కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కమిల్లా రోశమ్‌ | జీవిత కథ

యెహోవాకు లోబడి ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను

యెహోవాకు లోబడి ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను

 1906​లో మా అమ్మమ్మ, తాతయ్యలు డిఫ్తీరియా (ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధి) వల్ల వాళ్ల అబ్బాయిని కోల్పోయారు. అది జరిగిన కొన్ని రోజులకే, వాళ్లు దేవుని రాజ్య దీవెనల గురించి తెలుసుకున్నారు. బైబిలు విద్యార్థి అయిన వాళ్ల డాక్టర్‌ వాళ్లతో వాటిని పంచుకున్నాడు. అప్పట్లో యెహోవాసాక్షుల్ని బైబిలు విద్యార్థులు అని పిలిచేవాళ్లు. ఆయన పునరుత్థాన నిరీక్షణతో పాటు, బైబిల్లో ఓదార్పునిచ్చే విషయాల్ని వాళ్లకు చెప్పాడు. దానివల్ల మా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, పెద్దమ్మ అందరూ బైబిలు విద్యార్థులయ్యారు.

 వాళ్లు చాలా సంవత్సరాల పాటు యెహోవాకు ఉత్సాహంగా సేవ చేశారు. మా అమ్మమ్మ, అమ్మ, పెద్దమ్మ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉన్న చికాగోలో, “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులు వచ్చి వాళ్ల సీట్లలో కూర్చునేలా కూడా సహాయం చేసేవాళ్లు. అయితే విచారకరంగా, మా అమ్మ ఒక్కతే యెహోవా సేవలో కొనసాగింది. ఆమెకు అది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే, 1930ల వరకు మా కుటుంబ సభ్యులందరూ కలిసే యెహోవాను ఆరాధించేవాళ్లు, కలిసిమెలిసి ఉండేవాళ్లు. మా అమ్మ యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం, ఆయనకు లోబడి ఉండడం నాపై చెరగని ముద్ర వేశాయి. మా నాన్న ఆదర్శం కూడా నామీద బాగా పనిచేసింది, ఆయన చాలా నమ్మకమైన బైబిలు విద్యార్థి.

1948​లో, కుటుంబంతో దిగిన ఫోటో

 నేను 1927​లో పుట్టాను. మేము మొత్తం ఆరుగురం, వాళ్లలో నేనే పెద్దదాన్ని. మేమందరం సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం. మా నాన్న వడ్రంగి పని చేసేవాడు. మేము చికాగో నగర శివార్లలో, ఒక మంచి ఇంట్లో ఉండేవాళ్లం. మాకు పెద్ద పెరడు ఉండేది, అందులో మేము కూరగాయల్ని పండించేవాళ్లం. అలాగే కోళ్లు, బాతులు పెంచేవాళ్లం.

 నాకు పని చేయడం అంటే ఇష్టం. మా ఇంట్లో నా పనేంటంటే, మా అందరి సాక్స్‌లు డార్నింగ్‌ చేయడం. అప్పట్లో సాక్సులకు చిన్నచిన్న రంధ్రాలు పడితే మేము పారేసే బదులు, వాటిని సూది-దారంతో కుట్టేవాళ్లం లేదా డార్నింగ్‌ చేసేవాళ్లం. ఇప్పుడైతే డార్నింగ్‌ని ఎక్కువమంది చేయట్లేదు. అయితే, నేను అప్పట్లో ఆ పనిని నేర్చుకోవడం తర్వాత్తర్వాత నా జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే, నేను ఎక్కువశాతం టైలరింగ్‌ పనే చేశాను.

మా అమ్మానాన్నలు మంచి ఆదర్శం ఉంచారు

 మా కుటుంబమంతా యెహోవా ఆరాధనకు మొదటిస్థానం ఇచ్చేలా మా నాన్న చూసేవాడు. అందుకే మేము అన్ని కూటాలకు వెళ్లేవాళ్లం, క్రమంగా పరిచర్య చేసేవాళ్లం, అలాగే ప్రతీరోజు ఒక బైబిలు లేఖనాన్ని పరిశీలించేవాళ్లం. శనివారం సాయంత్రాలైతే, మేమంతా కావలికోట ఉపయోగించి కుటుంబ అధ్యయనం చేసుకునేవాళ్లం.

 ఇరుగుపొరుగు వాళ్లకు మంచి సాక్ష్యమివ్వడానికి, మా నాన్న హాలు కిటికీ నుండి బయటికి కనిపించేలా ఒక ఎలక్ట్రిక్‌ సైన్‌బోర్డ్‌ పెట్టాడు. దాన్ని మన సహోదరులే తయారుచేశారు. ఆ బోర్డ్‌ ఒక బహిరంగ ప్రసంగం గురించి లేదా మన ప్రచురణల్లో ఒకదాని గురించి చెప్పేది. అందులో ఉండే లైట్‌ వెలుగుతూ ఆరుతూ ఉండడం వల్ల అటుగా వెళ్తున్నవాళ్ల దృష్టిని ఆకర్షించేది. మా నాన్న రెండు సైన్‌బోర్డుల్ని మా కారుకు కూడా తగిలించారు.

ఫోనోగ్రాఫ్‌లను ఉపయోగించి ప్రకటించడానికి మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు

 మా నాన్న తన మాటల ద్వారా, ఆదర్శం ద్వారా యెహోవాకు లోబడడం ఎంత ప్రాముఖ్యమో పిల్లలమైన మాకు నేర్పించాడు. మా అమ్మ కూడా ఆయనకు అన్ని విధాలా మద్దతిచ్చేది. మా ఆఖరి చెల్లికి అయిదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ పయినీరు సేవ మొదలుపెట్టింది, ఆ సేవను జీవితాంతం కొనసాగించింది. నాకు ఇంతకన్నా మంచి తల్లిదండ్రులు దొరకరేమో!

 అప్పట్లో జీవితం ఇప్పటికన్నా చాలా వేరుగా ఉండేది. మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి నేనూ, మా చెల్లెళ్లు, మా తమ్ముళ్లు ఇంట్లో కింద కూర్చొని కొన్ని ఆసక్తికరమైన రేడియో ప్రసారాలను వినేవాళ్లం. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా సంస్థ రేడియో ద్వారా ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మా కుటుంబమంతా కలిసి విని ఆనందించేవాళ్లం.

సమావేశాలు, ఫోనోగ్రాఫ్‌లు, ప్లకార్డులు

 మాకు సమావేశాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. 1935​లో జరిగిన ఒక సమావేశంలో, ప్రకటన 7:9, 14​లో ప్రస్తావించిన ‘మహాశ్రమను దాటి వచ్చే గొప్పసమూహానికి,’ పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉంటుందని తెలుసుకున్నాం. అప్పటివరకు మా అమ్మానాన్నలిద్దరూ జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకునేవాళ్లు. అయితే ఆ సమావేశం తర్వాత, కేవలం మా నాన్న మాత్రమే వాటిని తీసుకున్నాడు. మా అమ్మ తనకు పరలోకంలో క్రీస్తుతో పాటు పరిపాలించే నిరీక్షణ లేదు గానీ, ఇదే భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉందని అర్థం చేసుకుంది.

 1941​లో, మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో ఒక సమావేశం జరిగింది. అప్పట్లో మన పనికి నాయకత్వం వహిస్తున్న సహోదరుడు జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌, పిల్లలు (ఇంగ్లీష్‌) అనే పుస్తకాన్ని ఆ సమావేశంలో విడుదల చేశారు. అప్పుడు ఆ హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది! ఆ సమావేశం జరిగే సమయానికి నాకు 14 ఏళ్లు. నేను బాప్తిస్మం తీసుకుని అప్పటికి ఒక సంవత్సరమే అయ్యింది. నేను కూడా ఆ పుస్తకం తీసుకోవడానికి మిగతా పిల్లలతో పాటు లైన్‌లో నిలబడడం నాకింకా గుర్తుంది.

1944​లో, లొరెయిన్‌తో

 అప్పటి పరిచర్యకు, ఇప్పటి పరిచర్యకు చాలా తేడా ఉంది. 1930లలో, మేము పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌లు ఉపయోగించి బైబిలు ప్రసంగాల రికార్డింగ్‌లను ఇంటి వ్యక్తులకు వినిపించేవాళ్లం. గుమ్మం దగ్గర నిలబడి ఫోనోగ్రాఫ్‌ తెరిచి, హ్యాండిల్‌ను రికార్డు అంచున పెట్టి, కాలింగ్‌ బెల్‌ నొక్కేవాళ్లం. ఇంటివ్యక్తి బయటికి రాగానే, మేము ఎందుకు వచ్చామో వాళ్లకు చెప్పి, నాలుగున్నర నిమిషాల బైబిలు ప్రసంగాన్ని వినిపించేవాళ్లం. ఆ తర్వాత ప్రచురణ అందించేవాళ్లం. మా ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా మర్యాదగా వినేవాళ్లు, ఎవ్వరూ వద్దనడం నాకు అస్సలు గుర్తులేదు. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాను. అప్పుడు మా నాన్న నాకు సొంత ఫోనోగ్రాఫ్‌ ఒకటి ఇచ్చారు. దాన్ని నేను పరిచర్యలో ఆనందంగా ఉపయోగించేదాన్ని. నేను లొరెయిన్‌ అనే మంచి సహోదరితో కలిసి పయినీరు సేవచేశాను.

 అప్పట్లో సమాచార ప్రదర్శనల ద్వారా కూడా మేము ప్రకటించేవాళ్లం. మేము వీధిలో నడుస్తున్నప్పుడు మాకు ముందువైపు ఒక ప్లకార్డ్‌ను, వెనుకవైపు ఒక ప్లకార్డ్‌ను తగిలించుకుని వెళ్లేవాళ్లం. వాటిమీద “మతం ఒక ఉరి, అదొక కుంభకోణం” “దేవునికీ రాజైన క్రీస్తుకూ సేవచేయండి” లాంటి నినాదాలు ఉండేవి.

ప్లకార్డులతో సాక్ష్యం ఇస్తున్నప్పుడు దిగిన ఫోటో

 కూటాలు మమ్మల్ని వ్యతిరేకతకు సిద్ధం చేశాయి, అలాగే సత్యాన్ని సమర్థిస్తూ ఎలా మాట్లాడాలో నేర్పించాయి. అనుకున్నట్టే, వ్యతిరేకత వచ్చింది. ఉదాహరణకు, రద్దీగా ఉండే షాపుల దగ్గర మేము మొదటిసారి పత్రికల్ని అందిస్తున్నప్పుడు పోలీసులు వచ్చి, మమ్మల్ని వ్యాన్‌లో ఎక్కించుకొని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వాళ్లు మమ్మల్ని కొన్ని గంటల తర్వాత విడిచిపెట్టారు. యెహోవాకు లోబడడం వల్ల హింసను అనుభవించినందుకు మేము సంతోషించాం.

పెళ్లి, గిలియడ్‌, అలాగే సైన్యంలో చేరమని పిలుపు

మా పెళ్లి రోజున యూజీన్‌, నేను

 కొంతకాలానికి, లొరెయిన్‌ నన్ను యూజీన్‌ రోశమ్‌ అనే సహోదరుడికి పరిచయం చేసింది. ఆమె అతన్ని మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో జరిగిన ఒక అసెంబ్లీలో కలిసింది. యూజీన్‌, ఫ్లోరిడాలోని కీవెస్ట్‌లో పెరిగాడు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడు, ఒక జాతీయ వేడుకలో పాల్గొనలేదని స్కూల్‌ నుండి పంపించేశారు. ఆ తర్వాత, యూజీన్‌ వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టాడు. ఒకరోజు తనతోపాటు చదువుకున్న ఒక అమ్మాయి ఆయన్ని కలిసింది. యూజీన్‌ బాగా చదివే అబ్బాయి కాబట్టి, స్కూల్‌ నుండి తనను ఎందుకు పంపించేశారా అని ఆమె ఆశ్చర్యపోయింది. యూజీన్‌ లేఖనాల ఆధారంగా ఇచ్చిన జవాబుల్ని బట్టి, ఆమె బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంది. ఆమె సత్యం నేర్చుకుని నమ్మకంగా దానిలో కొనసాగింది.

1951​లో, కీవెస్ట్‌లో

 1948​లో యూజీన్‌, నేను పెళ్లి చేసుకున్నాం. పెళ్లయ్యాక కీవెస్ట్‌లో మేము కలిసి పయినీరు సేవచేశాం. ఆ తర్వాత, గిలియడ్‌ పాఠశాల, 18వ తరగతికి మాకు ఆహ్వానం వచ్చింది. 1952, ఫిబ్రవరిలో మేము ఆ తరగతి నుండి పట్టభద్రులయ్యాం. అక్కడ ఒక క్లాస్‌లో స్పానిష్‌ భాష నేర్పించేవాళ్లు కాబట్టి, పాఠశాల పూర్తయ్యాక స్పానిష్‌ మాట్లాడే ఒక దేశానికి మమ్మల్ని మిషనరీలుగా పంపిస్తారని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. మేము గిలియడ్‌లో ఉన్నప్పుడు, కొరియాలో యుద్ధం జరుగుతుంది. దాంతో యూజీన్‌కి సైన్యంలో చేరమనే పిలుపు వచ్చింది. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడే మతపరిచారకుడు అనే కారణంగా యూజీన్‌కి సైన్యంలో చేరడానికి మినహాయింపు ఇచ్చారు. కానీ, ఈసారి పిలుపు రావడంతో సంస్థ మమ్మల్ని అమెరికాలోనే ఉండమని చెప్పింది. నేను బాగా నిరుత్సాహపడ్డాను, చాలా ఏడ్చాను. చివరికి రెండు సంవత్సరాల తర్వాత, యూజీన్‌కి సైన్యంలో చేరాల్సిన అవసరం లేదనే వార్త అందింది. అయితే, ఆ సంఘటన నుండి మేము ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. అదేంటంటే, ఒక దారి మూసుకుపోయినప్పుడు యెహోవా ఇంకో దారిని తెరుస్తాడు. ఆయన మా విషయంలో అదే చేశాడు. మనం చేయాల్సిందల్లా ఓర్పు చూపించడమే.

మా గిలియడ్‌ తరగతి

ప్రయాణ సేవ, ఆ తర్వాత కెనడాకు!

 ఆరిజోనాలోని టక్సన్‌లో ఉన్న స్పానిష్‌ భాషా సంఘంలో పయినీరు సేవ చేశాక, 1953​లో మమ్మల్ని ప్రాంతీయ సేవకు నియమించారు. కాలం గడుస్తుండగా మేము ఒహాయో, కాలిఫోర్నియా, న్యూయార్క్‌ సర్క్యూట్లలో సేవచేశాం. 1958​లో యూజీన్‌ని కాలిఫోర్నియాలో అలాగే ఓరేగాన్‌లో జిల్లా పర్యవేక్షకునిగా a నియమించారు. మేము ఎక్కడికి వెళ్లినా సహోదరుల ఇళ్లలోనే ఉండేవాళ్లం. ఆ తర్వాత 1960​లో మేము కెనడాకు వెళ్లాం. అక్కడ, యూజీన్‌ సంఘ పర్యవేక్షకుల కోసం జరిగే రాజ్య పరిచర్య పాఠశాల ఉపదేశకుడిగా సేవచేశాడు. మేము 1988 వరకు కెనడాలోనే ఉన్నాం.

 కెనడాలో నాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే నేనూ, ఇంకొక సహోదరి ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు గెయిల్‌ అనే ఆవిడను కలిశాం. తన ముగ్గురు అబ్బాయిలు వాళ్ల తాతయ్య చనిపోవడం వల్ల చాలా బాధలో ఉన్నారని ఆమె మాతో చెప్పింది. వాళ్లు ఆమెను, “తాతయ్య ఎందుకు చనిపోయాడు?” “ఆయన ఎక్కడికి వెళ్లాడు?” అని అడిగారు. ఆ ప్రశ్నలకు గెయిల్‌ జవాబు ఇవ్వలేకపోయింది. అప్పుడు మేము ఓదార్పునిచ్చే బైబిలు లేఖనాలను చూపించి, ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చాం.

 ఆ సమయంలో, యూజీన్‌ ప్రాంతీయ పర్యవేక్షకుడిగా ఆ సంఘాన్ని సందర్శిస్తున్నాడు కాబట్టి, మేము కేవలం ఒక్కవారమే అక్కడ ఉన్నాం. అయితే, మొదటిసారి గెయిల్‌ని కలిసినప్పుడు నాతోపాటు వచ్చిన సహోదరి మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లింది. దానివల్ల గెయిల్‌, ఆమె భర్త బిల్‌, వాళ్ల ముగ్గురు అబ్బాయిలు క్రిస్టఫర్‌, స్టీవ్‌, ప్యాట్రిక్‌ కూడా సత్యం తెలుసుకున్నారు. ఇప్పుడు క్రిస్టఫర్‌, కెనడాలో ఒక సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. స్టీవ్‌, ఫ్లోరిడాలోని పామ్‌ కోస్ట్‌లో బైబిల్‌ స్కూల్‌ ఉపదేశకుడిగా సేవ చేస్తున్నాడు. ప్యాట్రిక్‌, థాయ్‌లాండ్‌లో బ్రాంచ్‌ కమిటీ సభ్యుడిగా సేవ చేస్తున్నాడు. సంవత్సరాలు గడుస్తుండగా నేను, యూజీన్‌ ఆ కుటుంబానికి మంచి స్నేహితులుగా ఉన్నాం. వాళ్లు యెహోవాను తెలుసుకునేలా సహాయం చేయడంలో నాకు కూడా చిన్న వంతు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను!

ఆసుపత్రులు సందర్శించడం నుండి ఆసుపత్రి అనుసంధాన కమిటీలు ఏర్పడడం వరకు

 మేము కెనడాలో ఉన్నప్పుడు, యెహోవా యూజీన్‌కి మరో చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ సేవావకాశం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దాని గురించి నేనిప్పుడు చెప్తాను.

 కొన్ని సంవత్సరాల క్రితం వరకు, యెహోవాసాక్షులు రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరో ప్రజలకు అర్థమయ్యేది కాదు. దానివల్ల, చాలామంది మన గురించి తప్పుగా అనుకునేవాళ్లు. కెనడాలో ఉన్న వార్తాపత్రికలు, సాక్షులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్తం ఎక్కించకుండా అడ్డుపడుతున్నారని, పిల్లలు అందుకే చనిపోతున్నారని తప్పుడు వార్తల్ని ప్రచురించాయి. అయితే, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించడంలో సహాయం చేసే అవకాశం నా భర్తకు దొరికింది.

 1969​లో న్యూయార్క్‌లోని బుఫెలోలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి కాస్త ముందు, యూజీన్‌ అలాగే ఇంకొంతమంది సహోదరులు కలిసి ఆ ప్రాంతంలో ఉన్న పెద్దపెద్ద హాస్పిటల్స్‌కి వెళ్లారు. వాళ్లు వెళ్లి దాదాపు 50,000 మంది సాక్షులు కెనడా నుండి, యునైటెడ్‌ స్టేట్స్‌ నుండి ఆ సమావేశానికి వస్తారని హాస్పిటల్‌ వాళ్లకు సమాచారం ఇచ్చారు. సమావేశానికి వచ్చిన వాళ్లలో ఎవరికైనా వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ముందుగానే రక్తం విషయంలో మన అభిప్రాయం ఏంటో డాక్టర్లకు వివరించడం మంచిదని వాళ్లు అలా చేశారు. వాళ్లు రక్తరహిత చికిత్సకు సంబంధించి ప్రముఖ వైద్య పత్రికల్లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్‌ని డాక్టర్లకు ఇచ్చారు. డాక్టర్లు చక్కగా స్పందించడంతో, యూజీన్‌ అలాగే మరికొంతమంది సహోదరులు కెనడాలో కూడా హాస్పిటల్స్‌ని సందర్శించడం మొదలుపెట్టారు. అంతేకాదు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా సమర్థవంతంగా ఎలా వ్యవహరించాలో స్థానిక పెద్దలకు వివరించారు.

 మెల్లమెల్లగా, వాళ్లు చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు వచ్చాయి. నిజానికి మేము అస్సలు ఊహించని ఇంకొక ఏర్పాటుకు అది నడిపించింది! ఎలా?

టైలరింగ్‌లో ఆనందంగా పనిచేస్తూ

 దాదాపు 1985​లో, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి సహోదరుడు మిల్టన్‌ హెన్షల్‌ యూజీన్‌కి ఫోన్‌ చేశారు. అమెరికాలో అప్పటికే డాక్టర్లకు సమాచారాన్ని అందించే కార్యక్రమం నడుస్తుంది. దాన్ని ఇంకా విస్తృతం చేయాలని పరిపాలక సభ కోరుకుంది. కాబట్టి యూజీన్‌, నేను బ్రూక్లిన్‌కి వెళ్లాం. తర్వాత, పరిపాలక సభ 1988 జనవరిలో ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఆసుపత్రి సమాచార సేవలు అనే విభాగాన్ని ప్రారంభించింది. కొంతకాలానికి, నా భర్త అలాగే మరో ఇద్దరు సహోదరులు మొదట అమెరికాలో, ఆ తర్వాత వేరే దేశాల్లో సెమినార్లు చేయడానికి నియమించబడ్డారు. వెంటనే ఆ బ్రాంచీల్లో ఆసుపత్రి సమాచార విభాగాలు, వేర్వేరు నగరాల్లో ఆసుపత్రి అనుసంధాన కమిటీలు ఏర్పడ్డాయి. యెహోవా చేసిన ఈ ప్రేమపూర్వక ఏర్పాట్ల వల్ల ఎంతమంది సాక్షులు, వాళ్ల పిల్లలు ప్రయోజనం పొందారో మాటల్లో చెప్పలేను. యూజీన్‌ సెమినార్లు నిర్వహిస్తూ డాక్టర్లను కలవడానికి హాస్పిటల్స్‌కి వెళ్తే, నేను స్థానిక బెతెల్‌లో ఎక్కువగా టైలరింగ్‌ పనిలో లేదా కిచెన్‌లో సహాయం చేసేదాన్ని.

జపాన్‌లో, ఒక ఆసుపత్రి అనుసంధాన కమిటీ తరగతి

నాకు ఎదురైన అతిపెద్ద సవాలు

 2006​లో నా ప్రియమైన యూజీన్‌ని పోగొట్టుకున్నాను. అది నా జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలు. ఆయన ప్రేమను, తోడును నేను ఎంత మిస్‌ అవుతున్నానో మాటల్లో చెప్పలేను! అయితే, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి నాకు ఏది సహాయం చేసింది? చాలా విషయాలు సహాయం చేశాయి. ఉదాహరణకు, నేను ప్రార్థన చేయడం ద్వారా, క్రమంగా బైబిలు చదవడం ద్వారా యెహోవాకు దగ్గరగా ఉంటున్నాను. బెతెల్‌ కుటుంబంతో కలిసి దినవచనం చర్చను వింటాను. ఆ రోజు దినవచనం ఏ అధ్యాయం నుండి తీసుకున్నారో, ఆ బైబిలు అధ్యాయం మొత్తాన్ని చదువుతాను. అలాగే, టైలరింగ్‌ విభాగంలో నా బెతెల్‌ నియామకాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ బిజీగా ఉన్నాను. అది నిజంగా నాకు దొరికిన గొప్ప గౌరవం! మొదట్లో న్యూజెర్సీలో, న్యూయార్క్‌లో ఉన్న అసెంబ్లీ హాళ్లకు కర్టన్లు కుట్టే అవకాశం కూడా నాకు దొరికింది. ఇప్పుడైతే నేను ఫిష్‌కిల్‌ బెతెల్‌లో ఉంటూ కుట్టుపనుల్ని, ఇతర చిన్నచిన్న పనుల్ని చేస్తున్నాను. b

 నావరకైతే, నా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు యెహోవాను ప్రేమించడం అలాగే ఆయనకు, ఆయన సంస్థకు లోబడడం. (హెబ్రీయులు 13:17; 1 యోహాను 5:3) ఆ విషయాలకు నేనూ, యూజీన్‌ మొదటిస్థానం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. దానివల్ల, యెహోవా పరదైసు భూమ్మీద శాశ్వత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడని, అలాగే మేమిద్దరం తిరిగి కలుసుకుంటామని పూర్తి నమ్మకం నాకుంది.—యోహాను 5:28, 29.

a ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘాల్ని సందర్శిస్తే, జిల్లా పర్యవేక్షకులు సర్క్యూట్లను సందర్శించి ప్రాంతీయ సమావేశాల్లో ప్రసంగాలు ఇస్తారు.

b 2022 మార్చిలో, ఈ ఆర్టికల్‌ని తయారు చేస్తున్నప్పుడు సహోదరి కమిల్లా రోశమ్‌ చనిపోయింది. అప్పుడు ఆమె వయసు 94.