డొరినా కాపారెల్లి | జీవిత కథ
నేను బిడియస్థురాలినే, కానీ సాహసంతో మళ్లీ అవే నిర్ణయాలు తీసుకుంటాను!
నాకు చిన్నప్పటినుండి మొహమాటం, సిగ్గు బాగా ఎక్కువ. అందుకే యెహోవా సేవలో నేను చేసిన కొన్ని సాహసాల గురించి ఆలోచించినప్పుడు, అసలు అవన్నీ చేసింది నేనేనా అనిపిస్తుంటుంది.
నేను 1934 లో, ఎడ్రియాటిక్ సముద్ర తీరంలో ఉన్న పెస్కారా నగరంలో పుట్టాను. ఇది ఇటలీలో మధ్య తూర్పున ఉన్న కోస్తా నగరం. మేము మొత్తం నలుగురు అక్కాచెల్లెళ్లం, నేను చిన్నదాన్ని. మా నాన్న నాకు డొరినా అనే పేరు పెట్టాడు.
నాన్నకు దేవుని గురించి నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. 1943 జూలైలో, మొట్టమొదటిసారి లీబరాటో రీచి అనే ఆయన ద్వారా యెహోవాసాక్షుల గురించి నాన్నకు తెలిసింది. అప్పటికి రీచి యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుంటున్నాడు. ఆయన నాన్నకు బైబిలు గురించి చెప్పి, ఒక కావలికోట పత్రిక ఇచ్చాడు. కొంతకాలానికే నాన్న తను నేర్చుకుంటున్న విషయాల గురించి ఇతరులకు ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మ కూడా సత్యాన్ని అంగీకరించింది. ఆమెకు చదువు రాకపోయినా లేఖనాల్ని కంఠస్తం చేసేది, వాటిని ఉపయోగిస్తూ తను కొత్తగా నేర్చుకుంటున్న సత్యం గురించి ఇతరులకు చెప్పేది.
మేముండే ఇల్లు చాలా చిన్నది, రెండే బెడ్‌రూంలు ఉండేవి. కానీ అది ఎప్పుడూ సహోదరసహోదరీలతో కిటకిటలాడుతుండేది. ఎందుకంటే మీటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే జరిగేవి. ప్రాంతీయ పర్యవేక్షకులు గానీ, పయినీర్లు గానీ వస్తే వాళ్లకు కూడా మా ఇంట్లోనే వసతి ఏర్పాటు చేసేవాళ్లం.
మా ఇద్దరు అక్కలకు బైబిలు విషయాలంటే అంత ఆసక్తి ఉండేది కాదు. కొంతకాలానికి వాళ్లు ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ నేనూ, మా మూడో అక్క మాత్రం నాన్న బైబిలు చదువుతుంటే ఇష్టంగా వినేవాళ్లం. అప్పటికి మాదింకా చిన్న గ్రూపే కాబట్టి ప్రసంగాలు ఇవ్వడానికి అప్పుడప్పుడు సహోదరులు వచ్చేవాళ్లు. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహకరమైన ప్రసంగాల్ని మేం చాలా ఆనందించాం.
నేను తరచూ మా నాన్నతో, ఇతర సహోదరసహోదరీలతో ప్రీచింగ్‌కి వెళ్లేదాన్ని. కానీ బిడియస్థురాలిని కాబట్టి, ధైర్యం కూడగట్టుకుని ఇంటివ్యక్తులతో మాట్లాడడానికి కొన్ని నెలలు పట్టింది. యెహోవాపై ఉన్న ప్రేమ మాత్రం పెరుగుతూ వచ్చింది. 1950, జూలైలో బాప్తిస్మం తీసుకున్నాను. ఒక సహోదరుడు మా ఇంట్లోనే బాప్తిస్మం ప్రసంగం ఇచ్చాడు; తర్వాత నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ బాప్తిస్మం ఇచ్చారు. తర్వాతి సంవత్సరం, మా ప్రాంతానికి ఒక జంటను ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. ప్రీచింగ్‌కి ఎక్కువగా వాళ్లతోనే వెళ్తుండేదాన్ని. అలా వెళ్లేకొద్దీ నా బిడియం తగ్గుతూ వచ్చింది. తర్వాత్తర్వాత, ఇలాంటి ఒక అద్భుతమైన పద్ధతిలో యెహోవా సేవ చేయడం నాకు బాగా నచ్చింది.
నా జీవితాన్ని మార్చేసిన నిర్ణయం
మా మొదటి ప్రాంతీయ పర్యవేక్షకుని పేరు ప్యేరో గాట్టీ. a ఆయన నన్ను పయినీరు సేవ చేయమనే కాదు, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న చోటికి వెళ్లమని కూడా ప్రోత్సహించాడు. అసలు నేను దానిగురించి ఆలోచించనేలేదు. సాధారణంగా మా ప్రాంతంలో, ఆడపిల్లలు పెళ్లయ్యే వరకు ఇల్లు వదిలి ఇంకో చోటికి వెళ్లరు. అందుకే 1952, మార్చిలో మా ఊర్లోనే పయినీరింగ్ మొదలుపెట్టాను. నేను తీసుకున్న ఆ నిర్ణయం ముందుముందు నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఊహించలేదు.
అదేసమయంలో, ఆనా అనే 21 ఏళ్ల సహోదరి కూడా పయినీరు సేవ మొదలుపెట్టాలని అనుకుంది. ఇద్దరం కలిసి ప్రీచింగ్‌కి వెళ్లొచ్చనే ఉద్దేశంతో తను వచ్చి మా ఇంట్లోనే ఉంది. 1954 లో మా ఇద్దర్నీ పెరూజియా నగరానికి ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. అది మా ఊరు నుండి 250 కి.మీ. దూరంలో ఉంది. అప్పటికి అక్కడ యెహోవాసాక్షులు ఒక్కరు కూడా లేరు.
అది నిజంగా నేను చేసిన సాహసమనే చెప్పాలి! ఎందుకంటే అప్పుడు నాకు 20 ఏళ్లే. మా అమ్మానాన్నలతో కలిసి సమావేశాలకు వెళ్లడానికి తప్పితే, నేను ఒంటరిగా ఊరు వదిలి వెళ్లిందేలేదు. ఇప్పుడు ప్రత్యేక పయినీరుగా ఇంకో ఊరికి వెళ్తుంటే ఏదో వేరే ప్రపంచానికి వెళ్తున్నట్టు అనిపించింది. నేనూ, ఆనా మాత్రమే ఒంటరిగా ఉండాల్సి వస్తున్నందుకు నాన్న కాస్త కంగారుపడ్డాడు. ఆయన మాతోపాటే వచ్చి ఇల్లు వెదకడానికి సహాయం చేశాడు. మేం ఒక రూమ్‌ను అద్దెకు తీసుకున్నాం; దాన్నే రాజ్యమందిరంగా కూడా వాడాం. మొదట్లో మేమిద్దరమే మీటింగ్స్ జరుపుకునేవాళ్లం. పెరూజియాలో, దాన్ని చుట్టుపక్కల పట్టణాల్లో-పల్లెల్లో మేం కష్టపడి చేసిన పరిచర్యకు మంచి ఫలితాలొచ్చాయి. దాదాపు సంవత్సరం తర్వాత, ఒక సహోదరుడు పెరూజియా నగరంలో ఉండడానికి వచ్చాడు; ఆయనే మీటింగ్స్ జరిపేవాడు. 1957 లో మాకు వేరే ప్రాంతంలో నియామకం ఇచ్చారు. ఈలోపు పెరూజియాలో ఒక చిన్న సంఘం ఏర్పడింది.
మా తర్వాతి నియామకం ఎక్కడో తెలుసా? ఇటలీ మధ్యలో ఉన్న టేర్ని అనే చిన్న పట్టణంలో. అక్కడ ఎప్పుడెప్పుడు ప్రీచింగ్ చేద్దామా అని చాలా ఆత్రంగా ఎదురుచూశాం. ఎందుకంటే ఆసక్తివున్నవాళ్లు అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. నియంతృత్వ పాలన 1943 లోనే అధికారికంగా ముగిసిపోయినా, కొంతమంది అధికారులు మాత్రం బైబిలు సందేశాన్ని ప్రకటించకుండా యెహోవాసాక్షులకు అడ్డుపడుతూ వచ్చారు. ఇంటింటి పరిచర్య చేయడానికి లైసెన్స్ తెచ్చుకోమని ఒత్తిడి చేశారు.
మా ప్రాంతంలో పోలీసులు తరచూ యెహోవాసాక్షుల్ని ఫాలో చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గుంపులో కలిసిపోయి తప్పించుకునేవాళ్లం; కానీ అన్నిసార్లూ అది కుదిరేదికాదు. నన్నైతే రెండుసార్లు అరెస్టు చేశారు. మొదటిసారి, ప్రాంతీయ పర్యవేక్షకునితో ప్రీచింగ్ చేస్తున్నప్పుడు అరెస్టు అయ్యాను. మా ఇద్దర్నీ స్టేషన్‌కి తీసుకెళ్లి, చట్టపరమైన అనుమతి లేకుండా ప్రీచింగ్ చేస్తున్నందుకు ఫైన్ కట్టమన్నారు. మేం చట్టాన్ని మీరట్లేదు కాబట్టి కట్టమని చెప్పాం. ఆరోజు నాకెంత భయమేసిందంటే, నా గుండె చప్పుడు నాకే వినిపించింది. కానీ తోడుగా ప్రాంతీయ పర్యవేక్షకుడు కూడా ఉన్నందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆరోజు నాకు, “భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని యెషయా 41:13 లో ఉన్న మాటలు గుర్తొచ్చి ధైర్యంగా అనిపించింది. ఈ కేసు కోర్టుకు వెళ్లినప్పుడు, మేము తప్పు చేసినట్టు సాక్ష్యాలేమీ లేనందుకు కేసును కొట్టేస్తున్నట్టు జడ్జి తీర్పు ఇచ్చాడు. దాంతో మమ్మల్ని రిలీజ్ చేశారు. సుమారు ఆరు నెలల తర్వాత మళ్లీ రెండోసారి నన్ను అరెస్టు చేశారు. ఈసారి ఒక్కదాన్నే ఉన్నాను. కానీ నేను నిర్దోషినని జడ్జి తీర్పు ఇవ్వడంతో కేసు కొట్టేశారు.
యెహోవా సేవ చేయడానికి మరిన్ని అవకాశాలు దొరికాయి
1954 లో ఇటలీ దక్షిణ భాగాన ఉన్న నేపిల్స్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఎదురుచూశాను. అక్కడికి వెళ్లాక హాలు క్లీనింగ్‌లో సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకెళ్లాను. నన్ను ప్లాట్‌ఫాం భాగాన్ని శుభ్రం చేయమన్నారు. అటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక అందమైన బ్రదర్ అక్కడ నాకు కనిపించారు. ఆయన పేరు ఆంటోనియో కాపారెల్లి, లిబియాలో పయినీరుగా సేవచేస్తున్నాడు. 1930 చివరినాళ్లలో ఆయన కుటుంబం ఇటలీ నుండి లిబియాకు వెళ్లిపోయింది.
ఆంటోనియో చాలా ఉత్సాహంగా, ధైర్యంగా ఉండేవాడు. లిబియాలోని ఒక ఎడారిలో జీవిస్తున్న ఇటలీ ప్రజలకు ప్రకటించడానికి మోటర్ బైక్ మీద ఒక్కడే వెళ్లాడు. మేం అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అయితే 1959 లో ఆయన ఇటలీకి తిరిగొచ్చేశాడు. దానికన్నా ముందు రోములో ఉన్న బెతెల్‌లో కొన్ని నెలలు సేవచేశాడు. ఆ తర్వాత ఆయన్ని ఇటలీ దక్షిణ భాగంలో ఉన్న విటెర్బో నగరానికి ప్రత్యేక పయినీరుగా నియమించారు. కొంతకాలానికి మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది; 1959, సెప్టెంబరు 29న పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి విటెర్బోలో సేవచేశాం.
మేం ఉండడానికి, మీటింగ్స్ జరుపుకోవడానికి ఒక చోటు అవసరమైంది. మొత్తానికి ఎలాగోలా ఒక గది అద్దెకు దొరికింది. అది చూడ్డానికి చిన్న షాపులా ఉండేది, వెనుక వైపు చిన్న బాత్రూం ఉండేది. ఆ గదిలో ఒక మూల మా బెడ్ వేసుకున్నాం; అది కనబడకుండా ఒక స్క్రీన్ అడ్డుపెట్టాం. స్క్రీన్ దగ్గరనుండి మిగతా గదినంతా హాలులాగానీ, మీటింగ్ ఉన్న రోజైతే కింగ్‌డమ్ హాలులా గానీ వాడుకునేవాళ్లం. ఒకవేళ నాకు పెళ్లవ్వకుండా ఉండుంటే ఈ గదిని అసలు అద్దెకు తీసుకునేదాన్నే కాదు. ఆంటోనియో కూడా తోడుగా ఉన్నాడు కాబట్టే ఇద్దరం కలిసి అక్కడ ఉండగలిగాం.
1961 లో ఆంటోనియోను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. దానికన్నా ముందు కాంగ్రిగేషన్ సర్వెంట్లకు లేదా పర్యవేక్షకులకు ఒక నెలపాటు జరిగే పాఠశాలకు రమ్మని ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఆ నెలరోజులు నేను ఒంటరిగా ఉండాలి. అప్పుడు నా పరిస్థితిని తలచుకుంటే నామీద నాకే జాలేసింది. ముఖ్యంగా ఆ చిన్న గదిలో సాయంత్రాలు ఉండడం కష్టంగా అనిపించేది. కానీ యెహోవా ఆంటోనియోను ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషపడ్డాను. ఆయన లేనన్ని రోజులు ఏదోక పనిచేస్తూ బిజీగా ఉండేదాన్ని, దానివల్ల టైం తెలీకుండానే గడిచిపోయింది.
ఆయన ప్రాంతీయ పర్యవేక్షకునిగా ఉన్నప్పుడు మేం చాలా ఊళ్లకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న వెనెటో ప్రాంతం మొదలుకొని, దక్షిణ భాగంలో ఉన్న సిసిలీ వరకు వెళ్లాం. మొదట్లో మాకు కారు ఉండేదికాదు. అందుకే బస్సుల్లో, ట్రైనుల్లో వెళ్లేవాళ్లం. ఒకసారైతే సిసిలీలోని ఒక పల్లెకు వెళ్లడానికి బస్సు ఎక్కాం, ఆ దారంతా ఒకటే గతుకులు. ఊరు చేరుకునేసరికి మాకోసం బస్టాండ్‌లో సహోదరులు ఎదురుచూస్తూ ఉన్నారు. మా లగేజీని మోసుకెళ్లడానికి ఒక గాడిదను కూడా తీసుకొచ్చారు. ఆ రోజు ఆంటోనియో సూటుబూటు వేసుకుని టై కట్టుకుని ఉన్నాడు, నేనేమో మీటింగ్ డ్రెస్‌లో ఉన్నాను. ఇలా తయారైవున్న మేము, గాడిదమీద సూట్‌కేసులు-టైప్ రైటర్ పెట్టుకుని రావడం, మాతోపాటు రైతులు నడవడం, ఇవన్నీ చూసి జనాలు బాగా నవ్వుకొని ఉంటారు.
అక్కడ సహోదరులది ఎంత పెద్ద మనసంటే, వాళ్లకున్నదే తక్కువైతే అందులో మళ్లీ మాకు కూడా ఇచ్చేవాళ్లు. అక్కడ కొన్ని ఇళ్లకు బాత్రూం ఉండేదికాదు, నీళ్ల సదుపాయం కూడా ఉండేదికాదు. ఒక సందర్భంలోనైతే, కొన్నేళ్లుగా ఎవ్వరూ వాడని గదిలో మేం ఉండాల్సివచ్చింది. ఆరోజు రాత్రి పడుకున్నాక, నిద్రలో నేను తెగ కదిలిపోతూ ఉన్నాను. దాంతో ఆంటోనియో నన్ను నిద్ర లేపాడు. ఇద్దరం దుప్పటి ఎత్తి చూస్తే పరుపు నిండా పుట్టలుపుట్టలుగా పురుగులు కనిపించాయి! ఒళ్లంతా జలదరించింది. కానీ అంత అర్థరాత్రి ఎవరు మాత్రం ఏం చేయగలరు! అందుకే వీలైనన్ని పురుగుల్ని కిందకు తోసేసి మళ్లీ ఇద్దరం అదే మంచం మీద పడుకున్నాం.
అయితే ఇవేవీ నాకు పెద్ద ఇబ్బందుల్లా అనిపించలేదు. నాకున్న అత్యంత పెద్ద ఇబ్బందల్లా నా బిడియమే. మేం ప్రాంతీయ సందర్శనానికి వెళ్లిన మొట్టమొదటి సంఘంలో కొత్త స్నేహితుల్ని చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ అందర్నీ ప్రోత్సహించేలా మాట్లాడాలి, సహోదరీలకు సహాయం చేయాలి అనుకున్నాను కాబట్టి వాళ్లతో కలిసిపోవడానికి శాయశక్తులా కృషిచేశాను. యెహోవా సహాయం వల్ల, విజిట్ అయ్యేలోపు అందరితో కలిసిపోయాను. ఇచ్చే గుణం, నమ్మకం, యెహోవా మీద ప్రేమ ఉన్న సహోదర సహోదరీలతో కలిసి పనిచేసే అవకాశం దొరకడం నిజంగా ఒక దీవెన.
కొన్నేళ్లపాటు ఆంటోనియో ప్రాంతీయ పర్యవేక్షకునిగా, జిల్లా పర్యవేక్షకునిగా b సేవ చేశాడు. 1977 లో మమ్మల్ని రోములో ఉన్న బెతెల్‌కు రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాతి సంవత్సరంలో, అంటే 1978 లో జరగనున్న “విక్టోరియస్ ఫెయిత్” అనే అంతర్జాతీయ సమావేశానికి ఏర్పాట్లు చేయడానికే మమ్మల్ని బెతెల్‌కి పిలిచారు. కొన్ని నెలల తర్వాత, అక్కడే ఉండిపోయి సేవ చేయమన్నారు. కొంతకాలానికి ఆంటోనియో బ్రాంచి కమిటీ సభ్యుడయ్యాడు.
బెతెల్‌లో పనిచేయడం చాలా కొత్తగా అనిపించింది. కానీ మళ్లీ నా బిడియంవల్ల, అక్కడున్న వాళ్లందరితో కలిసిపోవడం కాస్త కష్టంగా అనిపించింది. అయితే యెహోవా దీవెనలు, తోటి బెతెల్ కుటుంబసభ్యుల సహాయం ఉండడంవల్ల కొంతకాలానికే ఆ బిడియం పోయింది. బెతెల్‌లో ఉన్నంతకాలం మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది.
కొత్త సమస్యలు
ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు ఎదురయ్యాయి. 1984 లో ఆంటోనియోకు గుండె సర్జరీ జరిగింది. సుమారు పదేళ్ల తర్వాత ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. 1999 లో ఆయనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. మాములుగానైతే, ఆయన చలాకీగా ఉంటాడు. కానీ ఈ భయంకరమైన వ్యాధి నుండి మాత్రం కోలుకోలేకపోయాడు. కళ్లముందే ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంటే గుండె పిండేసినట్టు అయ్యేది. నా భర్తను చూసుకోవడానికి కావల్సిన శక్తిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థిస్తూ ఉండేదాన్ని, దాంతోపాటు కీర్తన పుస్తకాన్ని కూడా తరచూ చదివేదాన్ని. కంగారుగా అనిపించినప్పుడు అవే నాకు ఓదార్పునిచ్చాయి. సుమారు 40 ఏళ్లు నాతో కలిసి జీవించిన నా భర్త, 1999, మార్చి 18న చనిపోయాడు.
చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు చాలా ఒంటరిగా అనిపించేది. కానీ తోటి బెతెల్ కుటుంబ సభ్యులు, ప్రయాణసేవలో మాకు పరిచయమైన సహోదర సహోదరీలు నామీద ప్రేమ చూపించారు, ఓదార్చారు. కానీ గుండెల్లో ఉన్న బాధ మాత్రం తగ్గేది కాదు. ముఖ్యంగా, బెతెల్‌లో సాయంత్రం పూట రూంకి వెళ్లాక ఏదో వెలితిగా అనిపించేది, ఆ బాధను మాటల్లో చెప్పలేను. మనసుకైన గాయాల్ని కాలం మాన్పుతుంది అంటారు, నా విషయంలో కూడా అదే జరిగింది. అయితే కాలం ఒక్కటే కాదు; ప్రార్థన, వ్యక్తిగత అధ్యయనం కూడా నేను కోలుకోవడానికి చాలా సహాయం చేశాయి. కొంతకాలానికి, గతాన్ని తలచుకొని బాధపడడం మానేసి ఆంటోనియోతో ఉన్న తీపి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ సంతోషపడేదాన్ని. మేమిద్దరం కలిసి చేసిన పనుల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాను. ఆయన యెహోవా జ్ఞాపకంలో పదిలంగా ఉన్నాడు. ఆయన పునరుత్థానం అయ్యాక, మేమిద్దరం మళ్లీ కలిసే రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను.
బెతెల్‌లో చాలా రకాల పనులు చేశాను, ప్రస్తుతమైతే టైలరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. నా బెతెల్ కుటుంబానికి ఉపయోగపడే పనిచేస్తున్నందుకు ఆనందంగా అనిపిస్తుంది. ప్రీచింగ్‌లో కూడా బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకప్పుడు చేసినంతైతే చేయలేకపోతున్నాను, కానీ నా శక్తిమేరకు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రీచింగ్ చేయడమంటే నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టం. ఆ పని ఎంత బాగుంటుందో నాకు తెలుసు, అందుకే ఇప్పుడున్న యౌవనుల్ని కూడా పయినీరింగ్ చేయమని ప్రోత్సహిస్తుంటాను.
నేను పూర్తికాల సేవ మొదలుపెట్టి సుమారు 70 ఏళ్లు గడిచిపోయాయి! ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, యెహోవా నాకెంత సహాయం చేశాడో, దీవించాడో అనిపిస్తుంది. ఇన్నేళ్లలో నేను ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్లాను, ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే విషయాల్ని కళ్లారా చూశాను, నాకు ఆదర్శంగా నిలిచిన ఎంతోమందిని కలిశాను. యెహోవా సహాయం లేకపోయింటే ఇవేవీ చేసుండేదాన్ని కాదు. చివరిగా ఒక్కటి మాత్రం చెప్పగలను; నేను బిడియస్థురాలినే, కానీ అవకాశం వస్తే సాహసంతో మళ్లీ అవే నిర్ణయాలు తీసుకుంటాను!
a “ఒకప్పుడు నేను చావుకు భయపడ్డాను,” ప్యేరో గాట్టీ జీవిత కథ 2011, జూలై 15 కావలికోట సంచికలో ఉంది.
b ఒక జిల్లా పర్యవేక్షకుడు సేవచేసే సర్క్యూట్లు అన్నిటినీ కలిపి జిల్లా అంటారు.