కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిల్టియాడిస్‌ స్టావ్‌రోవ్‌ | జీవిత కథ

“యెహోవా మా మీద శ్రద్ధ చూపించాడు, మమ్మల్ని నడిపించాడు”

“యెహోవా మా మీద శ్రద్ధ చూపించాడు, మమ్మల్ని నడిపించాడు”

నేను లెబనాన్‌లోని ట్రిపోలిలో ఉండేవాడిని. నాకు సుమారు 13 ఏళ్లున్నప్పుడు, నా వయసు పిల్లల్లాగే నాకు కూడా మా వీధిలో వెళ్లే కార్లను చూడడమంటే ఇష్టం. ఒకరోజు సిరియాకు చెందిన ఒకతను రెడ్‌ కలర్‌ అమెరికన్‌ కారు వేసుకుని వెళ్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఇంతలో మా ఊరిలోని ఆర్థడాక్స్‌ చర్చి ప్రీస్టు, ఆ కారు మీద రాళ్లు విసరమన్నాడు. ఆశ్చర్యపోయాను! ఆ కారు ఒక యెహోవాసాక్షిది అయినందుకు అతనలా చేయమన్నాడు.

 రాళ్లు విసిరితే డ్రైవర్‌కు ఏదైనా అవుతుందేమో అన్నాం. దానికి ఆ ప్రీస్టు, “అతన్ని చంపేయండి. మీ చేతులకు అంటిన రక్తాన్ని నా అంగీతో తుడిచేసుకోండి” అన్నాడు. అప్పటిదాకా గ్రీకు ఆర్థడాక్స్‌ మతంలో ఉన్నందుకు గర్వపడిన నేను, ప్రీస్టు కోపంతో అన్న ఆ మాటలు విన్నాక కొంతకాలానికి ఆ మతాన్ని విడిచిపెట్టేశాను. యెహోవా గురించిన సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ సంఘటనే సహాయం చేసిందని ఎప్పుడూ అనుకుంటాను.

యెహోవా గురించి ఎలా తెలుసుకున్నానంటే ...

 నేను పెరిగిన ట్రిపోలి పట్టణంలో ఓడరేవు ఉండేది. రకరకాల సంస్కృతుల, భాషల, మతాల ప్రజలతో ఆ పట్టణం ఎప్పుడూ కిటకిటలాడేది. అక్కడుండే ప్రతీ కుటుంబం, వాళ్ల సంస్కృతి గురించి గర్వంగా ఫీలయ్యేవాళ్లు; మా కుటుంబం కూడా అంతే. నేనూ మా అన్నలూ ’సోల్జర్స్‌ ఆఫ్‌ ఫెయిత్‌’ అనే గుంపులో చేరాం, a వాళ్లకు యెహోవాసాక్షులంటే అస్సలు పడదు. మేమైతే యెహోవాసాక్షుల్ని ఎప్పుడూ కలవలేదు; కానీ వాళ్లు గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చిని ద్వేషించే ఒక గ్యాంగ్‌ అనీ, వాళ్ల నాయకుడు యెహోవా అనీ మా ప్రీస్టు చెప్పాడు. యెహోవాసాక్షులు ఎక్కడ ఎదురుపడినా వాళ్లమీద దాడి చేయమని ఆయన మాకు పదేపదే చెప్తుండేవాడు.

 మా అన్నయ్యల్లో ముగ్గురు యెహోవాసాక్షుల్ని కలిశారు, కానీ ఆ విషయం నాకు తెలీదు. మా అన్నయ్యలు వాళ్లమీద దాడిచేసే బదులు, యెహోవాసాక్షుల బోధలు తప్పని నిరూపించడానికి స్టడీకి ఒప్పుకున్నారు. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి మా హాలు నిండా యెహోవాసాక్షులు ఉన్నారు. వాళ్లు మా ఇంట్లోవాళ్లతో, పక్కింటివాళ్లతో బైబిలు గురించి చర్చిస్తున్నారు. మా అన్నలు ఆర్థడాక్స్‌ నమ్మకాల్ని పక్కనపెట్టి, వీళ్ల మాటలు ఎందుకు వింటున్నారో నాకు అర్థంకాలేదు. చాలా కోపం వచ్చింది. నేను అక్కడినుండి వెళ్లిపోతుండగా మా పక్కింటాయన ఒకరు నన్ను పిలిచి కూర్చొని వినమని చెప్పాడు. ఆయన బాగా పేరున్న పళ్ల డాక్టర్‌ (డెంటిస్ట్‌), పైగా యెహోవాసాక్షి కూడా. ఇంతలో మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకతను, నా బైబిలు నుండి కీర్తన 83:18 లోని మాటల్ని అందరికీ వినబడేలా చదువుతున్నాడు. మా ప్రీస్టు చెప్పిందంతా అబద్ధమని ఆ క్షణం నాకు అర్థమైంది. యెహోవా ఒక గ్యాంగ్‌ లీడర్‌ కాదు, ఆయన మాత్రమే సత్యదేవుడని తెలుసుకున్నాను!

నేను బాప్తిస్మం తీసుకున్న వెంటనే

 యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, మా ఇంట్లో జరిగే బైబిలు స్టడీలో కూర్చోవడం మొదలుపెట్టాను. మాకు స్టడీ ఇచ్చే సహోదరుడి పేరు మిషెల్‌ అబూడ్‌. ఒకరోజు మా స్టడీలో కూర్చున్న నా ఫ్రెండ్‌ ఒకతను, “దేవున్ని ఎవరు సృష్టించారు?” అని ఆ సహోదరుడిని అడిగాడు. నిజానికి నేను కూడా చిన్నప్పటినుండి ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఆయన సోఫా మీద పడుకున్న పిల్లిని చూపించి, పిల్లులు ఎలాగైతే మనుషుల మాటల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోలేవో; మనం కూడా దేవుని గురించి చాలా విషయాల్ని అర్థం చేసుకోలేమని వివరించాడు. సహోదరుడు చెప్పిన ఆ చిన్న ఉదాహరణ విన్నాక, నేను యెహోవా గురించి కొన్ని విషయాలు ఎందుకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానో తెలిసింది. నేను 1946 లో, అంటే నాకు 15 ఏళ్లున్నప్పుడు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాను.

పయినీరు సేవ నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చింది

 1948 లో నేను కూడా మా అన్న హన్నాతో కలిసి ఫోటోగ్రాఫర్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. మా షాపు పక్కనే నజీబ్‌ సాలెం b అనే సహోదరుని పెయింట్‌ షాపు ఉండేది. ఆయనకు 100 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయాడు. జీవించినంతకాలం ఆయన ఏమాత్రం భయపడకుండా మంచివార్త ప్రకటించాడు. కొన్నిసార్లు పల్లెటూళ్లలో ప్రకటించడానికి వెళ్లేటప్పుడు, ఆయనతోపాటు నేను కూడా వెళ్లేవాడిని. వ్యతిరేకత ఉన్నా ఆయనెంత ధైర్యంగా ప్రకటించాడో కళ్లారా చూశాను. ఏ మతానికి చెందిన వాళ్లతోనైనా ఆయన చాలా సునాయాసంగా బైబిలు గురించి మాట్లాడేవాడు. ఆయన చక్కని ఆదర్శాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

నజీబ్‌ సాలెం (వెనుక వరుసలో, కుడివైపున) ఆదర్శాన్ని ఎప్పటికీ మర్చిపోలేను

 మేం ఒకరోజు షాపులో ఉన్నప్పుడు, అమెరికాలో ఉండే మారీ షాయా అనే లెబనీస్‌ సహోదరి మా షాపుకు వచ్చింది. ఒక తల్లిగా ఆమెకు చాలా బాధ్యతలు ఉన్నా, వాటన్నిటినీ పూర్తి చేసుకొని ఉత్సాహంగా పయినీరు సేవ కూడా చేసేది. ఆ రోజు ఆమెను కలిశాక నా జీవితమే మారిపోయింది. ప్రీచింగ్‌లో ఎదురైన అనుభవాల గురించి చెప్తూ ఆ రోజు ఆమె రెండు గంటలు పైనే మాతో ఉంది. తర్వాత వెళ్లిపోతూ నన్ను చూసి ఇలా అంది: “మిల్టో, నీకింకా పెళ్లి కాలేదు కాబట్టి పయినీరు సేవ చేయొచ్చు కదా.” నన్ను నేను పోషించుకోవడానికి ఉద్యోగం చేయాలి కాబట్టి కుదరదు అన్నాను. దానికి ఆమె, “నేను ఈరోజు మీతో ఎంతసేపు ఉన్నాను?” అని అడిగింది. “రెండు గంటలు పైనే” అని చెప్పాను. అప్పుడు ఆమె, “ఈ రెండు గంటలు నువ్వు పెద్దగా పని చేసినట్టు నాకు కనిపించలేదు. ఈ టైమ్‌నే ప్రతీరోజు ప్రీచింగ్‌కి ఉపయోగిస్తే నువ్వు పయినీరు సేవ చేయొచ్చు. ముందు ఒక సంవత్సరం చేసి చూడు. దాన్ని కొనసాగించాలో లేదో తర్వాత ఆలోచించుకో” అంది.

 మా సంస్కృతిలో ఆడవాళ్లు ఇచ్చే సలహాల్ని మగవాళ్లు పట్టించుకోరు. కానీ ఈ సహోదరి ఇచ్చిన సలహా నాకు మంచిగా అనిపించింది. రెండు నెలల తర్వాత, అంటే 1952, జనవరిలో పయినీరు సేవ మొదలుపెట్టాను. దాదాపు 18 నెలల తర్వాత, గిలియడ్‌ పాఠశాల 22వ తరగతికి రమ్మని నాకు ఆహ్వానం వచ్చింది.

1953 లో గిలియడ్‌ పాఠశాలకు వెళ్తున్నప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు నాకు బై చెప్పడానికి వచ్చారు

 అది పూర్తయ్యాక మధ్యప్రాచ్య దేశాల్లో లేదా మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో నాకు నియామకం ఇచ్చారు. తర్వాత ఒక సంవత్సరంలోపే డోరిస్‌ ఉడ్‌ని పెళ్లి చేసుకున్నాను. ఇంగ్లండ్‌కు చెందిన ఆ సహోదరి కూడా అప్పటికి మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లోనే మిషనరీగా సేవచేస్తోంది.

సిరియాలో బైబిలు సత్యాలు ప్రకటించాం

 పెళ్లయిన కొంతకాలానికే నన్నూ, డోరిస్‌ను సిరియాలోని అలెప్పో ప్రాంతానికి నియమించారు. అక్కడ ప్రకటనా పనిమీద నిషేధం ఉంది. కాబట్టి, తెలిసినవాళ్లు ఎవరైనా ఫలానావాళ్లకు ఆసక్తివుందని చెప్తే, వెళ్లి వాళ్లను కలిసేవాళ్లం. మేం చేసిన స్టడీలు చాలావరకు అలాంటివే.

 అలానే ఒకరోజు ఆసక్తి చూపించిన ఒకామె ఇంటికెళ్లాం. ఆమె వణికిపోతూ తలుపు తీసి, “జాగ్రత్త! ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్లారు. మీకోసం వెతుకుతున్నారు” అని అంది. మేం ఎక్కడెక్కడ బైబిలు స్టడీలు చేస్తున్నామో సీక్రెట్‌ పోలీసులకు తెలిసిపోయింది. వెంటనే మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న సహోదరులకు ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పాం. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోమని వాళ్లు సలహా ఇచ్చారు. మా స్టడీ వాళ్లందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధగా అనిపించినా, యెహోవా ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్నాడని అర్థంచేసుకుని అక్కడి నుండి వచ్చేశాం.

ఇరాక్‌లో ఉన్నప్పుడు యెహోవా మమ్మల్ని నడిపించడం చూశాం

 1955 లో ఇరాక్‌లోని బాగ్దాద్‌లో మాకు నియామకం ఇచ్చారు. అక్కడ జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా ప్రకటించవచ్చు. అయితే మేం ఎక్కువగా క్రైస్తవుల్ని వెదికి వాళ్లకు ప్రకటించడానికి కృషిచేశాం.

ఇరాక్‌లో తోటి మిషనరీలతో

 మార్కెట్లో, వీధుల్లో కనిపించే ముస్లింలతో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్లం. డోరిస్‌ ఐతే తను కలిసేవాళ్లకు నచ్చే విషయాలే మాట్లాడేది. ఉదాహరణకు ఆమె వాళ్లతో, “మనం చేసే పనులకు దేవునికి లెక్క అప్పజెప్పాలని మా నాన్న అంటుండేవాడు” అనేది. (రోమీయులు 14:12) ఆ తర్వాత ఆమె, “ఈ మాటలు నాకు జీవితంలో చాలా సహాయం చేశాయి. మీరేమంటారు?” అని అడిగేది.

 వివేచనతో ప్రీచింగ్‌ చేసేలా స్థానిక సహోదరులకు సహాయం చేస్తూ, సుమారు మూడు సంవత్సరాలు బాగ్దాద్‌లో సేవచేశాం. మా మిషనరీ హోమ్‌లో అరబిక్‌ భాషలో మీటింగ్స్‌ ఏర్పాటు చేశాం. అష్షూరు సంతతి వాళ్లమని చెప్పుకునే కొంతమంది క్రైస్తవులు బైబిలు సత్యంపట్ల ఆసక్తి చూపించారు. వాళ్లు మన మీటింగ్స్‌కు వచ్చినప్పుడు మన మధ్యవున్న ప్రేమ, ఐక్యత చూసి మనమే నిజమైన యేసు శిష్యులమని అర్థంచేసుకున్నారు.—యోహాను 13:35.

బాగ్దాద్‌లోని మా మిషనరీ హోమ్‌లో మీటింగ్స్‌ జరుపుకున్నాం

 మేం ప్రకటించిన శాంతి సందేశాన్ని విని వెంటనే స్పందించినవాళ్లలో నికోలస్‌ అజీజ్‌ అనే ఆయన కూడా ఉన్నాడు. ఈయన అర్మేనియా-అష్షూరు సంతతికి చెందిన కుటుంబం నుండి వచ్చాడు. యెహోవా, ఆయన కుమారుడైన యేసు ఒకటి కాదని బైబిలు నుండి బోధించినప్పుడు నికోలస్‌, ఆయన భార్య హెలెన్‌ వెంటనే అంగీకరించారు. (1 కొరింథీయులు 8:5, 6) యూఫ్రటీస్‌ నదిలో నికోలస్‌, మరో 20 మంది బాప్తిస్మం తీసుకున్న రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను!

ఇరాన్‌లో యెహోవా మాకు సహాయం చేశాడు

1958 ఇరాన్‌లో

 ఇరాక్‌లో తిరుగుబాటు చెలరేగింది. అది మొదలైన కొంతకాలానికే, అంటే 1958, జూలై 14న ఇరాక్‌ రాజైన ఫైసల్‌ II చనిపోయాడు. దాంతో మమ్మల్ని ఇరాన్‌కు పంపించారు. అక్కడ దాదాపు ఆరు నెలలపాటు చాలా జాగ్రత్తగా విదేశీయులకు ప్రీచింగ్‌ చేశాం.

 ఇరాన్‌ రాజధాని అయిన టెహ్రాన్‌ నుండి వెళ్లిపోవడానికి కాస్త ముందు, పోలీసులు నన్ను ప్రశ్నించడానికి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీన్నిబట్టి పోలీసులు మమ్మల్ని 24 గంటలూ గమనిస్తున్నారని అర్థమైంది. నా ఇంటరాగేషన్‌ అయిపోయాక డోరిస్‌కి ఫోన్‌ చేసి, పోలీసులు మమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని చెప్పాను. ఎందుకైనా మంచిదని, నేను ఇంటికి రాకుండా డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌లోనే కలుద్దామని తనకు చెప్పాను. దేశం విడిచివెళ్లే వరకు ఇద్దరం కలవకూడదని అనుకున్నాం.

 మేమిద్దరం ఎయిర్‌పోర్ట్‌లో కలిసేవరకు డోరిస్‌ ఒక సురక్షితమైన స్థలంలో ఉంది. పోలీసుల కంటపడకుండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం చాలా కష్టం. అందుకే సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థించింది.

 హఠాత్తుగా కుండపోత వర్షం కురిసింది. పోలీసులతో సహా అందరూ తలదాచుకోవడానికి తలోదిక్కు పరుగెత్తారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా అయిపోయాయి. అప్పుడు డోరిస్‌ చకచకా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసింది. “నిజంగా ఆరోజు కురిసిన వర్షం దేవుడు చేసిన అద్భుతమే” అని డోరిస్‌ అంటూ ఉంటుంది.

 ఇరాన్‌ నుండి వచ్చేశాక మమ్మల్ని వేరే ప్రాంతానికి నియమించారు. అక్కడ వేర్వేరు జాతుల, మతాల ప్రజలకు ప్రకటించాం. 1961 నాటికి నేను ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేస్తున్నాను. ఆ నియామకంలో ఉన్నప్పుడు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఉన్న సహోదర సహోదరీలందరినీ కలవగలిగాం.

పవిత్రశక్తి ఎంత శక్తివంతమైనదో చూశాం

 మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు పవిత్రశక్తి ప్రజల్ని ఎలా ఐక్యం చేస్తుందో ఎన్నో సందర్భాల్లో కళ్లారా చూశాను. అక్కడ నేను పాలస్తీనాకు చెందిన ఎడ్డీ, నికోలస్‌ అనే ఇద్దరితో బైబిలు స్టడీ చేశాను. వాళ్లతో జరిగిన సంభాషణల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు చక్కగా మీటింగ్స్‌కి కూడా వచ్చేవాళ్లు. కానీ రాజకీయ విషయాల్లో బలమైన అభిప్రాయాలు ఉండడంవల్ల కొంతకాలానికి స్టడీ మధ్యలో ఆపేశారు. వాళ్లిద్దరూ సత్యాన్ని అంగీకరించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను. దేవుడు పాలస్తీనా ప్రజలవే కాకుండా, మనుషులందరి సమస్యల్ని తీసేస్తాడని అర్థంచేసుకున్నప్పుడు వాళ్లు మళ్లీ స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. (యెషయా 2:4) వాళ్ల దేశమే గొప్ప అనే అభిప్రాయాన్ని మనసులో నుండి చెరిపేసి, చివరికి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత నికోలస్‌ ప్రాంతీయ పర్యవేక్షకుడు అయ్యాడు.

 నేనూ, డోరిస్‌ కలిసి ఎన్నో దేశాల్లో సేవచేశాం. సహోదరసహోదరీల పరిస్థితులు ఎలా ఉన్నా, వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండడం చూసి చాలా సంతోషంగా అనిపించేది. అప్పటికే వాళ్లు ఎన్నో కష్టాల్ని సహిస్తూ ఉన్నారు. కాబట్టి, విజిట్‌లకు వెళ్లిన ప్రతీసారి వాళ్లకు వీలైనంత ఓదార్పు ఇవ్వాలని అనుకున్నాను. (రోమీయులు 1:11, 12) నా సహోదరసహోదరీల కన్నా నేను ఏవిధంగానూ గొప్పవాడ్ని కాదని ఎప్పుడూ గుర్తుంచుకునేవాడిని. అది మనసులో ఉంచుకుంటేనే వాళ్లకు ఓదార్పు ఇవ్వగలనని అర్థంచేసుకున్నాను. (1 కొరింథీయులు 9:22) ఇబ్బందుల్లో ఉన్నవాళ్లతో ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు చాలా తృప్తిగా అనిపించేది.

 మేం స్టడీ ఇచ్చినవాళ్లలో చాలామంది యెహోవాకు నమ్మకంగా సేవచేయడం చూసినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. యుద్ధాలు జరుగుతున్నప్పుడు, వాళ్లలో కొంతమంది తమ కుటుంబాల్ని తీసుకుని ఆస్ట్రేలియా, కెనడా, యూరప్‌, అమెరికా లాంటి దేశాలకు వెళ్లిపోయారు. ఆ దేశాల్లోని అరబిక్‌ క్షేత్రంలో పనిచేస్తున్న ప్రచారకులకు వీళ్లు చాలా సహాయపడ్డారు. ఈ మధ్యకాలంలో, వాళ్ల పిల్లల్లో కొంతమంది పెరిగి పెద్దవాళ్లై మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో సేవచేయడానికి తిరిగొచ్చారు. ఆధ్యాత్మిక భావంలో వాళ్లందరూ నాకు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లాంటివాళ్లు. వాళ్లందర్నీ కలవడం నాకూ, డోరిస్‌కి మర్చిపోలేని అనుభూతినిచ్చింది.

ఎప్పుడూ యెహోవా మీద ఆధారపడ్డాం

 ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, యెహోవా మా మీద ఎంత శ్రద్ధ చూపించాడో, ఎన్ని రకాలుగా నడిపించాడో అనిపిస్తుంది. యౌవనంలో ఉండగా నాలో ఏర్పడిన వివక్షను, నా దేశమే గొప్ప అనే ఆలోచనను తీసేసుకోవడానికి సహాయం చేసినందుకు యెహోవాకు చాలా రుణపడివున్నాను. సహోదరులు ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఇచ్చిన శిక్షణ వల్లే, వేర్వేరు దేశాల ప్రజలకు సత్యాన్ని ప్రకటించగలిగాను. నేనూ, డోరిస్‌ వేర్వేరు దేశాలకు వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం; కొన్నిసార్లయితే ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ అనుభవాలన్నీ, మా సొంత తెలివితేటల మీద కాకుండా యెహోవా మీదే పూర్తిగా ఆధారపడాలని మాకు నేర్పించాయి.—కీర్తన 16:8.

 నేను ఎన్నో దశాబ్దాలుగా యెహోవా సేవ చేస్తున్నాను. దానిగురించి ఆలోచించినప్పుడు నా పరలోక తండ్రికి ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తుంటుంది. ఏం జరిగినా, ఆఖరికి చంపేస్తామని బెదిరించినా యెహోవాను ఆరాధించడం మాత్రం మానేయకూడదని నా భార్య డోరిస్‌ అంటూ ఉంటుంది. దానికి నేనూ ఒప్పుకుంటాను. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో శాంతి సందేశాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చినందుకు మేం యెహోవాకు ఎప్పుడూ థ్యాంక్స్‌ చెప్తుంటాం. (కీర్తన 46:8, 9) తనమీద ఆధారపడే వాళ్లందర్నీ యెహోవా నడిపిస్తాడు, కాపాడతాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి భవిష్యత్తు గురించి మాకు ఎలాంటి భయమూ లేదు.—యెషయా 26:3.

a ఈ జాతి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, 1980 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలో (ఇంగ్లీషు) 186-188 పేజీలు చూడండి.