతో ప్రతీ సంవత్సరం లక్షలమంది వేరేచోటికి వలస వెళ్తున్నారు” అని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ నివేదిక చెప్తుంది.
ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలకు భౌతిక నష్టంతో పాటు భావోద్వేగ హాని కూడా జరుగుతుంది. ఆస్తుల్ని, ఇంటిని పోగొట్టుకోవడం, తమవాళ్లు చనిపోవడం కారణంగా చాలామంది వేదనకు గురౌతారు.
మీరు ఒకవేళ విపరీతమైన వాతావరణం వల్ల ఇబ్బందులు పడివుంటే, వాటిని తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు. అది ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను, ఉపయోగపడే సలహాలను ఇస్తుంది. విపరీతమైన వాతావరణం వల్ల ఇబ్బందులు పడిన చాలామందికి అవి సహాయం చేశాయి. (రోమీయులు 15:4) అంతేకాదు, ‘దేవుడు ఈ కష్టాన్ని ఎందుకు రానిచ్చాడు, ఆయన నన్ను శిక్షిస్తున్నాడా?’ అని చాలామంది ఆలోచిస్తారు. దానికి కూడా బైబిలు జవాబిస్తుంది.
ఈ రోజుల్లో వచ్చే విపరీత వాతావరణం దేవుడు విధించే శిక్ష కాదు
ప్రజలు అనుభవించే కష్టాలకు దేవుడు బాధ్యుడు కాడని బైబిలు చెప్తుంది. “చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు” అని అది హామీ ఇస్తుంది. (యాకోబు 1:13) అంటే, నేడు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న విపరీతమైన వాతావరణానికి దేవుడు కారణం కాదు.
నిజమే, దేవుడు ప్రకృతిని ఉపయోగించుకొని చెడ్డవాళ్లను శిక్షించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే వాటికీ, నేడు విపరీతమైన వాతావరణం చేసే హానికీ తేడా ఉంది. నేటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వస్తున్నాయి, మంచివాళ్లను-చెడ్డవాళ్లను ఒకేలా బాధిస్తున్నాయి. కానీ దేవుడు చెడ్డవాళ్లను శిక్షించిన ప్రతీ సందర్భంలో ఆయన అమాయక ప్రజల్ని కాపాడాడని, ముందస్తు హెచ్చరిక చేశాడని, ఎందుకు నాశనం చేయబోతున్నాడో కారణాల్ని వివరించాడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, నోవహు కాలంలో దేవుడు తాను భూవ్యాప్తంగా ప్రళయం ఎందుకు రప్పిస్తున్నాడో కారణాలు వివరించాడు, ముందుగానే హెచ్చరిక చేశాడు, అలాగే నోవహును ఆయన కుటుంబాన్ని కాపాడాడు.—ఆదికాండం 6:13; 2 పేతురు 2:5.
నేడు వస్తున్న ప్రకృతి విపత్తులు దేవుడు విధించే శిక్ష కాదని ఎలా చెప్పవచ్చో ఇంకా తెలుసుకోవడానికి “ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?” అనే ఆర్టికల్ చూడండి.
విపరీత వాతావరణం వల్ల కష్టాలు పడుతున్న వాళ్ల మీద దేవునికి శ్రద్ధ ఉంది
యెహోవా a దేవుడు శ్రద్ధ చూపిస్తాడని, ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడని బైబిలు చెప్తుంది. ఊరటనిచ్చే ఈ వచనాల్ని పరిశీలించండి.
యెషయా 63:9: “వాళ్ల బాధలన్నిటిలో [దేవుడు] బాధ అనుభవించాడు.”
దాని అర్థం: ప్రజలు బాధపడుతుంటే యెహోవా కూడా చాలా బాధపడతాడు.
1 పేతురు 5:7: “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది.”
దాని అర్థం: మీ సంక్షేమం గురించి యెహోవా ఆలోచిస్తున్నాడు.
యెహోవాకున్న శ్రద్ధ, తదనుభూతి ఆయన్ని చర్య తీసుకునేలా కదిలిస్తాయి. బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాల ద్వారా, భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు ఉండవనే వాగ్దానం ద్వారా ఆయన ఊరట ఇస్తున్నాడు.—2 కొరింథీయులు 1:3, 4.
విపరీత వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండని కాలం
మీకు “మంచి భవిష్యత్తు, నిరీక్షణ” ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి బైబిలు తెలియజేస్తుంది. (యిర్మీయా 29:11) ప్రజలు వాతావరణం గురించి భయపడుతూ కాదుగానీ అందమైన తోటలా మారే భూమి మీద సంతోషంగా జీవించాలని ఆయన ఉద్దేశం.—ఆదికాండం 1:28; 2:15; యెషయా 32:18.
దేవుడు తన రాజ్యం ద్వారా, అంటే యేసు రాజుగా పరిపాలించే పరలోక ప్రభుత్వం ద్వారా అలాంటి మంచి భవిష్యత్తును తీసుకొస్తాడు. (మత్తయి 6:10) వాతావరణ విపత్తుల్ని రాకుండా చేయడానికి కావల్సిన తెలివి, శక్తి యేసుకు ఉన్నాయి. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు, వాతావరణాన్ని అదుపుచేసే శక్తి తనకుందని చూపించాడు. (మార్కు 4:37-41) ఆయన అవగాహనతో, తెలివితో పరిపాలిస్తూ ప్రకృతికి హాని చేయకుండా దానిగురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలో ప్రజలకు నేర్పిస్తాడు. (యెషయా 11:2) యేసు నాయకత్వంలో ప్రజలు మళ్లీ ఎప్పుడూ విపరీత వాతావరణం వల్ల కష్టాలు పడరు.
‘వాతావరణాన్ని అదుపు చేయడానికి యేసు తన శక్తిని ఎప్పుడు ఉపయోగిస్తాడు?’ అని మీరు అనుకోవచ్చు. ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి, “దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?” అనే ఆర్టికల్ చూడండి.
నేడు విపరీత వాతావరణంతో తట్టుకోవడం
బైబిల్లోని సలహాలు, విపరీతమైన వాతావరణం రావడానికి ముందు, అది వచ్చినప్పుడు, ఆ తర్వాత మీకు సహాయం చేయగలవు.
విపత్తుకు ముందు: వెంటనే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
బైబిలు ఇలా చెప్తుంది: “వివేకం గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు, అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు అనుభవిస్తాడు.”—సామెతలు 22:3.
దాని అర్థం: మీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు రావచ్చో ముందే ఊహించండి, దానివల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉండడానికి వెంటనే చర్య తీసుకోగలుగుతారు.
అనుభవం: “మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టే కార్చిచ్చు అంటుకున్నప్పుడు తప్పించుకున్నాం. మా అత్యవసర బ్యాగులు, మందులు, బట్టలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేయాలో అర్థంకాక కంగారుపడుతూ ఉన్నారు. కానీ మాకు, కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను!”—టామర, అమెరికాలోని కాలిఫోర్నియా.
విపత్తు వచ్చినప్పుడు: అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదో దానిమీద దృష్టిపెట్టండి.
బైబిలు ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”—లూకా 12:15.
దాని అర్థం: ఆస్తుల కన్నా ప్రాణం విలువైనది.
అనుభవం: “లవిన్ b తుఫాను మా ఇంటిని నాశనం చేసినప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోలేదు. కానీ నేను మనస్ఫూర్తిగా యెహోవా దేవునికి ప్రార్థించాను. అప్పుడు, మేము పోగొట్టుకున్నది కేవలం ఆస్తిపాస్తుల్నే కానీ ప్రాణాల్ని కాదని అర్థంచేసుకున్నాను.”—లెస్లీ, ఫిలిప్పీన్స్.
విపత్తు తర్వాత: ఈ రోజు గురించి ఆలోచించండి, రేపటి గురించి ఆందోళనపడకండి.
బైబిలు ఇలా చెప్తుంది: “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి.”—మత్తయి 6:34.
దాని అర్థం: భవిష్యత్తులో రాగల సమస్యల గురించి అతిగా ఆందోళనపడకండి.
అనుభవం: “ఇర్మా హరికేన్ వల్ల మా ఇల్లు వరదలో చిక్కుకున్నప్పుడు, నేను చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, చాలా ఒత్తిడికి గురయ్యాను. ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి, రేపటి గురించి అతిగా ఆందోళనపడకండి అనే బైబిలు సలహాను పాటించడానికి ప్రయత్నించాను. అప్పుడు, యెహోవా సహాయంతో నేను ఎన్నడూ ఊహించనంత ఎక్కువగా తట్టుకోగలనని నాకు అర్థమైంది.”—సాలీ, అమెరికాలోని ఫ్లోరిడా.
పనికొచ్చే ఇంకొన్ని టిప్స్ కోసం, “When Disaster Strikes—Steps That Can Save Lives” అనే ఆర్టికల్ చూడండి.
a “యెహోవా” అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.
b దీన్ని హైమ అని కూడా పిలుస్తారు.