అప్రమత్తంగా ఉండండి!
స్కూల్లో కాల్పులు—బైబిలు ఏం చెప్తుంది?
2022, మే 24న, అమెరికాలోని టెక్సాస్‌లో, ఉవాల్డే అనే చిన్న ఊరిలో కాల్పుల కలకలం రేగింది. ద న్యూయార్క్ టైమ్స్ అనే వార్తాపత్రిక ఇలా చెప్పింది: “రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో … ఒక దుండగుడు 19 మంది పిల్లల్ని, ఇద్దరు టీచర్లను కాల్చి చంపాడు.”
బాధాకరమైన విషయం ఏంటంటే, అలాంటి దారుణాలు చాలా సర్వసాధారణం అయిపోయాయి. USA టుడే అనే వార్తాపత్రిక చెప్తున్నట్టు, ఒక్క అమెరికాలోనే “గత ఏడాది, స్కూళ్లలో 249 కాల్పులు జరిగాయి. 1970 నుండి చూసుకున్నా, ఏ సంవత్సరంలోనూ అన్ని కాల్పులు జరగలేదు.”
ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? అవి జరిగినప్పుడు మనం ఎలా ధైర్యంగా ఉండవచ్చు? అసలు ఈ అఘాయిత్యాలు ఎప్పటికైనా ఆగుతాయా? బైబిలు ఏం చెప్తుందో చూడండి.
ప్రపంచం ఎందుకు అంతకంతకూ దారుణంగా తయారౌతోంది?
మనం జీవిస్తున్న కాలాన్ని బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తుంది. ఈ సమయంలో “మమకారం లేనివాళ్లు,” “క్రూరులు” ఎక్కువగా ఉంటారు. వాళ్లు కిరాతకంగా, పైశాచికంగా ప్రవర్తిస్తూ “అంతకంతకూ చెడిపోతారు.” (2 తిమోతి 3:1-5, 13) దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “ఈరోజుల్లో ప్రజలు ఎలా ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో బైబిలు ముందే చెప్పిందా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చదవండి.
‘స్కూళ్లలో కాల్పులు వంటి దారుణమైన సంఘటనల్ని దేవుడు ఎందుకు ఆపట్లేదు?’ అనే సందేహం చాలామందికి వస్తుంది. దీని గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, “మంచివాళ్లకు చెడు జరుగుతోంది—ఎందుకు?” అనే ఆర్టికల్ చదవండి.
అలాంటి దారుణాలు జరిగినప్పుడు మనం ఎలా ధైర్యంగా ఉండవచ్చు?
“లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.”—రోమీయులు 15:4.
దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ధైర్యంగా ఉండడానికి బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి. ఎక్కువ తెలుసుకోవడానికి, “హింస ఎప్పటికైనా ఆగుతుందా?” అనే అంశం ఉన్న తేజరిల్లు! పత్రిక (ఇంగ్లీషు) చూడండి.
దారుణమైన వార్తలు చూసి పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులు సహాయం చేయవచ్చు. కొన్ని సలహాల కోసం, “భయపెట్టే వార్తల నుండి మీ పిల్లల్ని కాపాడండి” అనే ఆర్టికల్ (ఇంగ్లీషు) చూడండి.
అఘాయిత్యాలు ఎప్పటికైనా ఆగుతాయా?
“అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:14.
“వాళ్లు తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా సాగగొడతారు. దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు, వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.”—మీకా 4:3.
మనుషులు చేయలేనిదాన్ని దేవుడు చేస్తాడు. ఆయన పరలోక ప్రభుత్వం ఆయుధాలకు, హింసకు ముగింపు పలుకుతుంది. దేవుని ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందో తెలుసుకోవడానికి, “దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’” అనే ఆర్టికల్ చదవండి.